Telangana Govt : తెలంగాణ ప్రజలకు శుభవార్త.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు.. కోటి కుటుంబాలకు లబ్ధి
Telangana Govt : తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. రాష్ట్రంలోని కోటి కుటుంబాలకు ఇందిరమ్మ బీమా సౌకర్యం కల్పించాలని స్పష్టం చేశారు.
Telangana Govt
Telangana Govt : తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. రాష్ట్రంలోని కోటి కుటుంబాలకు ఇందిరమ్మ బీమా సౌకర్యం కల్పించాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ శాఖల్లో అమలవుతున్న బీమా పథకాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని అధికారులకు సూచించారు.
Also Read : Sammakka Sagar Project : తెలంగాణకు గుడ్ న్యూస్.. సమ్మక్క సాగర్‌కు లైన్ క్లియర్..?
ఈనెల 19న సిద్ధిపేట బహిరంగ సభలో ఇందిరమ్మ బీమా దరఖాస్తుల స్వీకరణను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్న నేపథ్యంలో ఇందిరమ్మ బీమా, ఇందిరమ్మ చీరల పంపిణీపై జూబ్లీహిల్స్ నివాసంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని కోటి కుటుంబాలకు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలు కావాలని, దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు.
బీమా పథకంలో భాగంగా ప్రతి కుటుంబానికి ఐదు లక్షల రూపాయల జీవిత బీమా సౌకర్యం కల్పించనున్నారు. ఈ బీమా వల్ల ఉపాధి హామీ కూలీలతో పాటు లక్షలాది మంది పేదలు లబ్ధి పొందుతారని తెలిపారు. ఇప్పటికే అమలవుతున్న వివిధ రకాల బీమా పథకాల్లో జీవిత బీమా కింద రెండు లక్షలు, ప్రమాద బీమా కింద పది లక్షల రూపాయల వరకు అందిస్తున్నట్లు సమావేశంలో అధికారులు వివరించారు.
వివిధ శాఖల ద్వారా ఇప్పటికే అమలవుతున్న బీమా పథకాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి, వారికి లభిస్తున్న ప్రమాద బీమా ప్రయోజనాలను కొనసాగించేలా చూడాలన్నారు. కొన్ని శాఖల్లో ప్రస్తుతం ఉన్న రూ. 2 లక్షల జీవిత బీమాను ఇందిరమ్మ బీమా పరిధిలోకి తీసుకువచ్చి రూ. 5 లక్షలకు పెంచాలని సూచించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి బీమా భద్రత అందుకుంటున్న వారిలో ఏ ఒక్కరినీ కూడా మినహాయించడానికి వీల్లేదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు.
సిద్దిపేట బహిరంగ సభలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అర్హులైన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీర అందించాలని సమావేశంలో స్పష్టం చేశారు. పంపిణీకి వీలుగా చీరలను తక్షణమే అన్ని జిల్లాలకు తరలించాలని సూచించారు. ఇందిరమ్మ బీమా, ఇందిరమ్మ చీరల పంపిణీపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇందిరమ్మ చీరల పంపిణీలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అదేవిధంగా ఇందిరమ్మ బీమా పథకంపై విస్తృతంగా ప్రచారం చేయాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దరఖాస్తులను గ్రామస్థాయిలో అందుబాటులో ఉంచాలని, జిల్లా కలెక్టర్లు దీనిపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
