US Tariffs: 14 దేశాలపై అమెరికా సుంకాల మోత.. భారత్‌పై ఏకంగా 25 శాతం వరకు పెంపు.. ట్రంప్ నిర్ణయంతో ప్రపంచ వాణిజ్యంలో ప్రకంపనలు
భారత్, చైనా సహా 14 వాణిజ్య భాగస్వామ్య దేశాలపై 25 శాతం వరకు సుంకాలు(US Tariffs) విధించాలని అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించింది.
US trump administration proposes up to 25 percent tariffs on 14 countries including india and china
US Tariffs: ప్రపంచ వాణిజ్య రంగంలో మరోసారి కలకలం రేపుతూ అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం తన వాణిజ్య భాగస్వామ్య దేశాలపై భారీగా సుంకాలు విధించేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. భారత్, చైనా, జపాన్ సహా మొత్తం 14 దేశాలపై 25 శాతం వరకు టారిఫ్‌లు (US Tariffs)విధించాలని ప్రతిపాదించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. ఆయా దేశాల్లో అధిక పారిశ్రామిక ఉత్పత్తి వల్ల అమెరికా వాణిజ్య ప్రయోజనాలపై తీవ్ర ప్రభావం పడుతోందన్న కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అనైతిక వ్యాపార పద్ధతులకు పాల్పడుతున్నాయన్న ఆరోపణలపై సెక్షన్ 301 ప్రకారం యూనైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ (USTR) 16 దేశాలపై ఎనిమిది నెలల పాటు సుదీర్ఘ దర్యాప్తు నిర్వహించింది. ఆ దర్యాప్తు నివేదిక ఆధారంగానే 14 దేశాలకు సుంకాల మోత మోగించే ప్రతిపాదనలు సిద్ధం చేయగా, ఈ జాబితా నుంచి మెక్సికో, నార్వే దేశాలను మినహాయించడం గమనార్హం.
అధిక ఉత్పత్తిపై అమెరికా అభ్యంతరాలు.. చైనా, వియత్నాంలపై కఠిన ప్రతిపాదనలు:
తయారీ రంగంలో వాణిజ్య భాగస్వామ్య దేశాలు డిమాండ్‌కు మించి ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నాయని అమెరికా సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. దీనివల్ల అమెరికా సంస్థలతో పోలిస్తే ఆయా దేశాల కంపెనీలకు ధరల పరంగా అదనపు ప్రయోజనం లభిస్తోందని వాషింగ్టన్ ఆరోపిస్తోంది. ముఖ్యంగా చైనా తక్కువ ధరలకు భారీగా వస్తువులను ఉత్పత్తి చేసి అంతర్జాతీయ మార్కెట్లలోకి పంపుతోందన్న ఆందోళనతో దానిపై అదనపు సుంకాలు ప్రతిపాదించారు. వాషింగ్టన్‌తో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాన్ని గౌరవించడంలో విఫలమైతే చైనాపై అదనంగా 20 శాతం సుంకం విధించి, గరిష్ఠంగా 40 శాతానికి పెంచాలని ట్రంప్ యంత్రాంగం సూచించింది. మరోవైపు వియత్నాంపై 35 శాతం, భారత్ సహా ఇతర దేశాలపై 25 శాతం వరకు సుంకాలు విధించాలని భావిస్తున్నట్లు సమాచారం.
వాణిజ్య ఒప్పందాల చర్చల్లో వ్యూహం.. ఫెడరల్ రిజిస్టర్ నోటీసులో స్పష్టత:
ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో వాషింగ్టన్‌తో ఇంకా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోని దేశాల్లో భారత్, వియత్నాం మాత్రమే ఉన్నాయని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజా టారిఫ్ ప్రతిపాదనల ద్వారా వాణిజ్య ఒప్పందాల చర్చల్లో అమెరికా పైచేయి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఏయే దేశాలపై ఎంతెంత మేర సుంకాలు అమలు చేయనున్నారనే పూర్తి వివరాలను త్వరలో విడుదల చేయనున్న యూఎస్ ఫెడరల్ రిజిస్టర్ నోటీసులో వెల్లడించనున్నారు.
