Chittoor Robbery : చిత్తూరులో సినీ ఫక్కీలో దారి దోపిడీ.. కారును వెంబడించి రూ.20 లక్షలు దోచుకున్న దుండగులు!
Chittoor Robbery : ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో తెల్లవారుజామున భారీ దారి దోపిడీ కలకలం రేపింది.
- Harish Thanniru
- Updated on- November 22, 2026 / 12:00 PM IST
chittoor highway robbery
Chittoor Robbery : ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో తెల్లవారుజామున భారీ దారి దోపిడీ కలకలం రేపింది. జాతీయ రహదారిపై రూ.20 లక్షల నగదుతో వెళ్తున్న కారును మరో కారులో వచ్చిన దుండగులు వెంబడించి అడ్డగించారు. అనంతరం కారును ఢీకొట్టి, అందులో ఉన్న ఇద్దరు వ్యక్తుల నుంచి నగదును బలవంతంగా లాక్కొని పరారయ్యారు. బంగారుపాళెం మండలం ఎద్దులవారిపల్లి జాతీయ రహదారి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సినిమాను తలపించేలా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
కర్ణాటకకు చెందిన ఇద్దరు వ్యక్తులు నెల్లూరు నుంచి బెంగళూరుకు కారులో బయలుదేరారు. వారి వద్ద రూ.20 లక్షల నగదు ఉంది. అయితే, నగదుతో వెళ్తున్న కారును పశ్చిమ బెంగాల్‌కు చెందిన వ్యక్తులు మరో కారులో వెంబడించడం ప్రారంభించారు. తమ కారును ఎవరో వెంబడిస్తున్నారని గుర్తించిన కర్ణాటక వాసులు వేగం పెంచారు. అయినప్పటికీ దుండగులు వదలకుండా చాలా దూరం వెంబడించారు. దీంతో రెండు కార్ల మధ్య హైవేపై కొంతసేపు ఛేజింగ్ కొనసాగింది.
దుండగుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో కర్ణాటకకు చెందిన కారు జాతీయ రహదారి నుంచి పక్కనే ఉన్న ఎద్దులవారిపల్లి గ్రామంలోకి దూసుకెళ్లింది. అయినప్పటికీ వెంబడించిన దుండగులు కారుతో ఆ వాహనాన్ని ఢీకొట్టారు. ఈ ఘటనలో రెండు కార్లు ప్రమాదానికి గురయ్యాయి. ఆ తరువాత కర్ణాటక కారులోని ఇద్దరు వ్యక్తుల వద్ద నుంచి రూ.20 లక్షల నగదును బలవంతంగా లాక్కొని దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.
ఈ ఘటనపై బాధితులు బంగారుపాళెం పోలీసులను ఆశ్రయించారు. తమను వెంబడించి, నలుగురు వ్యక్తులు రూ.20 లక్షల నగదును బలవంతంగా దోచుకెళ్లారని ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. నిందితులు ఉపయోగించిన కారు, వారి ఆచూకీ తదితర వివరాలపై ఆరా తీస్తున్నారు. పట్టపగలు కాకుండా తెల్లవారుజామునే జాతీయ రహదారిపై ఈ తరహా దోపిడీ జరగడం స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది.
