RBI Gold Reserves : విదేశాల్లో బంగారం భద్రమేనా? 165 టన్నుల పసిడి వెనక్కి తెచ్చిన ఆర్బీఐ.. అసలు రీజన్ ఇదే!
RBI Gold Reserves : విదేశాల్లో నిల్వ చేసిన 165 టన్నుల బంగారాన్ని భారత్కు ఆర్బీఐ తీసుకొచ్చింది.. రష్యా ఆస్తుల స్తంభన తర్వాత భారత్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది? దేశ బంగారు నిల్వల వెనుక అసలు వ్యూహం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
RBI Gold Reserves
- బంగారం విషయంలో భారత్ కీలక నిర్ణయం..
- యుద్ధం ఎఫెక్ట్.. దేశానికి చేరిన వందల టన్నుల బంగారం
- స్వదేశంలోనే భారీగా పెరిగిన బంగారు నిల్వలు
RBI Gold Reserves : ప్రపంచంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి.. ఒకవైపు యుద్ధాలు.. మరోవైపు ఆర్థిక అనిశ్చితులు.. ఇంకోవైపు దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు.. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి దేశం తన ఆర్థిక భద్రతపై ప్రత్యేకంగా దృష్టి పెడుతోంది. భారత్ కూడా ఇదే బాటలో కీలక అడుగు వేసింది. విదేశాల్లో భద్రపరిచిన బంగారాన్ని క్రమంగా స్వదేశానికి తరలిస్తోంది..
తాజా గణాంకాల ప్రకారం.. 2025 సెప్టెంబర్ నుంచి 2026 సెప్టెంబర్ వరకు ఏకంగా 165 టన్నుల బంగారాన్ని ఆర్బీఐ భారత్కు తీసుకొచ్చింది. దీంతో దేశీయంగా నిల్వ చేసిన బంగారం 575.82 టన్నుల నుంచి 740.13 టన్నులకు చేరింది. అంటే.. మన బంగారంలో ఎక్కువ భాగం ఇప్పుడు దేశీయ వాల్ట్లలోనే భద్రంగా ఉంది..
బంగారం నిల్వలు 880.52 టన్నులే :
అయితే, ఇక్కడో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.. భారత్ మొత్తం బంగారు నిల్వలు భారీగా పెరిగినట్లు కనిపిస్తున్నా.. వాస్తవానికి ఏడాది క్రితం 880.18 టన్నులుగా ఉన్న మొత్తం నిల్వలు ప్రస్తుతం 880.52 టన్నులుగా మాత్రమే ఉన్నాయి. అంటే.. కొత్తగా బంగారం కొనడం కన్నా విదేశాల్లో ఉన్న నిల్వలను స్వదేశానికి తరలించడంపైనే ఎక్కువ ఫోకస్ పెట్టింది..
బంగారం వెనక్కి ఎందుకంటే? :
మరి ఇంత హడావుడిగా బంగారాన్ని ఎందుకు తెస్తున్నట్లు? దీనికి రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు కూడా కారణంగా చెప్పుకోవచ్చు. పాశ్చాత్య దేశాలు రష్యా విదేశీ ఆస్తులను స్తంభింపజేయడం ప్రపంచ దేశాలను ఆలోచనలో పడేసింది.. విదేశాల్లో ఉన్న జాతీయ ఆస్తులపై ఇతర దేశాల నిర్ణయాల ప్రభావం పడే అవకాశం ఉందనే ఆందోళన పెరిగింది..
నిజానికి విదేశాల్లో బంగారం నిల్వ చేయడం కొత్త విషయమేమీ కాదు.. అంతర్జాతీయ లావాదేవీలు, చెల్లింపులు, బంగారం మార్పిడి వంటి అవసరాలకు లండన్లోని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వంటి కేంద్రాల్లో నిల్వలు ఉపయోగపడతాయి..
అయితే, రానురాను పరిస్థితులు మారుతున్న కొద్దీ భారత్ తన వ్యూహాన్ని కూడా మార్చుకుంటోంది. మొత్తం బంగారాన్ని విదేశాల్లో ఉంచకుండా దేశీయంగా నిల్వలను పెంచుకోవడమే ప్రధానంగా ఆర్థిక భద్రతకు ప్రాధాన్యత ఇస్తోంది. ఇది కేవలం బంగారం స్వదేశానికి తరలించడమే కాదు.. అనిశ్చిత ప్రపంచంలో ముందస్తు జాగ్రత్తగా చెబుతున్నారు ఆర్థిక నిపుణులు..
