Amaravati Bullet Train: ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్.. విజయవాడ 13 కి.మీ దూరంలోనే ‘బుల్లెట్ ట్రైన్’ కారిడార్.. హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ గ్రీన్ సిగ్నల్!
హైదరాబాద్-అమరావతి-చెన్నై హైస్పీడ్ రైల్(Amaravati Bullet Train) కారిడార్‌లో భాగంగా విజయవాడకు కేవలం 13 కి.మీ దూరంలోనే అమరావతి బుల్లెట్ ట్రైన్ స్టేషన్ నిర్మించేందుకు ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్ ఆమోదం తెలిపింది.
Amaravati bullet train station just 13 km from vijayawada nhsrcl approves
Amaravati Bullet Train: దక్షిణ భారతదేశంలో రవాణా వ్యవస్థ రూపురేఖలను పూర్తిగా మార్చేసే ప్రతిష్ఠాత్మక హైస్పీడ్ రైల్ (Amaravati Bullet Train) కారిడార్ ప్రాజెక్టులో ఒక కీలక ముందడుగు పడింది. హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా చెన్నై వరకు నిర్మించనున్న ఈ 760 కిలోమీటర్ల కారిడార్‌లో, అమరావతి రైల్వే స్టేషన్‌ను విజయవాడ నగరానికి కేవలం 13 కిలోమీటర్ల దూరంలోనే నిర్మించేందుకు నేషనల్ హైస్పీడ్ రైల్ కారిడార్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్) అంగీకరించింది. విజయవాడ వాసులు బుల్లెట్ రైలు ఎక్కేందుకు ఎక్కువ దూరం వాహనాల్లో ప్రయాణించాల్సిన ఇబ్బంది లేకుండా, వీలైనంత చేరువలో ఈ స్టేషన్ ఉండాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు సంస్థ సమ్మతి తెలిపింది. ఏపీ పరిధిలోని 518 కిలోమీటర్ల మేర దాచేపల్లి, అమరావతి, గుంటూరు, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, తిరుపతి మీదుగా చెన్నై వెళ్లే ఎలైన్‌మెంట్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పూర్తి క్లియరెన్స్ ఇచ్చింది.
తెలంగాణలో ఎలైన్మెంట్ జాప్యంతో నిలిచిన సర్వే, డీపీఆర్ పనులు:
ఏపీ ప్రభుత్వం తన పరిధిలో మార్గాన్ని వేగంగా ఖరారు చేసినప్పటికీ, తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలైన్మెంట్పై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత రాలేదు. శంషాబాద్, భారత్సిటీ, డ్రైపోర్ట్, హాలియా, వాడపల్లి మీదుగా ఈ కారిడార్ ఏపీలోకి ప్రవేశించేలా ప్రతిపాదించిన మార్గం హైదరాబాద్ నగరానికి దూరమవుతుందన్న వాదనతో అక్కడ నిర్ణయం జాప్యమవుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ నుంచి క్లియరెన్స్ రాకపోవడంతో ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్ అధికారులు ఫైనల్ లొకేషన్ సర్వే (ఎఫ్ఎల్ఎస్), డీపీఆర్ తయారీని తాత్కాలికంగా పక్కనపెట్టి, దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలని రైల్వే బోర్డుకు నివేదించారు.
చెన్నై-బెంగళూరు కారిడార్, తిరుపతి లింక్‌పైనా పడిన ప్రభావం:
మరోవైపు తమిళనాడులో ఏర్పడిన కొత్త ప్రభుత్వం విమానాశ్రయ ప్రతిపాదనను పెరందూరు నుంచి వేరే ప్రాంతానికి మార్చడంతో, చెన్నై-చిత్తూరు-బెంగళూరు హైస్పీడ్ రైల్ కారిడార్ ఎలైన్మెంట్పైనా సందిగ్ధత నెలకొంది. ఈ పరిణామంతో హైదరాబాద్-చెన్నై కారిడార్‌ను బెంగళూరు మార్గంతో అనుసంధానించేందుకు ఏపీ ప్రభుత్వం కోరిన తిరుపతి-చిత్తూరు లింక్ కారిడార్ ప్రతిపాదన కూడా తాత్కాలికంగా నిలిచిపోయింది.
