Balakrishna PA Arrested : నందమూరి బాలకృష్ణ పీఏ అరెస్టు.. నాన్ బెయిలబుల్ కేసులు నమోదు.. అసలేం జరిగిందంటే?
Balakrishna PA Arrested : ప్రముఖ నటుడు, హిందూపురం నియోజకవర్గం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పీఏ పావులూరి శ్రీనివాసరావుపై కేసు నమోదైంది.
Balakrishna PA Arrested : ప్రముఖ నటుడు, హిందూపురం నియోజకవర్గం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పీఏ పావులూరి శ్రీనివాసరావుపై కేసు నమోదైంది. మారణాయుధాలు కలిగి ఉన్నారన్న అభియోగాలపై శ్రీనివాసరావుతోపాటు.. మరో 65 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసినట్లు, వారిని కోర్టుకు హాజరుపరుస్తామని నరసరావుపేట ఏఎస్పీ హనుమంతరావు చెప్పారు.
Also Read : AP Rains : ఏపీవైపు దూసుకొస్తున్న మరో రెండు తుపాన్లు.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ కీలక సూచనలు
అసలేం జరిగిందంటే?
పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం యడ్లపాడు మండలంలోని తిమ్మాపురం గ్రామంలో సర్పంచ్ పదవి నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా ఆదివారం తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామ టీడీపీలోని అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. సర్పంచ్ పదవికోసం స్థానిక ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు అనుచరుడు, టీడీపీకి చెందిన నాగండ్ల రాంబాబుతో పాటు పావులూరి శ్రీనివాసరావు వర్గాలు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశాయి. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
తిమ్మాపురంలోని శ్రీనివాసరావుకు చెందిన ఓ మిల్లులో పోలీసులు తనిఖీలు చేయగా.. అక్కడ కర్రలు, కత్తులు ఉన్నట్లు గుర్తించారు. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సమయంలో పోలీసులకు, శ్రీనివాసరావు వర్గీయులకు మధ్య వాగ్వివాదం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తతంగా మారుతుండటంతో పోలీసులు శ్రీనివాసరావుతోపాటు మొత్తం 66 మందిని అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు. ఆ తరువాత శ్రీనివాసరావు వర్గీయులు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ ఛార్జి చేశారు.
