Telangana Ration Card : రేషన్ కార్డుదారులకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో శుభవార్త.. బియ్యంతోపాటు అవికూడా..
Telangana Ration Card : తెలంగాణలోని తెల్లరేషన్ కార్డుదారులకు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ సర్కార్ మరో శుభవార్త చెప్పింది.
Telangana Ration Card
Telangana Ration Card : ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం తగ్గింది. దీంతో వరి, ఇతర పప్పుధాన్యాల ఉత్పత్తి గణనీయంగా తగ్గుతోందని ఆందోళన నెలకొంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తెలంగాణలోని సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ అప్రమత్తమైంది. రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రజలకు శుభవార్త చెప్పింది.
Also Read : 121 Kgs Gold Ornaments : తిరుమల శ్రీవారికి 121 కోట్లు ఇచ్చిన భక్తుడు ఎవరు? ఆయన ఫుల్ డిటెయిల్స్ ఇవే..
ప్రభుత్వం ప్రస్తుతం రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. త్వరలో మరిన్ని నిత్యావసర వస్తువులనుకూడా అందించే యోచనలో ఉంది. అంతేకాదు.. ఎల్నినో కారణంగా రానున్న రోజుల్లో ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కనీసం 15 నెలలకు సరిపడా సన్నబియ్యం నిల్వలను సిద్ధం చేసుకోవాలని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
ప్రస్తుతం రాష్ట్ర అవసరాలకు సరిపడా సుమారు 14 నెలల సన్నబియ్యం నిల్వలు అందుబాటులో ఉన్నాయన్న మంత్రి.. వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మరో నెలకు సరిపడా నిల్వలను అదనంగా సమకూర్చుకోవాలని అధికారులకు సూచించారు. రైతులు సన్నరకాల ధాన్యం సాగు చేసేలా ప్రోత్సహించాలని, క్వింటాకు రూ.500 బోనస్ వర్తించే ఏడు రకాల సన్నధాన్యాల వివరాలను కొనుగోలు కేంద్రాల్లో ప్రచారం చేయాలని ఆదేశించారు.
మరోవైపు.. రేషన్ దుకాణాల ద్వారా బియ్యంతో పాటు పప్పు, నూనె, చింతపండు, కారం, చక్కెర, గోధుమపిండి వంటి నిత్యావసర వస్తువులను పంపిణీ చేసే ప్రతిపాదనలను పరిశీలించాలని మంత్రి అధికారులకు సూచించారు. ధరల భారంతో ఇబ్బందులు పడుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఊరట కల్పించేలా ఏయే సరుకులను పంపిణీ చేయవచ్చో అధ్యయనం చేయాలని ఆదేశించారు. అధికారుల ప్రతిపాదనలను మంత్రివర్గ ఉపసంఘం పరిశీలించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నారు. అంతేకాక.. ధాన్యం నిల్వలకోసం రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల టన్నుల సామర్థ్యంతో ఆధునిక స్థాయిలో గోదాములు నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
మరోవైపు.. ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు నీటిపారుదల శాఖ కూడా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా తొలివిడతలో రూ.2 వేల కోట్లతో నీటి వనరుల అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. చెరువులు, వాగులు, కాలువల పునరుద్ధరణ, భూగర్భ జలాల పెంపు, వర్షపు నీటి సంరక్షణకు ఈ నిధులను వినియోగించనున్నారు. ఇప్పటికే ఐదు నెలల్లో రూ.10 వేల కోట్లతో ఎల్నినో ప్రభావ నియంత్రణ పనులు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు.
