Indiramma Insurance Scheme : ఇందిరమ్మ బీమాపై తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా.. నవంబర్ 19 నుంచే..
Indiramma Insurance Scheme : తెలంగాణలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభమైంది. రేషన్ కార్డు లేకపోయినా అర్హులకు రూ.5 లక్షల బీమా లభిస్తుంది. దరఖాస్తు విధానం, అర్హతలు, చివరి తేదీ వివరాలివే..
Indiramma Insurance Scheme
- రేషన్ కార్డు లేకపోయినా రూ.5 లక్షలు..
- పేద కుటుంబాలకు అండగా ఇందిరమ్మ బీమా..
- ఒక్క రూపాయి కట్టకుండానే లబ్ధి
- రేషన్ కార్డు లేకున్నా రూ.5 లక్షల బీమా పొందొచ్చు
Indiramma Insurance Scheme : తెలంగాణలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వం మరో తీపి కబురు చెప్పింది. కుటుంబంలో సంపాదించే వ్యక్తికి ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ఆ కుటుంబం రోడ్డున పడకుండా ఆర్థికంగా అండగా నిలిచేందుకు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు ఏకంగా రూ.5 లక్షల జీవిత బీమా అందనుంది. ముఖ్యంగా రేషన్ కార్డు లేని వారు కూడా ఈ పథకానికి అప్లయ్ చేసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఒక్క రూపాయి కూడా కట్టనక్కర్లేదు :
నవంబర్ 19 నుంచి ఈ కొత్త ఇందిరమ్మ బీమా పథకం అమల్లోకి వచ్చింది. సిద్దిపేటలో జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు. ఇందులో మరో మంచి విషయం ఏంటంటే.. లబ్ధిదారులు బీమా కోసం ఒక్క రూపాయి కూడా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ఆ ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. కుటుంబంలో ఒకరి కన్నా ఎక్కువ మంది సంపాదిస్తున్నా.. వారిలో ఎవరికి బీమా చేయించుకోవాలనేది కుటుంబ సభ్యులే నిర్ణయించుకోవచ్చు..
ఎవరు అర్హులు? :
18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు ఈ పథకానికి అర్హులు. రేషన్ కార్డు ఉన్నవారితో పాటు అదిలేని వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, నామినీ వివరాలు రిజిస్టర్ చేయడం తప్పనిసరి. ఒకరి కన్నా ఎక్కువ మంది నామినీలను చేర్చాలనుకుంటే వారికి ఎంత వాటా ఇవ్వాలనేది కూడా తెలియజేయాలి..
ఎలా అప్లయ్ చేసుకోవాలి? :
నవంబర్ 19 నుంచి డిసెంబర్ 18 వరకు గ్రామ పంచాయతీలు, వార్డు కార్యాలయాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నారు. ఆధార్ కార్డుతో పాటు అందుబాటులో ఉన్న కుటుంబ వివరాలను తీసుకెళ్లి అప్లయ్ చేసుకోవచ్చు. రేషన్ కార్డు లేని వారికి ప్రత్యేక ఫారం అందుబాటులో ఉంటుంది. అంతేకాదు, అధికారులు ఇంటింటికీ వచ్చి వివరాలు సేకరించనున్నారు..
త్వరలో వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా కూడా స్వయంగా అప్లయ్ చేసుకునే అవకాశం కల్పించనున్నారు. కుటుంబానికి ఆర్థిక భరోసా ఇచ్చే ఈ పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది..
