Plane Destroyed : గొడ్డలి పట్టుకుని వెళ్లాడు.. రూ.560 కోట్ల విమానాన్ని పనికిరాకుండా చేశాడు..! అమెరికాకు బిగ్‌షాక్..
US Military Plane Destroyed in Ireland : అమెరికా సైన్యానికి భారీ షాక్ తగిలింది. ఐర్లాండ్‌లోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య షానన్ విమానాశ్రయంలో ఉంచిన మిలిటరీకి చెందిన విమానంపై ఓ వ్యక్తి గొడ్డలితో దాడిచేసి ధ్వంసం చేశాడు. ఈ ఘటనలో ఆ దేశానికి రూ. 560 కోట్ల నష్టం వాటిల్లింది.
US Military Plane Destroyed in Ireland
US Military Plane Destroyed in Ireland : అమెరికాపై ఉన్న కోపంతో ఓ వ్యక్తి ఆ దేశంకు చెందిన ఖరీదైన విమానాన్ని గొడ్డలితో ధ్వంసం చేశాడు. ధ్వంసం అంటే.. ఏదో వైర్లు పీకేయడం.. ఇతర భాగాలను పగలగొట్టడం కాదు.. ఏకంగా విమానంలోన్ని అన్ని కీలక భాగాలను ధ్వంసం చేశాడు.. దీంతో సుమారు రూ.560 కోట్లకుపైగా అగ్రదేశానికి నష్టాన్ని కలిగించాడు. ఈ ఘటన ఐర్లాండ్‌లోని షానన్ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. ఇంతకీ ఆ వ్యక్తి ఎందుకు విమానాన్ని ధ్వంసం చేశాడు.. అంత ఆగ్రహం చెందడానికి కారణం ఏమిటనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.
Also Read : Mohammed Siraj : తొలి టెస్టుకు సిరాజ్‌ను ఎందుకు పక్కన పెట్టారు.. బ్యాటింగ్ కోచ్ సంచలన కామెంట్స్..
అమెరికా ఎయిర్ నేషనల్ గార్డ్‌కు చెందిన సీ-130హెచ్ హెర్క్యులస్ రవాణా విమానంను ఈ ఏడాది ఏప్రిల్ 1న ఐర్లాండ్‌లోని షానన్ విమానాశ్రయంలో నిలిపి ఉంచారు. ఆ సమయంలో డైతి ఓ కొరైన్ అనే 48 ఏళ్ల వ్యక్తి విమానాశ్రయ వెనుక ప్రాంతం నుంచి భద్రతా వలయాన్ని దాటుకుని విమానంలోకి ప్రవేశించాడు. ఆ తరువాత విమానంలోని విద్యుత్ వైర్లు, హైడ్రాలిక్ లైన్లను కత్తిరించడంతో పాటు కాక్‌పిట్‌లోని గేజ్‌లను పగులగొట్టాడు. విమానంలోని గాలి ప్రసరణ వ్యవస్థకు సంబంధించిన పైపులను కూడా ధ్వంసం చేశాడు. అంతటితో ఆగకుండా విమాన తయారీలో ప్రధానంగా వాడే అల్యూమినియాన్ని నిమిషాల్లో కరిగించి నాశనం చేసే ‘గాలియం’ లిక్విడ్‌ను విమాన భాగాలపై చల్లాడు.
కొన్ని గంటల తర్వాత సిబ్బంది తిరిగి వచ్చేసరికి కాక్‌పిట్ కిటికీ ద్వారా విమానంలో నిందితుడిని గుర్తించారు. వారు వెంటనే విమానాశ్రయ భద్రతా సిబ్బందికి సమాచారం అందించారు. అయితే, అప్పటికే అతడు విమానం పైభాగంలోని మార్గం ద్వారా బయటకు వచ్చి గొడ్డలితో విమానం బయటి భాగాలపై దాడి చేశాడు. ఇంధన ట్యాంకుల్లో గుర్తుతెలియని పదార్థాలు, లోహపు గుండీలు వేశాడు. సమాచారం అందుకున్న ఐర్లాండ్ పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని ఐరిష్ దేశీయుడిగా గుర్తించారు.
ఇరాన్‌తో యుద్ధంలో అమెరికా పాత్ర, ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు, గాజాపై ఇజ్రాయెల్ యుద్ధానికి నిరసనగా నిందితుడు ఈ చర్యకు పాల్పడినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ ఘటనకు సంబంధించి అమెరికా న్యాయశాఖ నవంబర్ 17న కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి సంబంధించి డైతి ఓ కొరైన్పై న్యూయార్క్‌లోని ఫెడరల్ గ్రాండ్ జ్యూరీ అభియోగాలు నమోదు చేసింది. ఈ నేరం నిరూపితమైతే గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
అయితే, నిందితుడు పక్కా ప్రణాళికతోనే ఈ దాడికి పాల్పడినట్లు దర్యాప్తు అధికారులు నిర్ధారించారు. విమాన కంట్రోల్ వైర్లు, ఆక్సిజన్ పైపుల అమరికపై అతడికి పూర్తి అవగాహన ఉన్నట్లు గుర్తించారు. ఈ దాడి కోసమే నిందితుడు ఇంటర్నెట్లో గాలియం క్యాప్సుల్స్ కోసం వెతికి, ఆన్లైన్లో ఆర్డర్ చేసి కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది. ఎయిర్ పోర్టు సెక్యూరిటీ లోపాలపై, నిందితుడి వెనుక ఉన్న ఉద్దేశాలపై అమెరికా న్యాయ శాఖ, ఐరిష్ అధికారులు కీలక దర్యాప్తు చేపట్టారు.
