Cyclone Akvan Alert : అక్వాన్ తుఫాన్ దిశ మార్పు.. తెలంగాణకు వర్షగండం! ఆ రోజు నుంచి భారీ వానలు?
Cyclone Akvan Alert : అక్వాన్ తీవ్ర తుఫాన్‌గా బలపడింది. నవంబర్ 19, 20 తేదీల్లో తెలంగాణలో వర్షాలు, తూర్పు జిల్లాల్లో భారీ వానలు పడే అవకాశం ఉంది. పూర్తి వివరాలివే..
Cyclone Akvan Alert
- బంగాళాఖాతంలో బలపడిన అక్వాన్..
- ఏపీకి భారీ ముప్పు, తెలంగాణలోనూ వానలు
- నవంబర్ 19 నుంచి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
Cyclone Akvan Alert : బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తుఫాన్ క్రమంగా బలపడుతోంది. మొదట సాధారణ తుఫానుగా ఉన్న ఈ వాయుగుండం ఇప్పుడు తీవ్ర తుఫానుగా మారడంతో తీర ప్రాంతాల్లో ఆందోళన మొదలైంది..
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణపైనా దీని ప్రభావం ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీంతో రానున్న రెండు, మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంపై ఆందోళన నెలకొంది.
ఉత్తర వాయువ్య దిశగా అక్వాన్ ప్రయాణం :
నవంబర్ 18 ఉదయం 8:30 గంటల సమయానికి అక్వాన్ తీవ్ర తుఫాను దక్షిణ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. గత 6 గంటల్లో గంటకు 7 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదిలింది. ప్రస్తుతం చెన్నై, విశాఖపట్నం, మచిలీపట్నం తీరాలకు వందల కిలోమీటర్ల దూరంలో కొనసాగుతోంది..
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. నవంబర్ 20 మధ్యాహ్నం మచిలీపట్నం, పూరి మధ్య ఉత్తరాంధ్ర, యానాం, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల మీదుగా తీవ్ర తుఫానుగా తీరం దాటే అవకాశం ఉంది. ఆ సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉంది. గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అంచనా..
తెలంగాణలో వర్షాలు ఎప్పటినుంచి? :
అక్వాన్ ప్రభావంతో తెలంగాణలోనూ వాతావరణం మారనుంది. నవంబర్ 18న రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. అయితే, నవంబర్ 19, 20 తేదీల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి..
ముఖ్యంగా నవంబర్ 20న తూర్పు తెలంగాణలోని ఒకటి రెండు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది..
ఏపీ ప్రజలు అప్రమత్తం :
అక్వాన్ తుఫాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. భారీ వర్షాలు, బలమైన గాలుల నేపథ్యంలో అధికారులు సూచించే జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లే విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
