Telangana Govt : ఇందిరమ్మ కుటుంబ బీమా పథకంలో కీలక మార్పులు.. కొత్త మార్గదర్శకాలు విడుదల!
Telangana Government : ఇందిరమ్మ కుటుంబ బీమాకు సంబంధించి ప్రభుత్వం కొత్తగా మార్గదర్శకాలు జారీ చేసింది.
Indiramma Family Insurance Scheme
Telangana Government : రాష్ట్రంలోని రేషన్ కార్డు కలిగిన వారందరికీ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం (ఐకేజీబీపీ)ను కాంగ్రెస్ సర్కార్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద నమోదైన వ్యక్తి మరణించిన సమయంలో వారి నామినీలకు రూ.5లక్షల బీమా సాయం అందేలా ప్రభుత్వం ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇటీవల సంగారెడ్డి జిల్లాలో జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు. అయితే, ఇందులో కీలక మార్పులు చేసినట్లు తెలుస్తోంది. తాజాగా.. పథకంకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది.
Also Read : Tamil Nadu Politics : ఏపీ దెబ్బకు తమిళనాడులో ప్రకంపనలు.. విజయ్ సర్కార్కు కొత్త తలనొప్పి.. డేటా లీక్ వివాదం!
ప్రభుత్వ మార్గదర్శకాలు ఇలా..
♦ వివిధ శాఖల ద్వారా ఇప్పటికే అమలు చేస్తున్న జీవిత బీమా, ఇతర బీమా పథకాలు యథావిధిగా కొనసాగుతాయి. వాటి పరిధిలోకి రాని కుటుంబాలను మాత్రమే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంలో నమోదు చేయాలని రా్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది.
♦ ఈ పథకం కింద ప్రతి కటుంబం నుంచి ఒక వ్యక్తి మాత్రమే బీమా ఉంటుంది. కుటుంబ పెద్ద లేదంటే సంపాదించే వ్యక్తి బీమా పరిధిలోకి వస్తారు.
♦ బీమా పథకంకు నమోదు సమయంలో వారి వయసు 18 నుంచి 59ఏళ్ల మధ్య ఉండాలి.
♦ వయస్సు ధ్రువీకరణకు ఆధార్ ప్రామాణికం. ఆధార్ కార్డులో పుట్టిన తేదీ తప్పుగా ఉన్నట్లయితే దానిని సరి చేయించుకున్న తరువాతే నమోదు చేసుకోవాలి.
♦ బీమా చేసే వ్యక్తి తమ ఆధార్ కార్డు, రేషన్ కార్డు పత్రాలతోపాటు ఫోన్ నెంబర్ నమోదు చేయాలి.
♦ ప్రత్యేక వెబ్, మొబైల్ అప్లికేషన్లలోనే నమోదు ప్రక్రియ సాగాలి. ఓటీపీ ఆధారితంగా ధ్రువీకరణ జరగాలి.
♦ ఒకరి కంటే ఎక్కువ మంది నామినీలు ఉంటే రూ.5లక్షలను నామినీలకు ఎవరికి ఏ మేరకు ఇవ్వాలో తెలియజేయాలి.
♦ నామినీ మైనర్ అయితే.. మైనర్ తరపున క్లెయిమ్ స్వీకరించడానికి మేజర్ అయిన సంరక్షకుని పేరు నమోదు చేయాలి.
♦ రేషన్ కార్డు నంబరునే దరఖాస్తు సంఖ్యగా ఉపయోగించాలి. ఇందులోనే వివరాలు నమోదు చేయాలి. ఇదే ప్రత్యేక గుర్తింపుగా సంఖ్యగా ఉంటుంది.
♦ ఈ-కేవైసీ పెండింగ్లో ఉన్న రేషన్ కార్డులు కలిగిన కుటుంబాలు ఆ ప్రక్రియ పూర్తి చేసుకొని రావాలి.
♦ బీమా కోసం ప్రతిపాదిత వ్యక్తి స్వయంగా శిబిరానికి హాజరై నామినీల వివరాలు అందిస్తేనే నమోదు చేయాలని ప్రభుత్వం మార్గదర్శకాల్లో సూచించింది. అనారోగ్యం లేదంటే దివ్యాంగులు హాజరు కాలేని సందర్భంలో శిబిరం ఇంఛార్జి వారి ఇంటికి వెళ్లి వివరాలు నమోదు చేసేలా ఏర్పాట్లు చేయాలని పేర్కొంది.
♦ ఒకవేళ బీమా చేసే వ్యక్తి కంటే ముందే నామినీ మరణించినా లేదంటే బీమా చేసే వ్యక్తి ఆ నామినేషన్ ను మార్చుకోవాలనుకున్నా నిబంధనలకు లోబడి మార్పు చేయాల్సి ఉంటుంది.
♦ బీమా కవరేజీ ప్రారంభమైన తేదీ నుంచి ఆ పాలసీ సంవత్సరం ముగిసే వరకు బీమా రక్షణ ఉంటుంది.
♦ బీమా ముగిసే కాలంలో బీమా చేసిన వ్యక్తి గరిష్ఠ వయోపరిమితిని దాటినా ఆ పాలసీ సంవత్సరం ముగిసే వరకు కవరేజీ కొనసాగుతుంది.
