Hyderabad Traffic: హైదరాబాద్‌లో ‘ట్రాఫిక్ రద్దీ ఛార్జీలు’.. ఇకపై కారులో ఒక్కరే వెళ్తే ఫైన్?.. ఐటీ కారిడార్‌లోనే తొలి అడుగు
హైదరాబాద్‌లో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్(Hyderabad Traffic) రద్దీని నియంత్రించేందుకు ఐటీ కారిడార్ సహా రద్దీగా ఉండే రహదారులపై 'కంజెషన్ ఛార్జీ' విధించాలని పరిశోధకులు కీలక సిఫార్సు చేశారు.
- V Santhosh Kumar
- Published on- November 24, 2026 / 11:29 AM IST
Telangana Government Proposes Traffic Congestion Charge to control traffic in Hyderabad
Hyderabad Traffic: విశ్వనగరంగా విస్తరిస్తున్న హైదరాబాద్‌లో వాహనాల రద్దీ రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. ముఖ్యంగా పీక్ అవర్స్‌లో రోడ్లపై అడుగు తీసి అడుగు వేయాలంటేనే వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి గ్రేటర్ పరిధిలో వాహనాల సంఖ్య కోటి దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో, ఈ ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని ఛేదించేందుకు ‘కంజెషన్ ఛార్జీ’ (Hyderabad Traffic) విధించాలని తాజా అధ్యయనం ఒకటి కీలక సిఫార్సు చేసింది. బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్, కార్డిఫ్ యూనివర్సిటీ, కింగ్ ఫహద్ యూనివర్సిటీ పరిశోధకులు సంయుక్తంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈ పరిశోధన చేపట్టారు. రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లో ఈ రుసుము వసూలు చేయడం వల్ల ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుందని, ఆ నిధులను ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతానికి వాడితే వాహనదారులు సైతం సానుకూలంగా స్పందిస్తారని 435 మంది కార్ల ప్రయాణికుల అభిప్రాయాల సేకరణ ద్వారా వెల్లడైంది.
ఐటీ కారిడార్‌లో పైలట్ ప్రాజెక్టు.. కారులో ఒక్కరే వెళ్తే ఫైన్?
నగరంలో అత్యధిక రద్దీ ఉండే హైదరాబాద్ ఐటీ కారిడార్‌ను ఈ విధానానికి పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకోవచ్చని రవాణా నిపుణులు సూచిస్తున్నారు. సైబరాబాద్ పోలీసుల గణాంకాల ప్రకారం, హైటెక్ సిటీలోని సైబర్ టవర్స్ మీదుగా గంటకు 10 వేలకు పైగా వాహనాలు వెళ్తుండగా, అందులో సుమారు 6,550 కార్లలో కేవలం డ్రైవర్ ఒక్కరే ప్రయాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో రద్దీ వేళల్లో ‘హై ఆక్యుపెన్సీ వెహికల్ (HOV)’ విధానాన్ని అమలు చేసి, కారులో ముగ్గురికంటే తక్కువ మంది ఉంటే అదనపు రుసుము లేదా ఆంక్షలు విధించాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) కెమెరాల సాయంతో నిబంధనల ఉల్లంఘనలను సులభంగా పర్యవేక్షించవచ్చని పేర్కొంటున్నారు.
రోడ్ల విస్తరణ మాత్రమే పరిష్కారం కాదు:
ట్రాఫిక్ జామ్‌లకు కేవలం వాహనాల సంఖ్య పెరగడమే కాకుండా, లోపభూయిష్టమైన రోడ్ల నిర్మాణం కూడా ప్రధాన కారణమని బిట్స్ పరిశోధకులు ప్రొఫెసర్ ప్రసాంత్ సాహు స్పష్టం చేశారు. రోడ్ల వెడల్పులో హెచ్చుతగ్గులు, ఇష్టారీతిన పార్కింగ్, బస్టాపుల వద్ద తోపులాట, సరైన డిజైన్ లేని జంక్షన్ల వల్లే ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోతోందని వివరించారు. అన్ని రోడ్లను విచ్చలవిడిగా విస్తరించే బదులు, తరచూ ట్రాఫిక్ ఆగిపోయే బ్లాక్ స్పాట్‌లను గుర్తించి గ్రేడ్ సెపరేటెడ్ జంక్షన్లు నిర్మించాలని అధ్యయనం సూచించింది.
విదేశీ నగరాల తరహాలో అమలుపై చర్చ:
ప్రపంచవ్యాప్తంగా ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు తొలిసారిగా సింగపూర్ ఈ కంజెషన్ ప్రైసింగ్ విధానాన్ని ప్రవేశపెట్టి సత్ఫలితాలు సాధించింది. ఆ తర్వాత లండన్, స్టాక్‌హోమ్, మిలాన్, ఓస్లో వంటి ప్రధాన నగరాలు కూడా ఇదే బాటలో నడిచాయి. కంజెషన్ ఛార్జీ ద్వారా సమకూరే ఆదాయంతో మరిన్ని సిటీ బస్సులు, మెట్రో ఫీడర్ సర్వీసులు, నాణ్యమైన ఫుట్‌పాత్‌లు ఏర్పాటు చేసి కాలుష్యాన్ని తగ్గిస్తేనే ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుందని పరిశోధకులు స్పష్టం చేశారు. అయితే, హైదరాబాద్‌లో ఈ విధానం అమలుపై తెలంగాణ ప్రభుత్వం ఇంకా ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదు.
