KTR: తెలంగాణ కథలో కేసీఆర్ హీరో .. విలన్ కాంగ్రెస్.. దీక్షా దివస్ సభలో కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు!
అలుగునూరు దీక్షా దివస్ సభలో కేసీఆర్ మొండి పట్టుదలతోనే తెలంగాణ సాధన సాధ్యమైందని కేటీఆర్ (KTR)అన్నారు.
- V Santhosh Kumar
- Published on- November 29, 2026 / 08:41 PM IST
Ktr deeksha divas speech alugunoor kcr fasting telangana statehood kaleshwaram palamuru congress bjp
KTR: తెలంగాణ జాతికి కొత్త ఊపిరిని అందించిన రోజు దీక్షా దివస్ అని, పార్టీ స్థాపించిన 14 ఏళ్లలోనే కేసీఆర్ తన లక్ష్యాన్ని చేరుకున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR)అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరు చౌరస్తా వద్ద నిర్వహించిన ‘దీక్షా దివస్’ స్ఫూర్తి బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ, నాడు కేసీఆర్ దీక్షకు బయలుదేరినప్పుడు పోలీసుల వెంబడింపు, అలుగునూరు వద్ద కారును అడ్డుకున్న ఘటనను గుర్తు చేసుకున్నారు. ఆ 11 రోజుల దీక్ష ఒక ప్రభంజనంగా మారిందని, రాష్ట్రం అగ్నిగుండంగా, యూనివర్సిటీలు యుద్ధ భూములుగా మారాయని పేర్కొన్నారు. కేసీఆర్ అరెస్టు వార్తతో శ్రీకాంత్ చారి పెట్రోల్ పోసుకున్న విషయాన్ని ప్రస్తావిస్తూ, వైద్యులు బ్రెయిన్‌డెడ్ అవుతారని హెచ్చరించినా మొండి పట్టుదలతో దీక్ష కొనసాగించడంతోనే కేంద్రం దిగివచ్చిందని స్పష్టం చేశారు.
60 ఏళ్ల పోరాటం.. 32 పార్టీల మద్దతు:
తెలంగాణ రాష్ట్ర సాధన ఎవరి భిక్ష కాదని, యాచించి కాకుండా శాసించి తెచ్చుకున్నామని కేటీఆర్ ఉద్ఘాటించారు. 1956లో ఉన్న తెలంగాణను ఏపీతో కలిపింది కాంగ్రెస్ పార్టీయేనని విమర్శిస్తూ, ప్రత్యేక రాష్ట్రం కోసం 60 ఏళ్లు పట్టిందని అన్నారు. దేశవ్యాప్తంగా 32 పార్టీలను ఒప్పించి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చిన ఘనత కేసీఆర్‌దేనని, కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీ నేతల వల్లే తెలంగాణ ఆలస్యమైందని ఆరోపించారు.
పద్మవ్యూహ ఛేదన.. కాళేశ్వరం, పాలమూరుపై ఆగ్రహం:
తెలంగాణ సాధన ఒక పద్మవ్యూహమని, అర్జునుడు, కృష్ణుడి తరహాలో దాన్ని ఛేదించి రథం నడిపి, రణం చేసింది కేసీఆర్ అని కేటీఆర్ కొనియాడారు. గులాబీ జెండా ఎగరకపోతే తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ, ముఖ్యమంత్రి ఉండేవారు కాదని వ్యాఖ్యానిస్తూ, తెలంగాణ కథలో హీరో కేసీఆర్ అయితే విలన్ కాంగ్రెస్ అని విమర్శించారు. జీవనాడి అయిన కాళేశ్వరం ప్రాజెక్టుపై దాడి జరుగుతోందని, కేసీఆర్‌పై కోపంతో పాలకులు కాళేశ్వరంపై కక్ష గట్టి, పాలమూరుపై పగబట్టారని మండిపడ్డారు.
యువత, ఉద్యోగులతో పేగుబంధం.. ఢిల్లీ బానిసత్వంపై ప్రశ్న:
రాష్ట్రం ద్రోహుల చేతుల్లో పడి మళ్లీ ఆగం అవుతోందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ యువత రాహుల్ గాంధీని నిలదీసి కాంగ్రెస్‌ను గద్దె దించే సమయం వచ్చిందని చెబుతూ, ఉద్యోగులు, విద్యార్థులతో బీఆర్ఎస్కు పేగుబంధం ఉందని అన్నారు. నీళ్లు ఆంధ్రాకు, నిధులు ఢిల్లీకి, నియామకాలు గాలికి పోతున్నాయని ఆరోపించిన ఆయన, మోదీ తెలంగాణకు కూడా ప్రధాని కాదా అని నిలదీశారు; ఢిల్లీకి గులాంలుగా ఉండాలా లేక గులాబీలను పంపాలో ప్రజలు ఆలోచించాలని పిలుపునిచ్చారు.
