Telangana Indiramma Insurance : ఇందిరమ్మ బీమా కోసం అప్లయ్ చేస్తున్నారా? ఇంటి పన్ను రసీదుపై ప్రభుత్వం ఫుల్ క్లారిటీ!
Telangana Indiramma Insurance : ఇందిరమ్మ జీవిత బీమా పథకం రిజిస్ట్రేషన్ కొనసాగుతోంది. దరఖాస్తుకు కావాల్సిన డాక్యుమెంట్లు, ఇంటి పన్ను రసీదు అవసరమా? అర్హతలు, నమోదు చివరి తేదీ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Telangana Indiramma Insurances
- ఇందిరమ్మ బీమా దరఖాస్తుకు ఇవి ఉంటే చాలు..
- మీ కుటుంబంలో ఇందిరమ్మ బీమాకు ఒక్కరికే ఛాన్స్..
- ఇందిరమ్మ బీమా రిజిస్ట్రేషన్ షురూ..
- అర్హులు ఈ విషయాలు మిస్ కావొద్దు
Telangana Indiramma Insurance : తెలంగాణలో అర్హులైన పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ఇందిరమ్మ జీవిత బీమా పథకం నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. నవంబర్ 19న ప్రారంభమైన ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ డిసెంబర్ 18 వరకు జరగనుంది. దీంతో అర్హులైనవారు తమ పేర్లు నమోదు చేసుకునేందుకు గ్రామాలు, పట్టణాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాలకు వెళ్తున్నారు..
వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం :
అయితే, ఈ పథకానికి అప్లయ్ చేసుకునే విషయంలో చాలామందికి ఓ సందేహం మొదలైంది. ఇందిరమ్మ బీమా కోసం ఇంటి పన్ను రసీదు కూడా తప్పనిసరిగా సమర్పించాలంటూ వాట్సప్ గ్రూపుల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ రసీదు లేకపోతే బీమా వర్తించదేమోనని చాలామంది ఆందోళన చెందుతున్నారు..
అసత్య ప్రచారంపై సర్కార్ క్లారిటీ :
ఈ ప్రచారంపై ప్రభుత్వం ఫుల్ క్లారిటీ ఇచ్చింది. ఇందిరమ్మ జీవిత బీమా నమోదు కోసం ఇంటి పన్ను రసీదు అవసరం లేదని తెలిపింది. కేవలం రేషన్ కార్డు, ఆధార్ కార్డు, మొబైల్ నంబర్ ఉంటే సరిపోతుందని వెల్లడించింది. ఆధార్, రేషన్ కార్డుల జిరాక్స్ కాపీలు కూడా అందించాల్సి ఉంటుంది. బీమా చేయించుకోవాలనుకునే వ్యక్తి మాత్రమే శిబిరానికి వెళ్తే సరిపోతుంది. కుటుంబ సభ్యులందరూ రావాల్సిన అవసరం లేదు..
ఎవరెవరు అర్హులు? :
ఈ పథకానికి 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మధ్య వయసున్నవారు అర్హులు. కుటుంబంలో ఒక్కరికి మాత్రమే అవకాశం ఉంటుంది. కుటుంబ పెద్ద లేదా సంపాదించే వ్యక్తి పేరుతో రిజిస్టర్ చేసుకోవాలి. ఆధార్ కార్డులో ఉన్న వయసునే ప్రామాణికంగా తీసుకుంటారు. నామినీ వివరాలను కూడా అధికారులకు అందించాలి.
మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. గ్రామ పంచాయతీ లేదా మున్సిపల్ వార్డు పరిధిలో ఏర్పాటు చేసిన శిబిరంలోనే రిజిస్టర్ చేసుకోవాలి. దివ్యాంగులు, అనారోగ్యంతో శిబిరానికి రాలేని వారికి అధికారులు ఇంటి వద్దకే వచ్చి వివరాలు నమోదు చేస్తారు..
అర్హత ఉన్నవారు చివరి తేదీ వరకు వేచి ఉండొద్దు.. డిసెంబర్ 18లోపు అప్లయ్ చేసుకోవడం బెటర్.. ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను అసలు నమ్మొద్దు..
