Nagarjuna Sagar Row : సాగర్‌లో ఏపీ ప్రాజెక్ట్ కలకలం.. కారు గేర్.. రేవంత్ సర్కార్‌లో ప్రకంపనలు! అసలు కథ ఇదే..
Nagarjuna Sagar Row : నాగార్జున సాగర్ కుడివైపున ఏపీ నిర్మాణాలు. జలదోపిడికి సర్వం సిద్ధం.. రేవంత్ సర్కార్ చేతగాని తనం అంటూ బీఆర్ఎస్ చేసిన రచ్చ తెలంగాణ సర్కార్‌లో కొత్త చర్చకు తెరదీసిందట.
Nagarjuna Sagar Row
AP Telangana Nagarjuna Sagar Row : ఏపీ, తెలంగాణ ఉమ్మడి ప్రాజెక్టు. అక్కడ ఏ నిర్మాణం జరగాలన్నా రెండు రాష్ట్రాల అంగీకారం మస్ట్. అన్నింటికి మించి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ పర్మిషన్ కూడా అవసరం. ఇవేమి లేకుండానే నాగార్జున సాగర్ నుంచి నీళ్లు తరలించేందుకు ఏపీ సొరంగం తవ్వుతుందని బీఆర్ఎస్ వివరాలు బయటపెట్టడంతో రాజకీయ రచ్చ మొదలైంది. రేవంత్ సర్కార్ అసమర్ధత అంటూ గులాబీ పార్టీ బాణాలు ఎక్కుపెడుతుండటంతో..ప్రభుత్వం అలర్ట్ అయ్యిందట. ప్రతిపక్ష పార్టీ రచ్చచేసే వరకు ఏపీ సొరంగం తవ్వినట్లు ఇరిగేషన్ మంత్రి, అధికారులు గుర్తించకపోవడం ఏంటంటూ సీఎం రేవంత్ గుస్సా అవుతున్నారట. అధికారులపై చర్యలు రెడీ అవుతున్నా..ఈ ఇష్యూను ఎలా సేఫ్ ల్యాండింగ్ చేయాలనే దానిపై కసరత్తు చేస్తోందట సర్కార్.
Also Read : Jagan vs Sharmila : యలహంక ప్యాలెస్ వివాదం మరో మలుపు.. షర్మిలకు జగన్ షాక్!
నాగార్జున సాగర్ కుడివైపున ఏపీ నిర్మాణాలు. జలదోపిడికి సర్వం సిద్ధం.. రేవంత్ సర్కార్ చేతగాని తనం అంటూ బీఆర్ఎస్ చేసిన రచ్చ తెలంగాణ సర్కార్‌లో కొత్త చర్చకు తెరదీసిందట. అసలు ఏపీ అక్కడ ఏ ప్రాజెక్టు కడుతుంది.? ఎప్పుడు నిర్మాణాలు స్టార్ట్ చేసింది.? ఇంత జరుగుతున్న ఇరిగేషన్ ఆఫీసర్లు ఏం చేస్తున్నట్లు అని సీఎం రేవంత్ ఆరా తీశారట. ప్రతిపక్షం విమర్శించే వరకు..వాటర్ వార్ లాంటి సెన్సిటివ్ ఇష్యూలో అధికారులు అలర్ట్‌గా లేకపోవడమేంటని గుస్సా అయినట్లు తెలుస్తోంది. ఏపీ, తెలంగాణ మధ్య జలజగడం కొత్తేమి కాదు. ఎప్పటికప్పుడు సరికొత్త అంశంతో నీళ్ల లొల్లి న్యూస్ హెడ్‌లైన్‌గా ఉంటూనే వస్తోంది.
ఇప్పుడు మరోసారి నాగార్జున సాగర్ ప్రాజెక్టు సెంట్రిక్‌గా.. తెలంగాణ గట్టుపై పొలిటికల్ ఫైట్ నడుస్తుంది. సాగర్‌కు కుడివైపున ఏపీ పెద్ద సొరంగం కట్టి..నీటిని తరలించేందుకు ఏపీ సర్కార్ సిద్ధమైందని..రేవంత్ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఊరుకుండిపోయిందని మండిపడుతోంది బీఆర్ఎస్. ఏపీ సర్కార్ ఏడాది కాలంగా సాగర్ కుడివైపున నిర్మాణాలు చేస్తుందని.. అయినా తెలంగాణ సర్కార్ మొద్దునిద్రను వీడట్లేదని ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఫోటోలు రిలీజ్ చేసి మరీ..అక్కడ ఎంతవరకు నిర్మాణాలు పూర్తయ్యాయో బయట పెట్టారు. ఆ తర్వాత మాజీమంత్రి హరీశ్‌రావు అటాక్ స్టార్ట్ చేశారు. దీంతో తాను తెలంగాణ బిడ్డను..ఈ గడ్డకు నీటి విషయంలో అన్యాయం చేస్తానా అంటూ..సిద్దిపేట సభ వేదికగా రిప్లై ఇచ్చే ప్రయత్నం చేశారు సీఎం రేవంత్‌రెడ్డి. అయినా రేవంత్ ప్రభుత్వ అసమర్థత వల్లే సాగర్‌లో ఏపీ నిర్మాణాలు చేపట్టిందని అటాక్ చేస్తూనే ఉంది బీఆర్ఎస్. ఏపీ చేపడుతున్న నిర్మాణాలపై అభ్యంతరాలు తెలుపుతూ ఆల్రెడీ KRMBకి లేఖ రాసింది తెలంగాణ సర్కార్.
మరోవైపు నీటి పారుదల శాఖ మంత్రి, అధికారుల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్‌గా ఉన్నారట. నాగార్జునసాగర్ నుంచి ఆంధ్రప్రదేశ్ చేపట్టిన పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు వ్యవహారం తెలంగాణ ప్రభుత్వంలో తీవ్ర అలజడి సృష్టిస్తుందట. ఏపీ కడుతున్న ప్రాజెక్టు వివరాలు ప్రభుత్వానికి, నీటిపారుదల శాఖకు తెలియకపోవడంపై నాగార్జునసాగర్ సర్కిల్ ఇంజినీర్లపై చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే సర్కిల్ ఇంజినీర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఈఈ, డీఈ, ఏఈలపైనా ఎందుకు చర్యలు తీసుకోకూడదని ఉన్నతాధికారులు ప్రశ్నిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాగర్ జలాశయం నుంచి సంవత్సరానికి దాదాపు 1.86 టీఎంసీల నీటిని పల్నాడు ప్రాంతంలోని వందలాది గ్రామాలకు అందించేందుకు మూడు ఇన్‌టేక్ వెల్స్‌తో పాటు అనుబంధ నిర్మాణాలు చేపట్టింది. ఈ పనులు విజయపురి సౌత్ ప్రాంతంలో కొనసాగుతున్నాయి. గత ఏడాది కాలంగా ఈ ప్రాజెక్ట్ కొనసాగుతున్నా తెలంగాణ నీటి పారుదల శాఖకు, సంబంధిత అధికారులకు, ఇంటెలిజెన్స్ వ్యవస్థకు తెలియకపోవడం ఏంటనే చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా సాగుతోంది. తెలంగాణకు చెందిన నాగార్జునసాగర్ సర్కిల్ ఇంజినీర్లు ఈ పనుల విషయాన్ని..నీటిపారుదల శాఖకు, ప్రభుత్వానికి నివేదించకపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
నల్గొండ జిల్లా కలెక్టర్ నుంచి క్షేత్రస్థాయి వాస్తవాలపై నివేదిక కోరిందట ప్రభుత్వం. కలెక్టర్ తన రిపోర్ట్‌ను ప్రభుత్వానికి అందజేయడం కూడా జరిగిపోయిందట. నీటి పారుదల శాఖ సీఈ కూడా స్పెషల్ రిపోర్టును సబ్మిట్ చేశారట. ఈ వివాదం కేవలం ఇంజినీర్ల నిర్లక్ష్యం వరకే పరిమితం కాదని అంటున్నారు. నాగార్జునసాగర్ రెండు తెలుగు రాష్ట్రాలకు సమానంగా ముఖ్యమైన జలాశయం. దీని నీటి వినియోగం, నిల్వ స్థాయిలు, డెడ్ స్టోరేజ్ వంటి అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య గతంలోనూ చాలాసార్లు వివాదాలు తలెత్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఏపీ చేపట్టిన ప్రాజెక్టు..ఇన్‌టేక్ వెల్స్ నిర్మాణం డెడ్ స్టోరేజ్ మట్టం కంటే దిగువన ఉండటం తెలంగాణకు మరింత ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణ అధికారులు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు, కేంద్ర జలశక్తి శాఖకు లేఖలు రాసి పనులను వెంటనే నిలిపివేయాలని కోరారు.
ఏపీ మాత్రం ఇది తమకు కేటాయించిన వాటా పరిధిలోనే ఉందని, తాగునీటి అవసరాల కోసమే చేపట్టినట్లు వాదిస్తోంది. ఈ నేపథ్యంలో నీటిపారుదల శాఖలోని కీలక సర్కిళ్ల సీఈలు ఇద్దరు సెలవుపై వెళ్లడం కూడా చర్చనీయాంశం అవుతోంది. ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకంలోని తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు కీలక దశలో ఉన్న సమయంలో మంచిర్యాల సీఈ నరసింహ మూర్తి సెలవుపై వెళ్లారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పరిధిలోని నాగర్ కర్నూల్ సీఈ విజయభాస్కర్‌రెడ్డి కూడా ఇటీవల సెలవు తీసుకున్నారు. పని ఒత్తిడి, వ్యక్తిగత కారణాలతో సెలవు పెట్టినట్లు శాఖ వర్గాలు చెబుతున్నాయి. వీళ్లిద్దరు సెలవులో వెళ్లడానికి.. ప్రభుత్వం చర్యలకు సిద్ధం అవడానికి సంబంధం ఉందో లేదో తెలియదు కానీ.. ఏపీ చేపట్టిన పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు వ్యవహారం మాత్రం తెలంగాణ సర్కార్‌లో ఉలిక్కిపాటుకు దారితీసిందట.
జిల్లా, సంబంధిత మంత్రికి కూడా ఈ విషయం తెలియకపోవడం, నాగరునసాగర్ నీటి పారుదల శాఖ అధికారులు ముందే గుర్తించకపోవడం ఏంటనే ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయట. ఏపీ పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు కడుతున్నట్లు..తెలిసి కూడా దాచారా.? అంతర్గతంగా ఇంకా ఏమైనా జరిగిందా అని ఆరా తీస్తున్నారట తెలంగాణ ఇంటిలిజెన్స్ ఆఫీసర్లు. సాగర్‌లో ఏపీ చేపట్టిన నిర్మాణాల వ్యవహారం ఎటు టర్న్ తీసుకుంటుందో వేచి చూడాలి మరి.
