Women Reservation Bill : మళ్లీ పార్లమెంట్ ముందుకు మహిళా రిజర్వేషన్ బిల్లు.. అప్పటికీ ఇప్పటికీ ఏం మారింది..! ఎన్డీయే బలం ఎంత పెరిగింది?
Women Reservation Bill : దేశ రాజకీయాల్లో మరోసారి మహిళా రిజర్వేషన్ల బిల్లు చర్చనీయాంశంగా మారింది. ఈ బిల్లును పార్లమెంట్లో మళ్లీ ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోందన్న ప్రచారం ఊపందుకుంది.
Women Reservation Bill
Women Reservation Bill : దేశ రాజకీయాల్లో మరోసారి మహిళా రిజర్వేషన్ల బిల్లు చర్చనీయాంశంగా మారింది. ఈ బిల్లును పార్లమెంట్లో మళ్లీ ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోందన్న ప్రచారం ఊపందుకుంది. అయితే, బిల్లుకు అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ సాధించడం అధికార ఎన్డీఏ కూటమికి సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలో ప్రాంతీయ పార్టీల మద్దతుపై కేంద్ర ప్రభుత్వం ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
పార్లమెంట్ సమావేశాలను తిరిగి నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నవంబర్ 30 నుంచి లోక్‌సభ, డిసెంబర్ 2 నుంచి రాజ్యసభ సమావేశాలు జరగనున్నాయి. డిసెంబర్ 3 వరకు ఈ సమావేశాలు కొనసాగే అవకాశం ఉంది. అధికారికంగా అవసరమైన ప్రభుత్వ కార్యకలాపాల కోసమే సమావేశాలు నిర్వహిస్తున్నట్లు కేంద్రం ప్రకటించినప్పటికీ.. మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును మళ్లీ తీసుకురావచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
త్వరలో జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపడిన మహిళా రిజర్వేషన్ బిల్లులో ఈ సందర్భంగా కొన్ని సవరణలు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల ఆందోళనను దృష్టిలో పెట్టుకొని.. జనాభాతో సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాల్లో లోక్ సభ సీట్ల సంఖ్యను 50శాతం పెంచే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.
గతంలో అలా.. ఇప్పుడు మారిందేంటి.. ?
లోక్‌సభలో ప్రస్తుతం 540 మంది సభ్యులున్నారు. అందరూ ఓటింగ్‌లో పాల్గొంటే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందడానికి 360 మంది సభ్యుల మద్దతు అవసరం. అయితే, ఏప్రిల్ నాటితో పోలిస్తే ఇప్పుడు ప్రభుత్వ, ప్రతిపక్ష బలాబలాలు చాలా మారాయి. విపక్ష ఇండియా కూటమిలో అప్పుడు బలంగా కనిపించిన తృణమూల్ కాంగ్రెస్ ఇటీవల రెండుగా చీలిపోయింది. ఆ పార్టీకి చెందిన 30 మంది తిరుగుబాటు ఎంపీలు నేషనలిస్టు సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరి ఎన్డీయేకు మద్దతు ప్రకటించారు. దీంతో ప్రస్తుతం ఎన్డీఏకు సుమారు 320 మంది ఎంపీల బలం ఉంది. మరో 40 మంది ఎంపీల మద్దతు అవసరమవుతుంది. డీఎంకే, ఎన్సీపీ (శరద్ పవార్), వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు కీలకంగా మారే అవకాశం ఉంది. ఈ మూడు పార్టీలకు కలిపి 34 మంది ఎంపీల బలం ఉంది. ఇతర పార్టీల సభ్యులు ముగ్గురు, స్వతంత్రులు ముగ్గురు ఎన్డీయే బయట నుంచి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. అంచనాల ప్రకారం వీరంతా మద్దతు ఇస్తే.. ఎన్డీయేకు పూర్తి మెజారిటీ లభించే అవకాశం ఉంటుంది. దీంతో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందుతుందనే ధీమాతో ఎన్డీయే నేతలు ఉన్నట్లు తెలుస్తోంది.
గురువారం ఢిల్లీలో జరిగిన రాజ్యాంగ గౌరవ సభలో హోమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. మహిళలకు చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పించారని, దాన్ని విపక్షాలు సహా ఎవరూ అడ్డుకోలేరని పేర్కొన్నారు. తాజా పరిణామాలు చూస్తుంటే ఈసారి పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ల బిల్లు ఖచ్చితంగా ఆమోదం పొందుతుందన్న దీమాతో ఎన్డీయే ఉన్నట్లు కనిపిస్తోంది. 2029 లోక్‌సభ ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలన్నది ప్రతిపాదనలో ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.
గతంలో ఎందుకు ఆమోదం పొందలేదు..?
ఈ ఏడాది ఏప్రిల్ 17న లోక్‌సభలో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లు అవసరమైన మెజారిటీ సాధించలేకపోయింది. అప్పట్లో 528 మంది ఎంపీలు ఓటింగ్‌లో పాల్గొనగా.. 298 మంది బిల్లుకు అనుకూలంగా, 230 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో బిల్లు వీగిపోయింది.
ఇప్పుడు మరోసారి బిల్లును తీసుకొచ్చే అవకాశాలు ఉండటంతో రాజకీయ పార్టీల వైఖరిపై ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల మద్దతు, దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు సంబంధించిన హామీలు ఈ బిల్లు భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.
