Telangana Govt : తెలంగాణలోని నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్.. 117 ఉద్యోగాలు.. నెలాఖరులో నోటిఫికేషన్ ..

Telangana Govt : పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయంలో ఉద్యోగ నియామకాలకు మార్గం సుగమమైంది. వర్సిటీ పరిధిలో దీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న 117 బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

Telangana Govt : తెలంగాణలోని నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయంలో ఉద్యోగ నియామకాలకు మార్గం సుగమమైంది. వర్సిటీ పరిధిలో దీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న 117 బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు శనివారం విశ్వవిద్యాలయానికి లేఖ రాసింది. ప్రభుత్వ ఆదేశాలతో ఈ నెలాఖరులోగా నియామక ప్రకటన విడుదల చేసేందుకు వర్సిటీ అధికారులు కసరత్తు చేస్తున్నారు.

Also Read : Gold Silver Prices Today : బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. ఏపీ, తెలంగాణలో తులం రేటు ఎంతంటే?

విశ్వవిద్యాలయంలో వివిధ కేటగిరీల రిజర్వేషన్ల కింద 117 పోస్టులు చాలాకాలంగా భర్తీకాకుండా పెండింగ్‌లో ఉన్నాయి. వీటితోపాటు గత రెండేళ్లలో మరో 108 పోస్టులు ఖాళీ అయ్యాయి. దీంతో మొత్తం 225 పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతి ఇవ్వాలని వర్సిటీ పాలకమండలి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం తొలుత దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న 117 బ్యాక్‌లాగ్‌ పోస్టుల నియామకాలకు అనుమతించింది.

మొత్తం 117 పోస్టుల్లో 67 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, 50 అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు ఉన్నాయి. వీటిని భర్తీ చేసేందుకు ప్రత్యేక నోటిఫికేషన్‌ జారీ చేయాలని నిర్ణయించారు. దీంతో పశువైద్య విద్యారంగంలో అధ్యాపక ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు అవకాశం లభించనుంది. రాతపరీక్ష, మౌఖిక పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఈ నియామకాలను విశ్వవిద్యాలయ పరిధిలోనే చేపట్టనున్నారు. అర్హతలు, రిజర్వేషన్లు, దరఖాస్తు విధానం, పరీక్షల వివరాలను నోటిఫికేషన్‌లో వెల్లడించనున్నారు. ఈ నెలాఖరులోగా ప్రకటన విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.