AsiaCup Rising Stars 2026 : బంతులతో నిప్పులు చెరిగిన భారత్ బౌలర్లు.. ప్రత్యర్థి జట్టు 26 పరుగులకే ఆలౌట్..

AsiaCup Rising Stars 2026 : ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో భారత్-ఎ జట్టు ప్రత్యర్థి నేపాల్‌కు చుక్కలు చూపించింది. బ్యాటింగ్‌లో సెంచరీలతో చెలరేగిన భారత ఆటగాళ్లు.. బౌలింగ్‌లోనూ విజృంభించడంతో నేపాల్ కేవలం 26 పరుగులకే కుప్పకూలింది. 306 పరుగుల భారీ తేడాతో భారత్ ఘన విజయం సాధించింది.

AsiaCup Rising Stars 2026

Asia Cup Rising Stars 2026 : ఆసియాకప్ రైజింగ్ స్టార్స్ వన్డే టోర్నమెంట్‌ను భారత్ -ఎ జట్టు ఘనంగా ప్రారంభించింది. శుక్రవారం భారత్ -ఎ వర్సెస్ నేపాల్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు, బౌలర్లు రెచ్చిపోయారు. తొలుత బ్యాటుతో పరుగుల వరద పారించారు. ఫలితంగా 332 పరుగులు చేయగా.. ఆ తరువాత నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థి బ్యాటర్లను హడలెత్తించారు. దీంతో నేపాల్ బ్యాటర్లు కేవలం 26 పరుగులకే చేతులెత్తేయడంతో.. భారత్-ఎ జట్టు 306 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది.

Also Read : NZ Vs IND : సిరాజ్ పేరు వల్లే తుది జట్టులో చోటు దక్కలేదా? కాంగ్రెస్, బీజేపీ నేతల మాటల యుద్ధం.. రంగంలోకి మాజీ క్రికెటర్లు..

దోహాలోని వెస్ట్ ఎండ్ పార్క్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ జట్టుకు ప్రారంభంలోనే వరుస ఎదురు దెబ్బలు తగిలాయి. ఓపెనర్ అభిషేక్ శర్మ పరుగులు రాబట్టడంలో విఫలమయ్యాడు. కేవలం తొమ్మిది పరుగులకే ఔట్ అయ్యాడు. మరోవైపు ఆయుష్ బదోని కేవలం రెండు పరుగులు చేసి పెవిలియన్ బాటపట్టాడు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కూడా 26 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. దీంతో 42 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి భారత జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ తిలక్ వర్మ (107), కుమార్ కుశాగ్ర (117) సెంచరీలతో చెలరేగడంతో భారత్ భారీ స్కోరు దిశగా దూసుకెళ్లింది. చివర్లో సూర్యాంశ్ షెడ్గే మెరుపులు మెరిపించాడు. కేవలం 14 బంతుల్లోనే 36 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో భారత్-ఎ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 332 పరుగులు చేసింది.

భారత బౌలర్ల ధాటికి కుప్పకూలిన నేపాల్..
333 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్‌కు ఆదిలోనే భారీ ఎదురుదెబ్బలు తగిలాయి. హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్ నిప్పులు చెరిగే బంతులతో నేపాల్ బ్యాటర్లను వరుసగా పెవిలియన్‌కు పంపించారు. హర్షిత్ రాణా 6 ఓవర్లలో 16 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ప్రిన్స్ యాదవ్ 5 ఓవర్లలో కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు సాధించాడు. షాబాజ్ అహ్మద్ మరో వికెట్ తీశాడు.

నేపాల్ జట్టు 11.3 ఓవర్లలో 26 పరుగులకే ఆలౌటైంది. లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలో ఇది నాలుగో అత్యల్ప స్కోరుగా నమోదైంది. ఈ మ్యాచ్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన కుమార్ కుశాగ్రకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. మొత్తంగా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన భారత్-ఎ జట్టు టోర్నీలో తన సత్తా చాటింది.