Phule : ‘ఫూలే’ సినిమా ప్రెస్ మీట్.. ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు..
తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. (Phule)
Jyotirao Phule
Phule : సామాజిక సంస్కరణల చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన మహనీయులు జ్యోతిరావ్ ఫూలే, సావిత్రిబాయి ఫూలే. సమాజంలో నెలకొన్న కులవివక్ష, అసమానతలు, మహిళలపై వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతూ విద్య, సమానత్వం, సామాజిక న్యాయం కోసం తమ జీవితాలను అంకితం చేసిన మహనీయులు జ్యోతిరావ్ ఫూలే, సావిత్రిబాయి ఫూలే జీవిత కథ ఆధారంగా ‘ఫూలే’ సినిమా తెరకెక్కింది. హిందీలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో డబ్బింగ్ అయి నవంబర్ 27న థియేటర్లలో రిలీజ్ కానుంది. సుపదా క్రియేషన్స్ బ్యానర్ పై డా. పొన్నం రవిచంద్ర నిర్మాణంలో అనంత్ మహదేవన్ దర్శకత్వంలో ఈ సినిమాని నిర్మించారు. ఇటీవల ఈ సినిమాను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ప్రత్యేకంగా వీక్షించారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ ప్రెస్ మీట్ లో రచయిత పసునూరి రవీందర్ మాట్లాడుతూ.. హిందీలో వచ్చిన ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్న పొన్నం రవిచంద్ర గారికి ధన్యవాదాలు. మహాత్మా జ్యోతిరావ్ ఫూలే గారి జీవితం అందరికీ ఆదర్శనీయం అని అన్నారు. సోషల్ యాక్టివిస్ట్ విమలక్క మాట్లాడుతూ.. ఈ రోజు ఆడపిల్లలు ఎన్నో రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదుగుతున్నారంటే అందుకు సావిత్రిబాయి ఫూలే గారు వేసిన పునాదులే కారణం. ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ స్ఫూర్తి పొందుతారు అని అన్నారు.
Also See : Ruhani Sharma : ‘ఆకాశంలో ఒక తార’ వర్కింగ్ స్టిల్స్.. బిజిలి పాత్రలో జీవించేసిన రుహాణి శర్మ..
నిర్మాత పొన్నం రవిచంద్ర మాట్లాడుతూ.. ఈ సినిమాను విడుదల చేస్తున్న సునీల్ నారంగ్ గారికి, ఆడియోను విడుదల చేస్తున్న మధుర ఆడియో వారికి ధన్యవాదాలు. ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు. నవంబర్ 27న ఎన్ని సినిమాలు విడుదలైనా ఫూలే విభిన్నమైన జానర్లో వస్తోంది. సుమారు 200 ఏళ్ల క్రితం జరిగిన చరిత్రను నేటి ప్రజలు, ముఖ్యంగా మహిళలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. జ్యోతిరావ్ ఫూలే, సావిత్రిబాయి ఫూలే జీవిత చరిత్రను తెలుగులోకి తీసుకురావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. నవంబర్ 26న ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నాం అని తెలిపారు.
