Adinarayana Reddy : చంద్రబాబు, లోకేశ్‌తో భేటీ తరువాత బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
Adinarayana Reddy : కడప జిల్లా పరిషత్ చైర్మన్ పదవి కేటాయింపు వ్యవహారం కూటమిలో రాజకీయ రచ్చకు కారణమైంది. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ తో భేటీ అయ్యారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
- Harish Thanniru
- Updated on- November 21, 2026 / 12:35 PM IST
BJP MLA Adinarayana Reddy
BJP MLA Adinarayana Reddy : కడప జిల్లా పరిషత్ చైర్మన్ పదవి కేటాయింపు వ్యవహారం కూటమిలో రాజకీయ రచ్చకు కారణమైంది. కడప జడ్పీ చైర్మన్ పీఠాన్ని బీజేపీకి కేటాయించాలని ఆ పార్టీ నేత, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మొదటి నుంచి డిమాండ్ చేస్తూ వస్తున్నారు. తన సోదరుడి కుమారుడికి కేటాయిస్తారని ఆశించారు. అందుకు బీజేపీ పెద్దలుసైతం మద్దతుగా నిలవడంతో కడప జడ్పీపీఠం బీజేపీకి వెళ్తుందని ప్రచారం జరిగింది. అయితే, గురువారం రాత్రి ప్రకటించిన జాబితాలో కడప జడ్పీ చైర్మన్ పీఠం టీడీపీ కేటాయిస్తూ కూటమి తరపున ప్రకటన విడుదలైంది. దీంతో ఆదినారాయణ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : Wedding Season 2026 : పెళ్లిళ్ల సీజన్ షురూ.. ఈ తేదీల్లో అదిరిపోయే ముహూర్తాలు.. మిడిల్ క్లాస్‌కు ఊరట..!
కూటమిలో భాగంగా కడప జెడ్పీ ఛైర్మన్ పదవిని తన సోదరుడి కుమారుడికి కేటాయిస్తారని ఆశించిన ఆదినారాయణ రెడ్డికి భంగపాటు ఎదురైంది. పొత్తులో భాగంగా ఆ సీటును టీడీపీ నేత పుత్తా నరసింహారెడ్డికి కేటాయించడంతో.. శుక్రవారం ఆయన జడ్పీ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ పరిణామంతో తీవ్రంగా నొచ్చుకున్న ఆదినారాయణ రెడ్డి, తన సోదరుల కుమారులు చదిపిరాళ్ల రాజేశ్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డిలతో కలిసి రాజీనామాలకు సిద్ధమయ్యారు.
తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆదినారాయణ చెప్పడంతో బీజేపీ పెద్దలు రంగంలోకిదిగి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయినా ఆదినారాయణ రెడ్డి వెనక్కుతగ్గలేదు. శనివారం తన రాజీనామా విషయంపై క్లారిటీ ఇస్తానని మీడియా ముఖంగా ప్రకటించారు. శుక్రవారం రాత్రి కేంద్ర బీజేపీ పెద్దలు ఆదినారాయణతో చర్చలు జరిపారు. అయినా వెనక్కు తగ్గకపోవటంతో.. పరిస్థితి తీవ్రతను గమనించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తనతోపాటు ఆదినారాయణ రెడ్డిని ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నాయుడు క్యాంపు కార్యాలయానికి తీసుకెళ్లారు. చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఆ తరువాత మంత్రి నారా లోకేశ్‌తోనూ ఆదినారాయణ రెడ్డి భేటీ అయ్యారు.
చంద్రబాబు, లోకేశ్‌తో భేటీ తరువాత ఆదినారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కడప జడ్పీ చైర్మన్ పదవి విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌తో విడివిడిగా చర్చలు జరిపినట్లు వెల్లడించారు. అయితే, ఈ చర్చలు ఆశాజనకంగా సాగలేదని చెప్పారు. కడప జడ్పీ ఛైర్మన్ పదవిని బీజేపీకి కేటాయిస్తామని గతంలో హామీ ఇచ్చారని, ఆ హామీని నిలబెట్టుకోవాలని చంద్రబాబు, లోకేష్‌ను కోరినట్లు ఆదినారాయణరెడ్డి తెలిపారు. అయినప్పటికీ చివరి నిమిషంలో ఆ పదవిని టీడీపీకి కేటాయించారని అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజీనామాల అంశంపై కూడా ఆదినారాయణరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తన పిల్లలు రాజీనామాల విషయంలో వెనక్కి తగ్గబోరని స్పష్టం చేశారు. తన రాజీనామా అంశంపై మాత్రం త్వరలోనే నిర్ణయం వెల్లడిస్తానని చెప్పారు.
