Cyclone Akvan Alert : బంగాళాఖాతంలో భీకర తుపాను.. ఏపీ తీర ప్రాంతాలకు హై అలర్ట్.. ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు!
Cyclone Akvan Alert : అక్వాన్ తుఫాన్ ప్రభావంతో ఏపీలోని ఉత్తరాంధ్ర జిల్లాలకు భారీ వర్షాలు పడనున్నాయి. పలు ప్రాంతాల్లో స్కూళ్లు, అంగన్వాడీలకు సెలవులను ప్రకటించారు.. తుఫాన్ తాజా పరిస్థితులు, వాతావరణ శాఖ హెచ్చరికలివే..
Cyclone Akvan Alert Schools Closed
- ఏపీపై అక్వాన్ తుఫాన్ పంజా..
- మూడు రోజుల పాటు స్కూళ్లు బంద్
- ఒడిశా వైపు తుఫాన్ పయనం..
- గంటకు 110 కి.మీ వేగంతో గాలులు
Cyclone Akvan Alert : బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలను వణికిస్తోంది. మొదట ఏపీ వైపు దూసుకొస్తుందని భావించిన ఈ తుపాను.. ఇప్పుడు ఒడిశా వైపు దిశ మార్చుకుంది. అయినప్పటికీ ఏపీకి ముప్పు తప్పలేదని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు..
గంటకు 100కి.మీ వేగంతో గాలులు :
రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వివరాల ప్రకారం.. తుఫాన్ గత 6 గంటల్లో గంటకు 13 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదిలింది. నరసాపురం, కళింగపట్నం, గోపాల్పూర్ ప్రాంతాలకు సమీపంలో కేంద్రీకృతమైంది.
రానున్న గంటల్లో గోపాల్పూర్ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అంచనా.. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు..
మరోవైపు తుఫాన్ ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ ప్రాంతాలపై ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా నవంబర్ 19, 20 తేదీల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
స్కూళ్లు, అంగన్వాడీలకు సెలవులు.. :
తుఫాన్ ముప్పును దృష్టిలో పెట్టుకుని అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రభావిత ప్రాంతాల్లో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించారు. కొన్ని జిల్లాల్లో 3 రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చినట్లు సమాచారం.. అయితే, ఆయా ప్రాంతాల్లో సెలవుల వివరాలను స్థానిక అధికారుల ప్రకటనల ద్వారా నిర్ధారించుకోవాలి.
ఇక మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని అధికారులు స్పష్టం చేశారు. రైతులు కూడా పంటల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వర్షాలు, బలమైన ఈదురుగాలుల నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు..
