AP Rains : ఏపీవైపు దూసుకొస్తున్న మరో రెండు తుపాన్లు.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ కీలక సూచనలు
AP Rains : ప్రస్తుత వాతావరణ పరిస్థితుల ఆధారంగా ఈ నెలాఖరుకు బంగాళాఖాతంలో మరో తుపాను ఏర్పడే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
AP Weather Updates
AP Rains : వరుస తుపాన్లు కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో ఇటీవల వర్షాలు దంచికొట్టాయి. అక్టోబర్ నెలాఖరులో అర్నబ్, నవంబర్ మొదటి వారంలో మురసు తుపానుల కారణంగా పలు జిల్లాల్లో రైతులు సాగు చేసిన పంటలు దెబ్బతినగా.. ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లింది. పలు ప్రాంతాల్లో రోడ్లు, విద్యుత్ వ్యవస్థ భారీగా దెబ్బతింది. ఫలితంగా రెండు తుపాన్లు రాష్ట్రానికి తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి.
Also Read : YS Sharmila : షర్మిల రాకతో బెంగళూరులో హైటెన్షన్.. ఎయిర్పోర్ట్ వద్దే పోలీసుల మోహరింపు!
గత వారంరోజుల క్రితం ఏపీవైపు దూసుకొచ్చిన అక్వాన్ తుపాను చివరిలో దిశను మార్చుకొని ఒడిశా వైపు వెళ్లింది. దీంతో ఏపీపై పెద్దగా ప్రభావం చూపకపోవటంతో అధికార యంత్రాంగం, రైతాంగం ఊపిరిపీల్చుకుంది. అయితే, మళ్లీ వరుస తుఫాన్లు ఏపీపై ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలతోపాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల ఆధారంగా ఈ నెలాఖరుకు బంగాళాఖాతంలో మరో తుపాను ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. డిసెంబర్ మొదటి వారం తరువాత మరో తుపాను ఏర్పడే అవకాశం ఉందని.. పరిస్థితులు ఇలాగే కొనసాగితే మూడో తుపాను కూడా ఏర్పడే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నట్లు తెలిసింది.
దక్షిణ బంగాళాఖాతంలో ఉష్ణోగ్రతలు పెరిగితే అల్పపీడనాలు, వాయుగుండాలు ఏర్పడతాయని, సముద్రంపై ఆవరించిన రుతుపవనాలు తేమను గ్రహించటంతో అల్పపీడనాలకు అవకాశం ఉంటుందని, ఇవి తుపాన్లుగా మారి ఏ దిశగా పయనిస్తాయనే అంశంపై స్పష్టత రావాల్సి ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఏపీతోపాటు ఒడిశా, తమిళనాడు, పశ్చిమబెంగాల్ కు ముప్పు తప్పదని పేర్కొన్నారు.
