NZ Vs IND : సిరాజ్ పేరు వల్లే తుది జట్టులో చోటు దక్కలేదా? కాంగ్రెస్, బీజేపీ నేతల మాటల యుద్ధం.. రంగంలోకి మాజీ క్రికెటర్లు..

NZ Vs IND Mohammed Siraj : ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ తొలి టెస్టు మ్యాచ్ తుది జట్టులో భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ లేకపోవటం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ అంశం రాజకీయంగానూ దుమారం రేపుతోంది.

Mohammed Siraj

NZ Vs IND Mohammed Siraj : ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య వెల్లింగ్టన్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరుగుతుంది. అయితే, తుది జట్టులో భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ లేకపోవటం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సిరాజ్ ను తుది జట్టులోకి తీసుకోకపోవడంపై మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, రవిశాస్త్రితోపాటు పలువురు క్రికెటర్లు తప్పుబట్టారు. వీరితోడు ఇప్పుడు రాజకీయ నేతలుసైతం రంగంలోకి దిగారు. దీంతో సిరాజ్ విషయంపై కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధంకు తెరలేచింది.

Also Read : IND vs NZ : 32 ఏళ్ల నిరీక్షణకు తెర.. న్యూజిలాండ్ గడ్డపై చరిత్ర సృష్టించిన జైస్వాల్, కేఎల్ రాహుల్!

న్యూజిలాండ్ జట్టుతో తొలి టెస్టులో భాగంగా మహమ్మద్ సిరాజ్‌తోపాటు సీనియర్ స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను జట్టు యాజమాన్యం పక్కన పెట్టింది. తుది జట్టులో సిరాజ్ ఉంటాడని అందరూ భావించినప్పటికీ.. అతని స్థానంలో యువ పేసర్ అన్షుల్ కంబోజ్ కు తుది జట్టులో జట్టు యాజమాన్యం అవకాశం కల్పించింది. ఇప్పుడే ఇదే అంశం క్రికెట్ వర్గాల్లోనే కాక.. రాజకీయ వర్గాల్లోనూ చర్చకు దారితీసింది.

సిరాజ్‌ను తుది జట్టులో ఎంపిక చేయకపోవడంపై సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ.. కివీస్ తో చివరి వన్డేలో సిరాజ్ ను ఆడించారంటే టెస్టు మ్యాచ్ సన్నద్ధత కోసమే అనుకున్నా. కానీ, ఈరోజు తుది జట్టులో అతను లేకపోవడం ఆశ్చర్యం కలిగించిందని పేర్కొన్నారు. ఇదే విషయంపై రవిశాస్త్రి మాట్లాడుతూ.. సిరాజ్ ను తుది జట్టులో ఎంపిక చేయాల్సింది. తన బౌలింగ్ లో దూకుడు ఉంటుంది. బంతితో అతను ఏదైనా చేయగలడు. అతనుంటే కథ వేరుగా ఉండేది అంటూ పేర్కొన్నారు. పలువురు మాజీ క్రికెటర్లుసైతం తొలి టెస్టుకోసం సిరాజ్‌ను తుది జట్టులోకి తీసుకోకుండా జట్టు యాజమాన్యం తప్పుచేసిందని చెప్పుకొచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. సిరాజ్ వ్యవహారంకు రాజకీయ రంగుకూడా పులుముకుంది. కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది.

కేవ‌లం అత‌డి పేరు కార‌ణంగానే సిరాజ్‌ను ప‌క్క‌న‌బెట్టార‌ని కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ ఆరోప‌ణ‌లు చేశారు. ఏఎన్ఐ చానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్య్వూలో ఇమ్రాన్ మ‌సూద్ మాట్లాడుతూ.. సిరాజ్ బాగా రాణించిన‌ప్ప‌టికీ జ‌ట్టులో చోటు ద‌క్కించుకోలేక‌పో యాడని, దీనికి ప్ర‌ధాన కార‌ణం అత‌డి పేరు ‘సిరాజ్’ కావ‌డ‌మే. కేవ‌లం పేరు కార‌ణంగానే అత‌డికి తుది జ‌ట్టులో అవ‌కాశమివ్వ‌డం లేదు. బాగా ఆడుతున్న‌ప్ప‌టికీ అత‌డిని ఎంపిక చేయ‌క‌పోతే అది వివ‌క్షే అవుతుందని మండిప‌డ్డారు.


ఇమ్రాన్ మసూద్ వ్యాఖ్యలను బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ తప్పుబట్టారు. ఇన్నాళ్లు ఎన్నిక‌ల్లో ఓటు బ్యాంకు రాజ‌కీయాలు చేసిన కాంగ్రెస్ ఇప్పుడు క్రికెట్ జ‌ట్టు ఎంపిక‌లోనూ రాజ‌కీయాలు మొద‌లుపెట్టింది అంటూ విమర్శించారు. సిరాజ్‌ను పేరు కారణంగానే పక్కన పెట్టారని ఆరోపిస్తున్నారు.. మరి జడేజాకు కూడా తుది జట్టులో చోటు దక్కలేదు.. ఆ విషయం గురించి ఏమాట్లాడతారు అంటూ బీజేపీ నేత ప్రశ్నించారు. ఓటు బ్యాంకు, మ‌త రాజ‌కీయాల కోసం భార‌త క్రికెట్ జ‌ట్టును విభ‌జించ‌డం ఆపండి అంటూ ప్ర‌దీప్ భండారీ ఘాటుగా వ్యాఖ్యానించాడు.