IND vs NZ : ముగిసిన నాలుగో రోజు ఆట.. రెండో ఇన్నింగ్స్‌లో నిలకడగా ఆడుతున్న న్యూజిలాండ్ బ్యాటర్లు.. బౌలర్లదే భారం..
IND vs NZ : వెల్లింగ్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో నాలుగో రోజు ఆట ముగిసింది
- Thota Vamshi Kumar
- Updated on- November 22, 2026 / 11:23 AM IST
IND vs NZ 1st Test Day 4 stumps New Zealand Second innings 119 for 2 wickets
IND vs NZ : వెల్లింగ్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో నాలుగో రోజు ఆట ముగిసింది. రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. 352 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన న్యూజిలాండ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. డెవాన్ కాన్వే (59), రచిన్ రవీంద్ర (27) లు క్రీజులో ఉన్నారు. న్యూజిలాండ్ ఇంకా 233 పరుగులు వెనుకబడి ఉంది.
అంతక ముందు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 9 వికెట్ల నష్టానికి 720 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (136; 290 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు), రిషబ్ పంత్ (128; 153 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లు) శతకాలతో చెలరేగారు. యశస్వి జైస్వాల్ (85), దేవ్‌దత్ పడిక్కల్ (80), శుభ్‌మన్ గిల్ (98), ధ్రువ్ జురెల్ (78)లు హాఫ్ సెంచరీలు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో గ్లెన్ ఫిలిప్స్ మూడు వికెట్లు తీశాడు. రచిన్ రవీంద్ర రెండు వికెట్లు తీశారు. మ్యాట్ హెన్రీ, కైల్ జేమీసన్, జాకబ్ డఫీ, నాథన్ స్మిత్ లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 368 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. దీంతో భారత్‌కు 352 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. తొలి టెస్టులో భారత్ విజయం సాధించాలంటే ఆఖరి, ఐదో రోజైన సోమవారం మరో 8 వికెట్లను తీయాల్సి ఉంటుంది.
