Fake Silver Foil: స్వీట్స్ పై ‘సిల్వర్’ మాయాజాలం.. వెండి స్థానంలో ప్రాణాంతక అల్యూమినియం పూత.. పాతబస్తీ కేంద్రంగా నకిలీ దందా గుట్టురట్టు!
మిఠాయిలపై అల్యూమినియం(Fake Silver Foil) పూత పూస్తున్న నలుగురిని ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.
Hyderabad police arrested four-member gang for coating sweets with aluminium.
Fake Silver Foil: పండుగలు, శుభకార్యాలు, ప్రత్యేక వేడుకల సమయంలో ఎంతో ఇష్టంగా కొనుగోలు చేసే ఖరీదైన స్వీట్లపై మెరిసే ‘సిల్వర్ ఫాయిల్’ (వెండి రేకు/వరఖ్) వెనుక ఉన్న భయంకరమైన కల్తీ దందా హైదరాబాద్ నగరంలో బట్టబయలైంది. సామాన్య ప్రజల ఆరోగ్యంతో తీవ్రంగా చెలగాటమాడుతూ, అధిక లాభాలే లక్ష్యంగా స్వచ్ఛమైన వెండి రేకులకు బదులుగా ఆరోగ్యానికి అత్యంత హానికరమైన అల్యూమినియం పూతతో కూడిన నకిలీ వరఖ్ను తయారు చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. నగరంలోని పలు స్వీట్ హౌస్‌లు, పాన్ షాప్‌లు, బేకరీలకు ఈ నకిలీ రేకులను భారీ ఎత్తున సరఫరా చేస్తున్న తయారీ కేంద్రాలపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చారు.
యూపీ నుంచి ముడిసరుకు.. పాతబస్తీలో గుట్టుగా తయారీ, సరఫరా:
నిందితులు ఉత్తరప్రదేశ్ (యూపీ) నుంచి అతి తక్కువ ధరకు లభించే అల్యూమినియం ముడిసరుకును రహస్యంగా దిగుమతి చేసుకుని, హైదరాబాద్ పాతబస్తీ కేంద్రంగా ఈ నకిలీ సిల్వర్ వరఖ్(Fake Silver Foil)ను తయారు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. చూడటానికి అచ్చం స్వచ్ఛమైన వెండి రేకుల్లాగే తళతళా మెరిసేలా వీటిని అత్యంత చాకచక్యంగా రూపొందించి, నగరవ్యాప్తంగా ఉన్న అనేక స్వీట్ దుకాణాలు, బేకరీలు, పాన్ షాపులకు తక్కువ ధరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
నలుగురు కేటుగాళ్ల అరెస్ట్.. భారీగా నకిలీ వరఖ్ స్వాధీనం:
పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు పాతబస్తీలోని అక్రమ తయారీ కేంద్రాలపై మెరుపు దాడులు నిర్వహించి, ఈ కల్తీ దందాకు పాల్పడుతున్న నలుగురు కీలక నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి లక్షలాది రూపాయల విలువైన నకిలీ అల్యూమినియం వరఖ్ స్టాక్‌తో పాటు తయారీ యంత్రాలు, ముడిసరుకును స్వాధీనం చేసుకున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ కల్తీ ఆహార పదార్థాలను తయారు చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని అధికారులు గట్టిగా హెచ్చరించారు.
