Jasprit Bumrah : చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా.. జవగళ్ శ్రీనాథ్ రికార్డు బద్దలు.. నెక్ట్స్ టార్గెట్ వారే..
Jasprit Bumrah : భారత్, న్యూజిలాండ్ మధ్య వెల్లింగ్టన్లోని బేసిన్ రిజర్వ్ మైదానంలో జరుగుతున్న తొలి టెస్టులో జస్ర్పీత్ బుమ్రా ఈ ఘనత అందుకున్నాడు.
Javagal Srinath Jasprit Bumrah
Jasprit Bumrah : ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ర్పీత్ బుమ్రా సరికొత్త రికార్డును నెలకొల్పాడు. టెస్టు క్రికెట్లో భారత తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో టాప్-10లోకి దూసుకొచ్చాడు. ఈ క్రమంలో మాజీ పేసర్ జవగళ్ శ్రీనాథ్ రికార్డును అధిగమించి తన పేరును రికార్డుల పుటల్లో లిఖించుకున్నాడు.
భారత్, న్యూజిలాండ్ మధ్య వెల్లింగ్టన్లోని బేసిన్ రిజర్వ్ మైదానంలో జరుగుతున్న తొలి టెస్టులో జస్ర్పీత్ బుమ్రా ఈ ఘనత అందుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్‌ను డకౌట్‌గా వెనక్కి పంపిన బుమ్రా.. ఆ తర్వాత డారిల్ మిచెల్‌ను కూడా ఔట్ చేశాడు. భోజన విరామం అనంతరం టామ్ బ్లండెల్‌ను పెవిలియన్‌కు పంపడంతో అతడి టెస్టు వికెట్ల సంఖ్య 237కు చేరింది. దీంతో ఇప్పటివరకు 236 వికెట్లతో ఉన్న జవగళ్ శ్రీనాథ్‌ను అధిగమించాడు.
టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ జవగళ్ శ్రీనాథ్ 67 టెస్టుల్లో 236 వికెట్లు పడగొట్టగా.. జస్ర్పీత్ బుమ్రా కేవలం 53 టెస్టుల్లోనే 237 వికెట్లు సాధించి రికార్డు నెలకొల్పాడు. శ్రీనాథ్ కంటే 14 మ్యాచ్‌లు తక్కువగా ఆడి బుమ్రా ఈ ఘనత అందుకున్నాడు. దీంతో భారత టెస్టు క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో పదో స్థానానికి చేరుకున్నాడు.
బుమ్రా ఇప్పటికే టాప్-10లోకి ప్రవేశించడంతో.. త్వరలోనే మరో స్థానాన్ని అధిగమించే అవకాశం ఉంది. ప్రస్తుతం తొమ్మిదో స్థానంలో ఉన్న భగవత్ చంద్రశేఖర్ 242 వికెట్లతో ఉన్నాడు. అతడిని అధిగమించాలంటే బుమ్రా మరో ఆరు వికెట్లు పడగొట్టాలి. ప్రస్తుత ఫామ్‌ను కొనసాగిస్తే కివీస్ తో జరిగే టెస్టు సిరీస్‌లోనే మరో మైలురాయిని బుమ్రా అందుకునే అవకాశం ఉంది.
భారత్ తరఫున అత్యధిక టెస్టు వికెట్లు తీసిన బౌలర్లు..
♦ అనిల్ కుంబ్లే – 619 వికెట్లు
♦ రవిచంద్రన్ అశ్విన్ – 537 వికెట్లు
♦ కపిల్ దేవ్ – 434 వికెట్లు
♦ హర్భజన్ సింగ్ – 417 వికెట్లు
♦ రవీంద్ర జడేజా – 356 వికెట్లు
♦ జహీర్ ఖాన్ – 311 వికెట్లు
♦ ఇషాంత్ శర్మ – 311 వికెట్లు
♦ బిషన్ సింగ్ బేడీ – 266 వికెట్లు
♦ భగవత్ చంద్రశేఖర్ – 242 వికెట్లు
♦ జస్ప్రీత్ బుమ్రా – 237 వికెట్లు
