Buying Gold Without Bill : బంగారం రేటు తగ్గిందని.. బిల్లు లేకుండా బ్లాక్ మనీతో గోల్డ్ కొంటున్నారా? మీ పని గోవిందా?
Buying Gold Without Bill : బంగారం ధరలు తగ్గడంతో బిల్లు లేకుండా, బ్లాక్ మనీతో గోల్డ్ కొనాలని చూస్తున్నారా? జీఎస్టీ తప్పించుకోవాలనే ఆలోచనతో బిల్లు లేకుండా కొనుగోలు చేస్తే నాణ్యత నిరూపించడం నుంచి గోల్డ్ లోన్, పాత నగల మార్పిడి, ఆదాయపు పన్ను సమస్యల వరకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో తెలుసా?
Buying Gold Without Bill
- బంగారం ధరలు భారీగా తగ్గుదల
- ఆల్ టైమ్ హై నుంచి తగ్గిన రేట్లు
- దాచిన డబ్బుతో బంగారం కొనాలనుకుంటున్నారా?
- బిల్లు లేకుండా తీసుకుంటే బెటర్ అనే ఆలోచన ఉందా?
- అలాంటి పని చేయడం వల్ల వచ్చే సమస్యలు ఏంటి?
Buying Gold Without Bill : బంగారం ధరలు తగ్గుతున్నాయంటే చాలు.. పసిడి ప్రియుల్లో కొనుగోళ్ల సందడి మొదలవుతుంది. ఆల్ టైమ్ హై నుంచి ధరలు దిగిరావడంతో చాలామంది ఇప్పుడు బంగారం కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే, ఈ క్రమంలో కొందరు మాత్రం ఒక అడుగు ముందుకేసి.. గతంలో దాచుకున్న లెక్కల్లో చూపని డబ్బుతో బంగారం కొనాలని చూస్తున్నారు..
అంతేకాదు, జీఎస్టీ తప్పించుకోవచ్చనే ఉద్దేశంతో బిల్లు లేకుండానే బంగారం తీసుకోవాలనుకుంటున్నారు. కానీ, ఇక్కడే అసలు చిక్కు మొదలవుతుంది. ఈ రోజు కొంత డబ్బు ఆదా చేసుకోవాలని చూస్తే.. రేపు అంతకంటే ఎక్కువ నష్టపోయే పరిస్థితి రావచ్చు..
బిల్లు లేకపోతే ఎదురయ్యే సమస్యలివే..
1. నాణ్యతపై ఆధారం ఉండదు :
బిల్లు లేకుండా బంగారం కొంటే అది నిజంగా ఎంత స్వచ్ఛత కలిగినదో మీరు ఎంత ధరకు కొనుగోలు చేశారో నిరూపించడం కష్టమవుతుంది. భవిష్యత్తులో నాణ్యత విషయంలో వివాదం వస్తే మీ దగ్గర సరైన ఆధారం ఉండదు..
2. పాత నగలు ఇచ్చి కొత్తవి కొనాలన్నా ఇబ్బందే :
భవిష్యత్తులో పాత బంగారు నగలు ఇచ్చి కొత్త ఆభరణాలు తీసుకోవాలనుకుంటే సమస్య రావచ్చు. జ్యువెలరీ షాపులు కొనుగోలు వివరాలు, బంగారం స్వచ్ఛత, బిల్లు వంటి ఆధారాలు అడిగే అవకాశం ఉంటుంది. అప్పుడు మీ దగ్గర బిల్లు లేకపోవడం ఇబ్బందిగా మారుతుంది..
3. గోల్డ్ లోన్ తీసుకోవాలంటే కష్టమే :
అత్యవసర సమయంలో బంగారంపై రుణం తీసుకోవాలనుకున్నప్పుడు బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు తమ నిబంధనల ప్రకారం.. కొనుగోలు వివరాలు, యాజమాన్యానికి సంబంధించిన ఆధారాలు అడగవచ్చు. బిల్లు లేకపోతే ప్రక్రియలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది..
4. ట్యాక్స్ అధికారుల ప్రశ్నలకు సమాధానం చెప్పాలి :
భవిష్యత్తులో ఆదాయపు పన్ను అధికారులు మీ దగ్గరున్న బంగారం ఎక్కడి నుంచి వచ్చింది? ఎప్పుడు కొన్నారు? దానికి డబ్బు ఎలా సమకూరింది? అని అడిగితే సరైన ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. ముఖ్యంగా లెక్కల్లో చూపని ఆదాయంతో కొనుగోలు చేసిన బంగారం విషయంలో పన్ను సంబంధిత సమస్యలు ఎదురుకావచ్చు..
బంగారం ధర తగ్గిందని తొందరపడి బిల్లు లేకుండా కొనడం తెలివైన పని కాదు.. జీఎస్టీ ఆదా అవుతుందని ఆశపడి కొనుగోలు ఆధారాలనే వదులుకోవద్దు.. గుర్తింపు ఉన్న షాపులో మాత్రమే బంగారం కొనండి.. స్వచ్ఛత వివరాలు, ధర, జీఎస్టీతో కూడిన సరైన బిల్లును తప్పనిసరిగా తీసుకోండి. ఎందుకంటే.. ఆ బంగారం మీ ఆస్తి కావచ్చు.. కానీ, దాన్ని కొన్నట్లు నిరూపించే బిల్లు కూడా అంతే విలువైనది..
