Raj Gopal Reddy : సీఎం రేవంత్ టార్గెట్‌గా రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన కామెంట్స్.. చరిత్ర ఎప్పటికీ క్షమించదు..
Komatireddy Raj Gopal Reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తాజాగా.. ఆ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.
Congress MLA Komatireddy Rajagopal Reddy
Komatireddy Raj Gopal Reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రతిపక్ష పార్టీ నేతల విమర్శలకంటే.. కాంగ్రెస్ పార్టీలోని నేతలే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటుండటం ఆ పార్టీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్‌గా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలకు ఎవరి పేరు ప్రస్తావించకుండా సీఎం రేవంత్ రెడ్డి సిద్ధిపేట బహిరంగ సభలో కౌంటర్ ఇచ్చారు. కాగా.. తాజాగా.. మరోసారి రాజగోపాల్ రెడ్డి ఎక్స్ వేదికగా తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు.
మునుగోడు నియోజకవర్గానికి నిధుల కేటాయింపులో వివక్ష చూపుతున్నారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఇటీవల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కొడంగల్, మధిర, హుజూర్నగర్ నియోజకవర్గాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని.. మునుగోడు అభివృద్ధిని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. నిధులు ఇవ్వకపోతే మరో కురుక్షేత్రం తప్పదని హెచ్చరించారు. అంతేకాదు.. సీఎం రేవంత్ రెడ్డి పదవిలో ఇంకో రెండేళ్లే ఉంటారంటూ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించినట్లు తెలిసింది. రాజగోపాల్ వ్యాఖ్యలను కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ గా తీసుకుంది.
రాజగోపాల్ రెడ్డి విమర్శలకు సంబంధించిన ఆడియో, వీడియో క్లిప్పింగులు, పేపర్ కటింగులతో మహేశ్ గౌడ్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. మరోవైపు, ఈ వ్యవహారంపై మీడియాతో మాట్లాడిన మహేశ్ గౌడ్.. రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన విమర్శలతో పాటు గతంలో ఆయన చేసిన ఆరోపణలను పీసీసీ, ఏఐసీసీ నాయకత్వం పరిశీలిస్తాయని చెప్పారు. హైకమాండ్ ఆదేశాల మేరకు ఆయనపై నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు.
అయితే, సిద్ధిపేటలో గురువారం సాయంత్రం జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మేము వచ్చాక మహిళలు, రైతులు, అన్ని వర్గాల ప్రజలకు అనేక పథకాలను అమలు చేస్తున్నాం. ఈ ప్రభుత్వం ఇంకో రెండేళ్లు ఉంటుంది. ఏమైనా చేయాల్సినవి ఉంటే చెప్పండి.. చేస్తానని సీఎం రేవంత్ అన్నారు. వెనుకటి పెద్దోళ్లు చెప్పారు చెడు చెవిలో చెప్పాలి.. మంచి మైకులో చెప్పాలని. నిన్నమొన్న మావోళ్లు కొంతమంది.. వాళ్లకు ఏమైందో ఏమో.. చెడు అంతా మైకులో చెబుతున్నారు.. మంచి ఇంటికొచ్చి చెవిలో చెబుతున్నారు. ఇలాంటి వాళ్లు కొంతమంది ఉంటారు. వారిని ఎలాగూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎర్రగడ్డకు తీసుకుపోతారు అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించి చేసినవేనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.
శుక్రవారం రాజగోపాల్ రెడ్డి తన ఎక్స్ ఖాతా వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పేరు ఎత్తకుండా పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ‘‘ఉన్నత పదవుల్లో ఉన్న ముఖ్య నేతలు హుందాగా మాట్లాడాలి. అధికారం ఉందన్న అహంకారంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ప్రజలు హర్షించరని గ్రహించాలి. అదృష్టం కొద్దీ దక్కిన అధికారంతో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడే, ప్రజావసరాలను విస్మరించి దుర్మార్గపు పాలన సాగించే పాలకులను తెలంగాణ ప్రజానీకం, చరిత్ర ఎన్నిటికీ క్షమించదని మరువరాదు. ఇచ్చిన హామీలను అమలు చేసేలా ధర్మంగా, నిజాయితీగా పాలన సాగించేలా ముఖ్య నేతలకు సద్బుద్ధి, ఆత్మ పరిశీలనా జ్ణానాన్ని ప్రసాదించాలని ఆ అయ్యప్ప స్వామిని వేడుకుంటున్నాను.. స్వామియే శరణం అయ్యప్ప. అంటూ ట్వీట్ లో రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.
