MS Dhoni : ఐపీఎల్‌కు వీడ్కోలు తరువాత ధోనీ భావోద్వేగ పోస్ట్ వైరల్.. అభిమానులకు ఆయన సతీమణి కీలక సూచన
MS Dhoni Emotional Post : ఐపీఎల్‌కు రిటైర్మెంట్ తరువాత ఎంఎస్ ధోనీ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో భావోద్వేగ పోస్టు చేశారు.
MS Dhoni emotional post
MS Dhoni Emotional Post : క్రికెట్ అభిమానుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్‌కు రిటైర్మెంట్ పలికారు. దీంతో ధోనిని అభిమానించే వారు, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అభిమానులు రిటైర్మెంట్ ప్రకటనతో నిరాశకు గురైనప్పటికీ.. మైదానంలోకి రాకున్నా.. సీఎస్కే జట్టుకు మెంటార్‌గా కొత్త బాధ్యతలను ధోనీ చేపట్టనుండటంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఐపీఎల్ టోర్నీకి వీడ్కోలు పలికిన అనంతరం ధోనీ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ ప్రత్యేక వీడియోను షేర్ చేశారు.
‘తన క్రికెట్ కెరీర్‌లోని ఎన్నో అపురూప క్షణాలను ఈ వీడియోలో పొందుపరిచారు. భారత జట్టు తరఫున ఆడిన రోజుల నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌తో సాధించిన విజయాల వరకు అనేక జ్ఞాపకాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ వీడియోకు ‘మై హర్ ఏక్ పల్ కా షాయర్ హూ’ అనే ప్రముఖ హిందీ పాటను నేపథ్య సంగీతంగా జోడించారు. 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సమయంలోనూ ధోనీ ఇదే చిత్రంలోని మరో వెర్షన్ పాటను ఉపయోగించారు.
ఈ వీడియోకు క్యాప్షన్‌గా.. అభిమానులు నన్ను తప్పుగా నిరూపించారు. ఈ విషయాన్ని అంగీకరించడానికి ఇంతకంటే మంచి పాట మరొకటి లేదు. బహుశా ఈ పాటకు రెండు వెర్షన్లు అందుకేనేమో.. నేను తప్పు చేసి, ఆ తర్వాత అంగీకరించడానికి అని ధోనీ పేర్కొన్నారు.
ధోనీ షేర్ చేసిన వీడియోలో భారత జట్టు తరఫున సాధించిన విజయాలు, సహచర ఆటగాళ్లతో కలిసి గడిపిన క్షణాలు కనిపించాయి. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ విజయాలతో పాటు.. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఐపీఎల్లో సాధించిన ఘనతలకు సంబంధించిన దృశ్యాలు అభిమానులను ఆకట్టుకున్నాయి.
View this post on Instagram
ఐపీఎల్ ప్రారంభమైన 2008 నుంచి ధోనీ చెన్నై సూపర్ కింగ్స్‌తో కొనసాగుతున్నాడు. అతడి నాయకత్వంలో సీఎస్కే ఏకంగా ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. 2010, 2011, 2018, 2021, 2023 సీజన్లలో ఛాంపియన్‌గా నిలిచింది. రెండు ఛాంపియన్స్ లీగ్ టీ20 టైటిళ్లను కూడా సాధించింది. ధోనీ నాయకత్వంలో చెన్నై జట్టు ఎన్నో విజయాలను అందుకుంది. ఒత్తిడిలోనూ ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవడం, యువ ఆటగాళ్లను ప్రోత్సహించడం అతడి ప్రత్యేకతగా నిలిచాయి. మొత్తంగా, ధోనీ ఐపీఎల్లో 278 మ్యాచ్‌లు ఆడి 5,439 పరుగులు చేశాడు. వికెట్‌కీపర్‌గా 158 క్యాచ్‌లు అందుకుని, 47 స్టంపింగ్స్ చేశాడు.
ధోనీ సతీమణి భావోద్వేగ సందేశం.. కొత్త ప్రయాణానికి శుభాకాంక్షలు..
మహేంద్ర సింగ్ ధోనీ సతీమణి సాక్షి ధోనీ తన భర్తకు హృదయపూర్వక సందేశాన్ని అందించారు. ధోనీ తన జీవితంలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ అందమైన పోస్టును పంచుకున్నారు.
“అందమైన కొత్త అధ్యాయాలు ప్రారంభం కావాలంటే.. కొన్ని పాత అధ్యాయాలకు ముగింపు పలకాల్సిందే. ఇన్నేళ్లుగా మాహీని ప్రేమిస్తూ, మద్దతుగా నిలుస్తూ, ఆయనపై నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. మాకు వ్యక్తిగతంగా తెలిసినా, తెలియకపోయినా మీ అందరి ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. మీరు చూపించిన ప్రేమకు ఎప్పటికీ కృతజ్ఞులం. కొత్త ఆరంభాలు, కొత్త సాహసాలు, మరెన్నో మధుర జ్ఞాపకాల కోసం ఎదురుచూస్తున్నాం. మాహీ.. నిన్ను చూసి ఎంతో గర్వంగా ఉంది. ఎప్పటికీ నీకు తోడుగా ఉంటాను” అంటూ తన ప్రేమను, అభిమానాన్ని వ్యక్తం చేశారు.
View this post on Instagram
