Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 20 నుంచే వైకుంఠ ద్వార దర్శనాలు.. టికెట్ల షెడ్యూల్, పూర్తి వివరాలు ఇవే!

తిరుమల (Tirumala)శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 20 నుంచే వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నట్లు టీటీడీ ప్రకటిస్తూ టికెట్లు, టోకెన్ల విడుదల పూర్తి షెడ్యూల్‌ను వెల్లడించింది.

TTD announces vaikunta dwara darshan tickets and tokens schedule

Tirumala: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి వైకుంఠ ద్వార దర్శనాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భక్తులకు తిరుమల తిరుపతి(Tirumala) దేవస్థానం (టీటీడీ) కీలక అప్‌డేట్ అందించింది. డిసెంబర్ 20వ తేదీ నుంచి 29వ తేదీ వరకు పది రోజుల పాటు ఆలయంలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకుని తిరుమలకు భారీ ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, అందరికీ సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా వైకుంఠ ద్వార దర్శనాల సమయాన్ని 10 రోజులకు పెంచిన టీటీడీ, ఈసారి కూడా ఆన్‌లైన్‌లో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, శ్రీవాణి టికెట్లు, సర్వదర్శనం టోకెన్ల విడుదల షెడ్యూల్‌ను వివరంగా వెల్లడించింది.

Cyclone Alert: ఏపీకి మరో రెండు తుఫాన్ల ముప్పు.. ఈ జిల్లాల్లో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు!

రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి టికెట్ల విడుదల తేదీలు:

వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం (ఎస్ఈడీ) టికెట్లను టీటీడీ ఎల్లుండి నుంచి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. డిసెంబర్ 22వ తేదీ నుంచి 29వ తేదీ వరకు రోజుకు 15 వేల చొప్పున మొత్తం లక్షా 20 వేల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను భక్తుల కోసం అందుబాటులోకి తీసుకురానుంది. మరోవైపు, శ్రీవాణి ట్రస్ట్ దాతల ద్వారా దర్శనం చేసుకోవాలనుకునే భక్తుల కోసం డిసెంబర్ 26వ తేదీన ఆన్‌లైన్‌లో టికెట్లు విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. డిసెంబర్ 22 నుంచి 29వ తేదీ వరకు రోజుకు 1,500 చొప్పున శ్రీవాణి దర్శన టికెట్లు అందుబాటులో ఉంచనున్నారు.

సర్వదర్శనం భక్తుల కోసం ఈ-డిప్ రిజిస్ట్రేషన్ల షెడ్యూల్:

ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు లేని సామాన్య సర్వదర్శనం భక్తులకు కూడా దర్శన భాగ్యం కల్పించేందుకు టీటీడీ ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు సర్వదర్శనం భక్తులకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్లు నిర్వహించనుంది. అనంతరం డిసెంబర్ 4వ తేదీన ఎలక్ట్రానిక్ డిప్ (ఈ-డిప్) విధానం ద్వారా పారదర్శకంగా భక్తులకు దర్శన టోకెన్లను కేటాయించనుంది.

ఏకాదశి, ద్వాదశి రోజుల్లో 1.59 లక్షల టోకెన్ల కేటాయింపు:

పర్వదినాలైన వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో భక్తుల రద్దీని నియంత్రించి, ఎక్కువ మందికి శ్రీవారి దర్శన అవకాశం కల్పించేందుకు టీటీడీ భారీగా టోకెన్లు సిద్ధం చేసింది. ఈ రెండు ముఖ్యమైన రోజులకు సంబంధించి మొత్తం లక్షా 59 వేల దర్శన టోకెన్లను కేటాయించనుంది. కాబట్టి శ్రీవారి దర్శనం కోసం ప్రణాళికలు వేసుకుంటున్న భక్తులు టీటీడీ ప్రకటించిన ఈ తేదీలను గమనించి, ముందుగానే ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.