BJP-Shiromani Akali Dal: పంజాబ్ రాజకీయాల్లో భారీ ట్విస్ట్.. ఆరేళ్ల తర్వాత మళ్లీ ఒక్కటైన బీజేపీ – అకాలీదళ్.. అమిత్ షా సమక్షంలో కీలక ప్రకటన
పంజాబ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది ఆరేళ్ల విరామం తర్వాత శిరోమణి అకాలీదళ్(BJP-Shiromani Akali Dal) మళ్లీ ఎన్డీఏ కూటమిలోకి చేరింది.
punjab Elections bjp shiromani akali dal alliance reunited
BJP-Shiromani Akali Dal: దేశ రాజకీయాల్లో, ముఖ్యంగా పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సమీకరణాలను సమూలంగా మార్చేసే కీలక పరిణామం చోటుచేసుకుంది. దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత భారతీయ జనతా పార్టీ (బీజేపీ), శిరోమణి అకాలీదళ్ (BJP-Shiromani Akali Dal) మధ్య మళ్లీ పాత స్నేహం చిగురించింది. 2020లో ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వెళ్లిన అకాలీదళ్, తాజాగా తిరిగి ఎన్డీఏ గూటికి చేరింది. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నితీన్ నబీన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో జరిగిన కీలక సమావేశం అనంతరం ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇకపై రాబోయే అన్ని ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసికట్టుగా బరిలోకి దిగనున్నట్లు స్పష్టం చేశారు.
హిందూ-సిఖ్ ఐక్యతకు నిదర్శనమన్న అమిత్ షా:
ఈ పొత్తుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. చిరకాల మిత్రుడైన అకాలీదళ్ తిరిగి రావడంతో ఎన్డీఏ కూటమికి పరిపూర్ణత చేకూరిందని, పవిత్రమైన గురుపూర్ణిమ పర్వదినాన ఈ కలయిక అందరికీ ఎంతో సంతోషాన్ని ఇస్తోందని పేర్కొన్నారు. బీజేపీ-అకాలీదళ్ బంధం కేవలం రాజకీయ పొత్తు మాత్రమే కాదని, అది హిందూ-సిఖ్ సోదరభావానికి, ఐక్యతకు ప్రతీక అని కొనియాడారు. గతంలో తాము కలిసి అనేక ఎన్నికల్లో విజయాలు సాధించామని, భవిష్యత్తులోనూ అదే ఒరవడి కొనసాగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
విభేదాలకు తెర.. మళ్లీ దగ్గరైన పాత మిత్రులు:
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు నిరసనగా 2020 సెప్టెంబర్ 26న శిరోమణి అకాలీదళ్ ఎన్డీఏ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఏడాది ఆగస్టులో అకాలీదళ్ అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్ ప్రధాని నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా భేటీ కావడంతో ఇరు పార్టీల మధ్య మళ్లీ సయోధ్యకు బీజం పడింది. ఆ తర్వాత కేంద్రం ప్రతిపాదించిన మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ అంశాలకు అకాలీదళ్ మద్దతు పలకడం, ఇటీవల చండీగఢ్ మున్సిపల్ ఎన్నికల వేళ ఆప్, కాంగ్రెస్ వ్యతిరేక శక్తులతో కలిసి పనిచేయడానికి సిద్ధమని సంకేతాలివ్వడం ఈ పొత్తుకు మార్గం సుగమం చేశాయి.
సీట్ల పంపకాలు.. పంజాబ్లో మారనున్న ఓటు బ్యాంకు లెక్కలు:
ప్రస్తుతం పంజాబ్లోని మొత్తం 117 అసెంబ్లీ స్థానాల్లో 40 నుంచి 48 సీట్లలో పోటీ చేయాలని బీజేపీ ఆశిస్తోంది. రాష్ట్రంలో గ్రామీణ జాట్ సిక్కు ఓటర్లపై అకాలీదళ్కు బలమైన పట్టు ఉండగా, పట్టణ ప్రాంతాల్లోని హిందూ, వ్యాపార వర్గాల ఓటు బ్యాంకు బీజేపీకి అండగా ఉంది. గత లోక్సభ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసినప్పటికీ బీజేపీకి 18.56 శాతం, అకాలీదళ్కు 13.42 శాతం ఓట్లు దక్కాయి. ఇప్పుడు ఈ రెండు ప్రధాన పక్షాలు ఏకం కావడంతో పంజాబ్ రాజకీయాల్లో అధికార ఆప్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలకు గట్టి సవాలు ఎదురుకానుంది.
