Telangana Govt : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. రేషన్ కార్డు ఉన్న మహిళలకు శుభవార్త.. కోటి మందికి కానుక..
Telangana Govt : తెలంగాణలోని సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో రేషన్ కార్డు కలిగిన మహిళలకు శుభవార్త చెప్పింది.
- Harish Thanniru
- Updated on- November 25, 2026 / 09:07 AM IST
CM Revanth Reddy Indiramma Sarees Distribution
Telangana Govt Indiramma Sarees Distribution : తెలంగాణలోని మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పండుగ కానుక అందించేందుకు సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ నెల 26న నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.
Also Read : Rice Price : పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు భారీ శుభవార్త.. దిగొచ్చిన బియ్యం ధరలు.. కారణాలివే..!
ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం రెండోసారి మహిళలకు చీరలను కానుకగా అందిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన నేత కార్మికులతో ప్రత్యేకంగా చీరలను తయారు చేయించింది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 65 లక్షల మంది మహిళలకు, పట్టణ ప్రాంతాల్లో 35 లక్షల మంది మహిళలకు ఈ చీరలను పంపిణీ చేయనున్నారు. మహిళల అభిరుచులకు అనుగుణంగా ఆకర్షణీయమైన చిలుకపచ్చ రంగులో చీరలను రూపొందించారు.
నాణ్యత, మన్నికకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చింది. ఆధునిక డిజైన్లతో పాటు సంప్రదాయ పద్ధతిలోనూ ధరించేందుకు వీలుగా చీరలను సిద్ధం చేశారు. మహిళలకు అందించే ఇందిరమ్మ చీరలను రెండు రకాలుగా తయారు చేయించారు. పాలిస్టర్ చీరలు (6.30 మీటర్ల పొడవుతో 35 లక్షల చీరలు), పాలీకాటన్ చీరలు (9 మీటర్ల పొడవుతో 5 లక్షల చీరలు) ప్రత్యేక డిజైన్లతో చేయించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన నేత కార్మికులకు ఈ చీరల తయారీ బాధ్యతలు అప్పగించారు. తద్వారా మహిళలకు చీరలు అందించడంతో పాటు నేత కార్మికులకు కూడా ప్రభుత్వం ఉపాధి కల్పిస్తుంది.
రేషన్ కార్డు ఉన్న కుటుంబాల్లో 18 ఏళ్లు నిండిన మహిళలందరూ ఇందిరమ్మ చీరలు పొందేందుకు అర్హులని ప్రభుత్వం వెల్లడించింది. అర్హులైన మహిళలు తమ ఆహార భద్రత కార్డు, ఆధార్ వివరాలను చూపించి చీరలను తీసుకోవచ్చు. మొత్తంగా కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేస్తోంది.
చీరల పంపిణీ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. జిల్లా కలెక్టర్లు, జిల్లా ఇన్ఛార్జి మంత్రుల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ కార్యక్రమం కొనసాగనుంది. గ్రామాలు, పట్టణాల్లో వార్డుల వారీగా ప్రజాప్రతినిధుల సమక్షంలో సెర్ప్ సిబ్బంది చీరలను అందజేయనున్నారు. అదేవిధంగా అర్హులైన లబ్ధిదారుల వివరాలను ప్రత్యేక మొబైల్ యాప్లో నమోదు చేయనున్నారు. దీనివల్ల చీరలు ఎవరికి అందాయనే వివరాలను నమోదు చేసి, పంపిణీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేలా ప్రభఉత్వం చర్యలు చేపట్టింది.
