Delimitation Effect On Telangana: డీలిమిటేషన్ తో మారనున్న తెలంగాణ పొలిటికల్ మ్యాప్.. 182కి చేరనున్న అసెంబ్లీ స్థానాలు.. ఈ నెల 30న కీలక బిల్లులు!
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల బిల్లులు ఆమోదం పొందితే తెలంగాణలో(Delimitation Effect On Telangana) లోక్సభ స్థానాలు పెరగనున్నాయి. కొత్తవారికి, మహిళా అభ్యర్థులకు భారీ అవకాశాలు దక్కనున్నాయి.
Telangana assembly lok sabha seats increase delimitation womens reservation bill
Delimitation Effect On Telangana: లోక్సభ, శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనతో పాటు మహిళా రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన కీలక బిల్లులు ఈ నెల 30న పార్లమెంట్ ముందుకు రానుండటం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఈ బిల్లులకు ఆమోదం లభిస్తే రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా కొత్త నియోజకవర్గాల ఏర్పాటు, రిజర్వేషన్ల(Delimitation Effect On Telangana) మార్పులు అధికార, ప్రతిపక్ష పార్టీల వ్యూహాలను తలకిందులు చేయనున్నాయి.
లోక్సభ సీట్లు 26కు, అసెంబ్లీ స్థానాలు 182కి పెరిగే ఛాన్స్:
ప్రస్తుతం తెలంగాణలో 17 లోక్సభ స్థానాలు ఉండగా, కొత్త బిల్లు ప్రకారం ఆ సంఖ్య 26కు చేరుకోనుంది. ముఖ్యంగా జనాభా అధికంగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనే అత్యధికంగా కొత్త స్థానాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2014 విభజన చట్టం ప్రకారం 34 అసెంబ్లీ సీట్లు పెరగాల్సి ఉండగా, తాజా ప్రతిపాదనలో నేరుగా 50 శాతం పెంపుకు అవకాశం కల్పించారు. దీంతో రాష్ట్రంలో కొత్తగా 60 అసెంబ్లీ స్థానాలు వచ్చి చేరనున్నాయి. లోక్సభ సెగ్మెంట్ల వారీగా లెక్కిస్తే మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 182కి చేరవచ్చని అంచనా వేస్తున్నారు.
పాత నేతల్లో టెన్షన్.. కొత్త వారికి బంపర్ ఆఫర్:
నియోజకవర్గాల పునర్విభజన వల్ల ఎంతోమంది కొత్త ఆశావహులకు ఎన్నికల్లో పోటీ చేసే సువర్ణావకాశం దక్కనుంది. అదే సమయంలో ఇప్పటివరకు ఒకే నియోజకవర్గంపై పట్టు సాధించిన సిట్టింగ్ నేతలు, సీనియర్ల స్థానాలు తారుమారయ్యే ప్రమాదం నెలకొంది. వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను పక్కన పెట్టడానికి లేదా వేరే స్థానాలకు మార్చడానికి ఈ ప్రక్రియ తమకు కలిసొస్తుందని అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు అంతర్గతంగా భావిస్తున్నారు.
చట్టసభల్లో మహిళా శక్తి.. పెరగనున్న రిజర్వేషన్లు:
ఈ మార్పులతో ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ స్థానాల సంఖ్య పెరగడమే కాకుండా, మహిళా రిజర్వేషన్ల అమలుతో చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం గణనీయంగా పెరగనుంది. తాజా అంచనాల ప్రకారం తెలంగాణ నుంచి 8 లేదా 9 మంది మహిళలు లోక్సభకు, సుమారు 60 మంది మహిళా నేతలు శాసనసభకు ఎన్నికయ్యే అవకాశం ఉంది.
