Wedding Season 2026 : పెళ్లిళ్ల సీజన్ షురూ.. ఈ తేదీల్లో అదిరిపోయే ముహూర్తాలు.. మిడిల్ క్లాస్‌కు ఊరట..!
Wedding Season 2026 : పెళ్లిళ్లు కేవలం శుభకార్యాలుగానే కాకుండా వ్యాపారులు, తయారీదారులు, ఎంఎస్ఎంఈలు, చేతివృత్తుల కళాకారులు, సేవా రంగాలకు అండగా నిలిచే భారీ ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందాయని సీఏఐటీ అంచనా వేస్తోంది.
Wedding Season 2026
Wedding Season 2026 : దేశవ్యాప్తంగా పెండ్లిళ్ల సీజన్ ప్రారంభమైంది. నెల రోజుల పాటు అంటే.. నవంబర్ 21 నుంచి డిసెంబర్ 15వ తేదీ వరకు పెండ్లి బాజాలు మోగనున్నాయి. అఖిల భారత వర్తకుల సమాఖ్య (CAIT) అంచనా ప్రకారం.. దేశ వ్యాప్తంగా 25 రోజుల వ్యవధిలోనే సుమారు 52 లక్షల వివాహాలు జరగనున్నాయని, వీటి ద్వారా ఏకంగా రూ.7.5 లక్షల కోట్ల విలువైన వ్యాపార లావాదేవీలు నమోదవుతాయని అంచనా వేసింది. ఈ ముహూర్తాల సీజన్.. రిటైల్, తయారీ, ఆతిథ్యం, రవాణా రంగాలకు మంచి బూస్ట్ ఇవ్వనుందని అంచనా వేస్తున్నారు. తద్వారా దేశ ఆర్ధిక వ్యవస్థకి కూడా ఊతం ఇవ్వబోతుందంటున్నారు.
ఏపీ, తెలంగాణలో నవంబర్ 21, 24, 25, 26 తేదీల్లో పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, వ్యాపార ప్రారంభోత్సవాలకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఆ తర్వాత డిసెంబర్ 2 నుంచి 6 వరకు, అలాగే డిసెంబర్ 11, 12 తేదీల్లోనూ పెళ్లిళ్లకు ముహూర్తాలు ఉన్నాయి. డిసెంబర్ 16 నుంచి ధనుర్మాసం ప్రారంభం కానుండటంతో సంక్రాంతి వరకు వివాహాలకు విరామం ఏర్పడనుంది. మళ్లీ మాఘమాసం వరకూ ముహూర్తాలు ఎక్కువగా ఉండవు కాబట్టి ఈలోపే పెళ్లి బాజాలు వాయించాలనే జంటలకు ఎప్పటిలానే ఇది కలసి వచ్చే సీజన్ అయింది.
పెళ్లిళ్లు కేవలం శుభకార్యాలుగానే కాకుండా వ్యాపారులు, తయారీదారులు, ఎంఎస్ఎంఈలు, చేతివృత్తుల కళాకారులు, సేవా రంగాలకు అండగా నిలిచే భారీ ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందాయని సీఏఐటీ
అంచనా వేస్తోంది. ఒక్క ఢిల్లీ – ఎన్సీఆర్ పరిధిలోనే దాదాపు 5 లక్షల వివాహాలు జరగనుండగా, అక్కడ ఏకంగా రూ.2.5 లక్షల కోట్ల మేర వ్యాపారం సాగుతుందని అంచనా వేశారు. ఈ మొత్తం రూ.7.5 లక్షల కోట్ల ఖర్చులో 54శాతం అంటే సుమారు రూ.4 లక్షల కోట్లు వస్తువులు, రిటైల్ కొనుగోళ్ల ద్వారా సమకూరనుండగా.. సర్వీసుల రంగం రూ.3.45 లక్షల కోట్ల వాటాను దక్కించుకోనుంది.
మన తెలుగు రాష్ట్రాల్లో.. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, వరంగల్, కరీంనగర్, కాకినాడ, గుంటూరు సహా టూ టైర్ పట్ణణాల్లోనూ ఇప్పటికే కల్యాణ మండపాలు బుక్కైపోయాయి. వాటితో పాటే ప్రముఖ నగరాల్లోని జ్యువెలరీ షాపులు, వస్త్ర దుకాణాలు, ఫంక్షన్ హాళ్లు, క్యాటరింగ్ సంస్థలు, డెకరేషన్ వ్యాపారులు, ఫోటోగ్రాఫర్లు ఈ సీజన్‌పై భారీ ఆశలు పెట్టుకున్నారు. మొత్తంగా చూస్తే పెళ్లి ముహూర్తాలు కేవలం కుటుంబాల్లోనే కాదు.. వ్యాపార రంగంలోనూ కొత్త కళ తీసుకురాబోతున్నాయి.
మనకి పెళ్లిళ్లంటే కేవలం రెండు కుటుంబాల కలయికే కాకుండా దర్జాకి డాబుసరికి ఓ చిహ్నంగా మారాయి. మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి కుటుంబాల్లో ఒక పెళ్లికి సగటున రూ.39.5 లక్షలు ఖర్చవుతుండగా, డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు సుమారు రూ.58 లక్షలు వరకు అవుతోంది వెడ్‌మీగుడ్ (WedMeGood) సర్వే ప్రకారం హైదరాబాద్‌లో పెళ్లికి సగటున సుమారు రూ.37 లక్షల వరకు ఖర్చవుతోంది సాధారణ పెళ్లిళ్లకు సుమారు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు అవుతుండగా, అత్యంత విలాసవంతమైన వివాహాలకు రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేస్తున్నట్లు అఖిల భారత వర్తకుల సమాఖ్య నివేదికలు చెప్తున్నాయి.
బంగారం ధర తగ్గడంతో కాస్త ఊరట..
వివాహమంటే లోలోపల దిగులు చెందుతూనే ఖర్చు పెట్టడానికి మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి అలవాటు పడిపోయింది. అలాంటివారికోసమేనా అన్నట్లుగా బంగారం ధర ఏకంగా ఈ పదిరోజుల్లోనే 20వేలు తులానికి ధర తగ్గింది. దీంతో ఇదో అందివచ్చిన అవకాశంగా ఆయా కుటుంబాలు భావిస్తాయంటే సందేహం కాదు. 24 కేరట్ల బంగారం తులం లక్షా 25వేలకు దాదాపుగా దిగి వచ్చింది. ఓ బంగారపు గొలుసు.. ఉంగరం, అల్లుడికి పెళ్లి కానుకగా చదివించే పేదింటి అత్తమామలకు ఈ రేటు కాస్త ఊరటనే చెప్పాలి. ఐతే రెండేళ్ల క్రితం ఇదే డబ్బుకు నాలుగుతులాల బంగారం వచ్చి ఉండేదనేది పాత మాట.. కానీ, పసిడి ధర ఇలా గ్గుతుండటం మాత్రం తెలుగు లోగిళ్లకి శుభకార్యాల సీజన్లో అసలైన శుభవార్తగా చూడాలి.
