Asia Cup Rising Stars 2026 : సెంచరీలతో చెలరేగిన తిలక్ వర్మ, కుమార్ కుషాగ్ర.. ప్రారంభంలో సూర్యవంశీ మాత్రం..

Asia Cup Rising Stars 2026 : ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నీలో భారత్-ఏ జట్టు బ్యాటర్లు అదరగొట్టారు.

Asia Cup Rising Stars 2026

Asia Cup Rising Stars 2026 : ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నీలో భారత్-ఏ జట్టు బ్యాటర్లు అదరగొట్టారు. మ్యాచ్ ప్రారంభంలో వరుస వికెట్లు కోల్పోయినప్పటికీ.. కెప్టెన్ తిలక్ వర్మ, వికెట్ కీపర్ బ్యాటర్ కుమార్ కుశాగ్ర సెంచరీలతో చెలరేగి పోయారు. వీరిద్దరూ అద్భుతమైన బ్యాటింగ్‌తో భారత జట్టును పటిష్ఠ స్థితికి చేర్చారు. దీంతో నేపాల్ ముందు 333 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

Also Read : IND vs NZ : 32 ఏళ్ల నిరీక్షణకు తెర.. న్యూజిలాండ్ గడ్డపై చరిత్ర సృష్టించిన జైస్వాల్, కేఎల్ రాహుల్!

దోహాలోని వెస్ట్ ఎండ్ పార్క్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో శుక్రవారం భారత్-ఏ, నేపాల్ జట్ల మధ్య గ్రూప్-బి మ్యాచ్ జరిగింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ జట్టుకు ప్రారంభంలోనే వరుస ఎదురు దెబ్బలు తగిలాయి. ఓపెనర్ అభిషేక్ శర్మ పరుగులు రాబట్టడంలో విఫలమయ్యాడు. కేవలం తొమ్మిది పరుగులకే ఔట్ అయ్యారు. మరోవైపు ఆయుష్ బదోని కేవలం రెండు పరుగులు చేసి పెవిలియన్ బాటపట్టాడు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ప్రారంభం నుంచి దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో 32 బంతుల్లో 26 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. దీంతో 42 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి భారత జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది.

క్రీజులోకి వచ్చిన కెప్టెన్ తిలక్ వర్మ, కుమార్ కుశాగ్ర నేపాల్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ పరుగుల వరద పారించారు. నాలుగో వికెట్‌కు ఏకంగా 206 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో కుమార్ కుశాగ్ర 102 బంతుల్లో 117 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. మరోవైపు కెప్టెన్ తిలక్ వర్మ 113 బంతుల్లో 107 పరుగులు సాధించాడు. ఇందులో 6 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. వీరిద్దరూ సెంచరీలతో చెలరేగడంతో భారత్ భారీ స్కోరు దిశగా దూసుకెళ్లింది.

మిగిలిన బ్యాటర్లు రింకూ సింగ్ 9, షాబాజ్ అహ్మద్ 8, విప్రజ్ నిగమ్ 0, హర్షిత్ రాణా 1 పరుగుకే ఔటయ్యారు. అయితే చివర్లో సూర్యాంశ్ షెడ్గే మెరుపులు మెరిపించాడు. కేవలం 14 బంతుల్లోనే 36 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 4 సిక్సర్లు, ఒక ఫోర్ ఉన్నాయి. దీంతో భారత్-ఏ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 332 పరుగులు చేసింది. నేపాల్ బౌలర్లలో లలిత్ రాజ్‌బంశీ, కెప్టెన్ సందీప్ లామిచానే చెరో మూడు వికెట్లు పడగొట్టారు. నందన్ యాదవ్ రెండు వికెట్లు తీశాడు.