Telangana Congress : రాజగోపాల్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డి సెట్ అయినట్లేనా.? కొత్త ఇంచార్జ్ సందీప్‌తో భేటీలో ఏం జరిగింది.. కాంగ్రెస్‌లో ఆసక్తికర చర్చ
Telangana Congress : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ బీఎం.సందీప్‌తో ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్‌రెడ్డి భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది.
- Harish Thanniru
- Published on- November 25, 2026 / 01:14 PM IST
MLA Rajagopal Reddy and Anirudh Reddy Meets Telangana Congress Incharge Sandeep
Telangana Congress : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ బీఎం.సందీప్‌తో..ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్‌రెడ్డి భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్‌లోనే వివాదాస్పద ఎమ్మెల్యేలుగా ముద్రపడిన ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ఈ మధ్య చేసిన కామెంట్స్ పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన కిందికి వస్తాయని రేవంత్ వర్గం నేతలు వాయిస్ రేజ్ చేస్తూ వచ్చారు. వీరిద్దరిపై కొత్త ఇంచార్జ్ వచ్చిన సందీప్‌కు ఫిర్యాదు చేస్తామంటూ నేతలు బహిరంగంగా స్టేట్మెంట్స్ ఇచ్చారు.
సీఎం రేవంత్ రెడ్డి కూడా సిద్దిపేట సభలో ఇండైరెక్ట్ కామెంట్స్ చేయడంతో పాటు.. కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో కూడా రెస్పాండ్ అయ్యారు. పార్టీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లురవి కూడా.. రాజగోపాల్ రెడ్డి, అనిరుద్ రెడ్డి లక్ష్మణ రేఖ దాటారని కచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ చెప్పుకొచ్చారు. ఇదంతా చూసిన క్యాడర్ లీడర్లు కొత్త ఇంచార్జ్ ఆ ఇద్దరు ఎమ్మెల్యేలపై వేటు వేయడం ఖాయమంటూ జోరుగా చర్చ జరిగింది. సీన్ కట్ చేస్తే ఇద్దరి ఎమ్మెల్యేలు కొత్త ఇంచార్జ్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
మొదటగా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి భేటీ అయ్యారు. దాదాపు గంట సేపు ఇద్దరు వన్ టు వన్ డిస్కషన్ జరిగిందట. ఈ సందర్భంగా అనిరుధ్‌రెడ్డిపై వచ్చిన ఆరోపణలపై ఇంచార్జ్ సందీప్ ఆరా తీశారట. తాను ఎక్కడ కూడా పార్టీ లైన్ దాటి కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ మాట్లాడలేదంటూ వివరణ ఇచ్చుకున్నారట ఎమ్మెల్యే అనిరుద్. మొదటి నుంచి తాను మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోలు ఆధారాలన్నిటిని సందీప్ ముందు పెట్టారట. టీటీడీ లెటర్లతో మొదలుకొని పవన్ కల్యాణ్ ఎపిసోడ్.. ఏపీ బనకచర్ల ప్రాజెక్టు వరకు ప్రతిచోట తాను పార్టీ వాయిస్‌నే వినిపించానే తప్ప ఎక్కడా పార్టీని డిఫెన్స్‌లో పడేసేలా వ్యవహరించలేదంటూ వివరించారట.
ఆమరణ నిరాహార దీక్ష చేస్తానన్న స్టేట్మెంట్పై కూడా క్లారిటీ ఇచ్చారట అనిరుధ్‌రెడ్డి. చేసిన పనులకు బిల్లులు రావట్లేదంటూ కాంగ్రెస్ కార్యకర్తలే అడుగుతున్నారని..ఇదే విషయంపై డిప్యూటీ సీఎంకు ఏడాదిన్నర నుంచి విజప్తులు సమర్పిస్తున్నా స్పందించట్లేదని..అందుకే అలా మాట్లాడాల్సి వచ్చిందని వివరణ ఇచ్చుకున్నారట. పైగా తన నియోజకవర్గం జడ్చర్లకు సీఎం రేవంత్ రెడ్డి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని..ఉదండాపూర్ రిజర్వాయర్ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి అడగ్గానే నిధులు పెంచి ఇచ్చారని గుర్తు చేశారట. ఆఖరికి జడ్చర్లలో నిర్వహించిన దసరా వేడుకలకు కూడా అడగ్గానే సీఎం వచ్చి అటెండ్ అయ్యారని చెప్పారట. సీఎంతో కానీ, పార్టీతో కానీ తనకు ఎలాంటి విభేదాలు లేవని, మనస్పర్ధలు లేవని స్పష్టం చేశారట.
అనిరుధ్‌రెడ్డి చెప్పిన వివరాన్నింటిని విన్న ఇంచార్జ్.. సమస్యలన్నీ సీఎం దృష్టికి తీసుకెళ్లి త్వరలో పరిష్కారం అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారట. కానీ, ఇక నుంచి ఏ సమస్య ఉన్నా.. తన దృష్టికి తేవడమో, పీసీసీ చీఫ్‌కు చెప్పడమో చేయాలని, ఎక్కడా మైకుల ముందు మాట్లాడొద్దంటూ కండీషన్ పెట్టారట.
అనిరుధ్‌రెడ్డి తర్వాత.. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంచార్జ్ సందీప్‌తో సమావేశమయ్యారు. రాజగోపాల్ రెడ్డి ఈ మధ్యకాలంలో నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా చంద్రబాబు మనుషులదే పెత్తనం అంటూ వివాదాస్పద కామెంట్స్ చేశారు. ప్రభుత్వ పెద్దలు పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తున్నారంటూ స్టేట్మెంట్స్ ఇచ్చారు. రాజగోపాల్ రెడ్డి చేస్తున్న ఈ వ్యాఖ్యలపై ఇంచార్జ్ సందీప్ వివరణ కోరారట. తన నియోజకవర్గం మునుగోడు అభివృద్ధికి నిధులు అడిగితే..సీఎం రేవంత్ రెడ్డి పండబెట్టి తొక్కుతానంటూ మాట్లాడి తనను మరింత రెచ్చగొట్టారని చెప్పారట. అందుకే తాను కూడా కాస్త గట్టిగానే మాట్లాడాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారట రాజగోపాల్‌రెడ్డి. మూడేళ్లుగా ప్రభుత్వానికి అండగా ఉంటూనే.. ప్రతిపక్షాలను ఎండగడుతున్నానని అయినా సీఎం నుంచి సహకారం అందడం లేదని ఫిర్యాదు చేశారట.
ఈ మధ్యకాలంలో నకిరేకల్‌లో సభ నిర్వహిస్తే..సీఎంతో కలిసి వేదిక కూడా పంచుకున్నట్లు చెప్పారట. సీఎం మాత్రం తన విషయంలో వివక్ష చూపిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారట. రోడ్ల టెండర్ విషయంలో తన కంపెనీ వేసిన బిడ్లను కావాలనే క్యాన్సల్ చేశారని ఇంచార్జ్ దృష్టికి తీసుకెళ్లారట రాజగోపాల్‌రెడ్డి. ఆఖరికి తనకు పార్టీ అధిష్టానం హామీ ఇచ్చిన మంత్రి పదవి అంశాన్ని ఇంచార్జ్ సందీప్ ముందు ప్రస్తావించారట. రాజగోపాల్ రెడ్డి చెప్పిన అన్ని అంశాలను విన్న తర్వాత..త్వరలో సమస్యలన్నీ సర్దుకుంటాయని హామీ ఇచ్చారట కొత్త ఇంచార్జ్ సందీప్. కానీ ఎక్కడా కూడా బహిరంగంగా పార్టీని కానీ ప్రభుత్వాన్ని కానీ ఇబ్బంది పెట్టేలా మాట్లాడొద్దని కండీషన్ పెట్టారట.
ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకొస్తే పార్టీ ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారట. కొత్త ఇంచార్జ్ ఇచ్చిన భరోసాతో రాజగోపాల్ రెడ్డి కూడా ఆయన పెట్టిన కండీషన్‌కు ఓకే చెప్పారట. కొత్త ఇంచార్జ్ హామీతో పాటు..కండీషన్‌తో అయినా..ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు మైకుల ముందు మాట్లాడటం ఆపేస్తారో.? లేక షరామాములేనా అనేది వేచి చూడాలి.
