Telangana High Court: పోలీసు ఉన్నతాధికారులకు జైలు శిక్ష.. సైబరాబాద్ సీపీ, మేడ్చల్ డీసీపీపై వేటు.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు!

భూ వివాదంలో పోలీసు రక్షణ ఉత్తర్వులను అమలు చేయలేదన్న కోర్టు ధిక్కరణ కేసులో సైబరాబాద్ సీపీ, మేడ్చల్ డీసీపీలకు తెలంగాణ హైకోర్టు (Telangana High Court)రెండు వారాల జైలు శిక్ష విధించింది.

Telangana high court jail sentence to cyberabad cp ramesh reddy medchal dcp kotireddy

Telangana High Court: న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులకు తెలంగాణ హైకోర్టు కఠినమైన జైలు శిక్ష విధిస్తూ సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్‌ రెడ్డి, మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డిలకు చెరో రెండు వారాల పాటు సాధారణ జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.2 వేల జరిమానా విధిస్తున్నట్లు ధర్మాసనం (Telangana High Court)స్పష్టం చేసింది. ఒక భూ వివాదానికి సంబంధించి దాఖలైన కోర్టు ధిక్కరణ కేసుపై విచారణ జరిపిన అనంతరం హైకోర్టు ఈ కీలక తీర్పును వెలువరించింది.

121 Kgs Gold Ornaments: తిరుమల శ్రీవారికి రూ.206 కోట్ల బంగారు కానుక.. 46 రకాల ప్రత్యేక ఆభరణాలు.. సాలిగ్రామ హారాలు, కిరీటం, వజ్రాలు, పూర్తి వివరాలు!

భూ వివాదంలో పోలీసు రక్షణ ఉత్తర్వుల ఉల్లంఘన.. అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం:

ఈ కేసు వివరాలను పరిశీలిస్తే.. గతంలో ఓ భూ వివాదానికి సంబంధించి పిటిషనర్‌కు తగిన పోలీసు రక్షణ కల్పించాలని హైకోర్టు సంబంధిత అధికారులను ఆదేశించింది. అయితే న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలను పోలీసులు క్షేత్రస్థాయిలో అమలు చేయలేదని, తమకు రక్షణ కల్పించలేదని ఆరోపిస్తూ బాధితుడు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం, పోలీసు ఉన్నతాధికారుల వ్యవహార శైలిని తీవ్రంగా తప్పుబట్టింది. కోర్టు ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం చేసినట్లుగా భావించి ఇద్దరు అధికారులకు జైలు శిక్ష విధిస్తున్నట్లు తీర్పు చెప్పింది. అంతేకాకుండా విధించిన జరిమానాను చెల్లించని పక్షంలో అదనంగా మరో వారం రోజుల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది.

అప్పీల్ చేసుకునేందుకు వారం గడువు.. లొంగిపోవాలని స్పష్టమైన ఆదేశాలు:

అయితే ఈ తీర్పుపై పైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు ఇద్దరు అధికారులకు అవకాశం కల్పిస్తూ, జైలు శిక్ష అమలును వారం రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. ఈ వారం రోజుల గడువులోగా పైకోర్టు నుంచి తగిన స్టే ఉత్తర్వులు తీసుకురావాలని సూచించింది. ఒకవేళ అలాంటి స్టే ఉత్తర్వులు పొందలేని పక్షంలో గడువు ముగిసిన వెంటనే హైకోర్టు రిజిస్ట్రార్ ఎదుట లొంగిపోయి జైలు శిక్షను అనుభవించాలని ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయడంలో ఉన్నత స్థాయి పోలీసు అధికారులు కూడా పూర్తి బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిందేనని ఈ తీర్పు మరోసారి స్పష్టం చేసింది.