Rice Depot Raids : రైస్ బ్యాగ్ కొంటున్నారా..? మీకో బిగ్ అలర్ట్.. ఇలాంటి మోసం మీకు జరక్కుండా చూసుకోండి..

Rice Depot Raids : హైదరాబాద్ పరిధిలోని కర్మన్‌ఘాట్‌ ప్రాంతంలో రైస్ డిపోలపై సివిల్ సప్లయ్, విజిలెన్స్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు.

Hyderabad Karmanghat Rice Depot Raids Ration Rice Irregularities

Rice Depot Raids: ఎల్‌నినో ప్రభావంతో బియ్యం ఉత్పత్తి తగ్గింది. మరోవైపు ప్రస్తుతం చేతికొచ్చిన బియ్యాన్ని మిల్లర్లు, వ్యాపారులు బ్లాక్ మార్కెట్ కు తరలించి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. దీనికితోడు కొందరు మిల్లర్లు, వ్యాపారులు రేషన్ బియ్యాన్ని పాలిష్ చేసి పలు రకాల బ్రాండ్ల పేరుతో అత్యధిక ధరలకు విక్రయాలు చేస్తున్నారనే విమర్శలు సైతం ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లయ్, విజిలెన్స్ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించగా.. విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.

Also Read – Super El Nino India : సూపర్‌ ఎల్‌నినో ముప్పు.. వచ్చే మార్చి నాటికి భారత్‌లో 55వేల మరణాలు..!

హైదరాబాద్ పరిధిలోని కర్మన్‌ఘాట్‌ ప్రాంతంలో రైస్ డిపోలపై సివిల్ సప్లయ్, విజిలెన్స్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. పలు డిపోల్లో బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించారు. బియ్యం విక్రయాల్లో నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనే అంశాన్ని పరిశీలించారు. రేషన్ బియ్యాన్ని సన్న బియ్యంగా మారుస్తున్నారనే ఆరోపణలతో పాటు, బియ్యం సంచులపై పేర్కొన్న బరువు కంటే తక్కువగా విక్రయిస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టారు.

కర్మన్‌ఘాట్‌లోని పలు రైస్ డిపోల్లో అధికారులు తనిఖీలు నిర్వహించి బియ్యం నమూనాలను సేకరించారు. రేషన్ బియ్యాన్ని ఇతర రకాల బియ్యంతో కలిపి విక్రయిస్తున్నారా? బియ్యం సంచులపై ఉన్న బరువుకు, వాస్తవంగా విక్రయిస్తున్న బరువుకు మధ్య తేడా ఉందా? అనే అంశాలపై పరిశీలన జరిపారు. తనిఖీల్లో భాగంగా డిపోల్లో నిల్వ ఉన్న బియ్యం వివరాలను కూడా అధికారులు పరిశీలించారు. అయితే, కొన్ని రైస్ డిపోలు కనీస ట్రేడ్ లైసెన్స్ లేకుండానే నిర్వహిస్తున్నారని అధికారులు గుర్తించారు. తనిఖీలు ప్రారంభం కావడంతో కొందరు నిర్వాహకులు దుకాణాల షెర్టర్లను మూసివేసి వెళ్లిపోవడం గమనార్హం.

పేదలకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్న వ్యాపారాలు వాటిని పాలిష్ చేసి బ్రాండెడ్ కంపెనీ బియ్యం పేరుతో బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు ఈ తనిఖీల్లో వెల్లడైంది. ప్రస్తుతం సన్న బియ్యం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితిని తమ లాభాలకు అనుకూలంగా మలుచుకుంటున్న వ్యాపారులు రేషన్ బియ్యాన్ని ప్రాసెస్ చేసి మార్కెట్లో కిలో రూ.80 నుంచి రూ.100 వరకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.

రేషన్ బియ్యం అక్రమ రవాణా, విక్రయాలు, తూకాల్లో మోసాలు, లైసెన్స్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి అధికారులు మరింత లోతుగా పరిశీలన చేయనున్నారు. సేకరించిన బియ్యం నమూనాలు, తనిఖీల్లో గుర్తించిన అంశాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునేందుకు సివిల్ సప్లైస్, విజిలెన్స్ అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.