New Vande Bharat Express : తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. విశాఖ-తిరుపతి మధ్య మరో వందే భారత్ రైలు.. 8.45 గంటల్లోనే తిరుపతికి!
New Vande Bharat Express : విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు రానుంది. రైలు టైమింగ్స్, స్టాపులు, తిరుమల భక్తులకు కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
New Vande Bharat Express
- విశాఖ నుంచి తిరుపతికి కొత్త వందే భారత్ రైలు
- విశాఖ టు తిరుపతి జర్నీ ఇక మరింత ఈజీ..
- తిరుమల దర్శనానికి వెళ్లేవారికి బంపర్ న్యూస్..
New Vande Bharat Express : ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే ప్రయాణికులకు మరో శుభవార్త.. ముఖ్యంగా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ఇది మరింత ఊరటనిచ్చే అంశం. విశాఖపట్నం నుంచి తిరుపతి మధ్య మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును నడిపేందుకు రైల్వేశాఖ సూత్రప్రాయంగా అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ రైలు అందుబాటులోకి వస్తే.. ఉత్తరాంధ్ర నుంచి తిరుపతికి వెళ్లే ప్రయాణికులకు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది..
ఇవే రైలు టైమింగ్స్.. స్టాపులు కూడా :
ప్రస్తుతం నివేదికల ప్రకారం.. విశాఖపట్నం నుంచి ఉదయం 5.35 గంటలకు ఈ రైలు బయలుదేరి మధ్యాహ్నం 2.10 గంటలకు తిరుపతికి చేరుకోనుంది. తిరుగు ప్రయాణంలో తిరుపతి నుంచి మధ్యాహ్నం 2.55 గంటలకు బయలుదేరి రాత్రి 11.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.
మార్గమధ్యలో సామర్లకోట, రాజమండ్రి, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు స్టేషన్లలో ఈ రైలుకు స్టాపులు ఉండనున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్ ప్రకారం.. విశాఖ నుంచి తిరుపతికి కేవలం 8 గంటల 35 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. అయితే, ప్రస్తుతం ప్రచారంలో ఉన్న ఈ టైమింగ్స్, స్టాపులపై రైల్వేశాఖ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
తిరుమల భక్తులకు ప్రయాణం మరింత ఈజీ :
విశాఖ-తిరుపతి మధ్య ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఈ మార్గంలో వందే భారత్ రైలు నడపాలని గతంలో సీఎం చంద్రబాబు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కోరారు. ఈ ప్రతిపాదనకు సానుకూల స్పందన రావడంతో కొత్త రైలుపై ఆశలు పెరిగాయి.
ఈ రైలు పట్టాలెక్కితే విశాఖ, ఉభయ గోదావరి జిల్లాలు, విజయవాడ, నెల్లూరు ప్రాంతాల నుంచి తిరుపతికి వెళ్లేవారికి మంచి ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. ముఖ్యంగా శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు వేగంగా, సౌకర్యవంతంగా ప్రయాణించే అవకాశం ఉంటుంది. అయితే, రైలు ప్రారంభ తేదీపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
