Annamayya Song : చర్చిలో అమెరికా గాయకుల నోట అన్నమయ్య కీర్తన.. చప్పట్లతో మార్మోగిన ప్రాంగణం.. వీడియో వైరల్
Annamayya Song in Swiss Church : తెలుగు నేలపై పుట్టిన ఆధ్యాత్మిక సంగీతం ఖండాంతరాలు దాటి ప్రపంచ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది. దాదాపు 600 ఏళ్ల క్రితం తాళ్లపాక అన్నమాచార్యులు రచించిన ‘బ్రహ్మమొక్కటే.. పరబ్రహ్మమొక్కటే’ సంకీర్తన ఇప్పుడు విదేశాల్లో మారుమోగుతోంది.
- Harish Thanniru
- Published on- November 29, 2026 / 09:42 AM IST
Annamayya Song
Annamayya Song in Swiss Church : 600 సంవత్సరాల తెలుగు కీర్తన విదేశాల్లో మారుమోగింది. ఎప్పుడో 14వ శతాబ్దంలో అన్నమయ్య పాడిన సంకీర్తన దేశ విదేశాల్లో ప్రతి ఒక్కరిని పరవశింపజేస్తోంది. అది ఏ భారతీయడో పాడితే మన రక్తంలోనే ఉంది. గుళ్లోనో, భారతీయుల ఫంక్షన్స్ లోనో అయి ఉంటుందిలే అనుకోవచ్చు. కానీ, ఈ పాటను ఓ చర్చిలో ప్రార్థనల మధ్య అమెరికన్ సింగర్స్ ఆలపించారు. చర్చిలో క్రీస్తు ప్రార్థనలు కాకుండా అన్నమయ్య పాట అని ఆశ్చర్యపోకండి. ఎస్.. నిజంగా జరిగింది. ఏసు పేరు మాత్రమే పలికే చర్చిలో శ్రీనివాసుని నామం మారుమోగింది.
బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే అనగానే చర్చిలోని వారంతా ఆనంద పరవశంలో మునిగిపోయారు. ఈ అద్భుతాన్ని చేసింది అమెరికాకు చెందిన ప్రపంచ ప్రఖ్యాత వోకల్ బృందం చాంటి క్లిర్.
స్విట్జర్లాండ్లోని రీన్ ఫెల్డెన్లో జరిగిన ప్రతిష్టాత్మక సోల్స్ బర్గ్ ఫెస్టివల్లో వోకల్ బృందం చాంటి క్లిర్ ఆలపించిన తాళపాక అన్నమాచార్యులు రచించిన అమర కీర్తన బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే వేలాది మంది విదేశీ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. గ్రామీ అవార్డు గెలుచుకున్న ఈ బృందంలోని 12 మంది మేల్ సింగర్స్ ఎలాంటి వాయిద్యాలు లేకుండా కేవలం గొంతులతోనే మ్యూజిక్ ఇస్తూ ఈ కీర్తనను ఒక చారిత్రాత్మక బరోక్ చర్చిలో పాడటం ప్రేక్షకులకు మరుపురాని అనుభూతిని మిగిల్చింది.
ఈ కీర్తనను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది వినీల్ గరసా మహల్. ఆయన చాంటి క్లిర్ బృందంలో చేరిన మొట్టమొదటి భారతీయ సంతతి మెంబర్. టెనర్ గాయకుడుగా ఉన్న వినీల్ పాశ్చాత్య కోరల్ హార్మోనీలను భారతీయ కర్ణాటక సంగీతంలోని గమకాలతో మేళవించి ఈ కీర్తనకు నూతన రూపం ఇచ్చారు. చాంటి క్లిర్ వారి చూడండి కార్యక్రమంలో భాగంగా ఈ కీర్తనను ప్రదర్శించారు. చూడండి అనేది చాంటి క్లిర్ రూపొందించిన ఒక ప్రత్యేక సంగీత కచేరీ కార్యక్రమం. ప్రదర్శన ముగిసేసరికి సభా చప్పట్లతో మారుమోగిపోయింది. చాలామంది ప్రేక్షకులు అశ్రునయనాలతో ఆ కీర్తనను ఆస్వాదించారు.
బ్రహ్మ ఒక్కటే పరబ్రహ్మ ఒక్కటే అంటే అందరి ఆత్మ ఒక్కటే. దేవుని ముందు అందరూ సమానమే అని అర్థం. కులం, రంగు, ధనిక, పేద అనే తేడాలు లేవని 600 ఏళ్ల క్రితమే అన్నమయ్య తన కీర్తన ద్వారా చాటి చెప్పారు. అదే సమానత్వ సందేశం నేడు విదేశీ గడ్డపై అందరి హృదయాలను తాకింది. అన్నమయ్య కేవలం భక్తి కవి మాత్రమే కాదు తన కాలంలోని అంటరానితనాన్ని వ్యతిరేకించిన సంఘ సంస్కర్త కూడా.
ఒక తెలుగు కీర్తన ఒక అమెరికన్ బృందం ద్వారా ఒక స్విస్ చర్చిలో పాడటం తెలుగు వారందరికీ గర్వకారణం కదా. భాష, దేశం, సంస్కృతి దాటి భక్తి సంగీతం అందరినీ ఏకం చేస్తుందని అనడానికి ఇదే నిదర్శనం.
ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసలు..
గ్రామీ అవార్డు గెలుచుకున్న అమెరికాకు చెందిన ప్రముఖ ఎ క్యాపెల్లా (వాయిద్యాలు లేకుండా కేవలం గొంతుతో పాడే) గాయక బృందం చాంటిక్లియర్, స్విట్జర్లాండ్లో జరిగిన సోల్స్బర్గ్ ఫెస్టివల్ 2026లో 15వ శతాబ్దానికి చెందిన తాళ్లపాక అన్నమాచార్యులు రచించిన అపురూప సంకీర్తన ‘బ్రహ్మమొక్కటే’ ఆలపించడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. ఈ అద్భుత ప్రదర్శన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. సమానత్వం, మానవత్వం, సమస్త జీవుల ఏకత్వం అనే గొప్ప సందేశాన్ని ఈ కీర్తన ప్రపంచానికి చాటిచెప్పింది. కాలాతీతమైన ఈ సంకీర్తన తెలుగు సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని మరోసారి ప్రపంచానికి పరిచయం చేసింది. భాషలు, దేశాల సరిహద్దులు, తరాల అంతరాలను దాటి తెలుగు కళా వైభవం ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోందనడానికి ఇదొక అద్భుత నిదర్శనం!
