WBBL : క్రికెట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని ఔట్.. ఇదేం రూల్ సామీ.. బ్యాటర్‌ను పక్కన నిలబెట్టి ఖాళీ వికెట్లపైకి బౌలింగ్..
WBBL : మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో క్రికెట్ చరిత్రలో కనీవినీ ఎరుగని ఔట్ చోటు చేసుకుంది.
- Thota Vamshi Kumar
- Updated on- November 25, 2026 / 07:13 PM IST
WBBL Deandra Dottin loses her wicket before facing a ball in bizarre Free Ball twist
WBBL : మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో క్రికెట్ చరిత్రలో కనీవినీ ఎరుగని ఔట్ చోటు చేసుకుంది. బుధవారం బ్రిస్బేన్ హీట్, మెల్‌బోర్న్ రెనెగేడ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది. మెల్‌బోర్న్ రెనెగేడ్స్ ఆల్‌రౌండర్ డియాండ్రా డాటిన్ విచిత్ర పరిస్థితుల్లో ఔట్ అయింది.
డబ్ల్యూబీబీఎల్, బీబీఎల్ టోర్నీల్లో ఆట ఆలస్యాన్ని తగ్గించేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా 2021-22 సీజన్ నుంచి ఓ ప్రత్యేక నిబంధనను ప్రవేశపెట్టింది. కొత్త బ్యాటర్ 75 సెకన్లలోపు క్రీజులోకి వచ్చి బంతిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది. ఆ సమయంలోగా కొత్త బ్యాటర్ క్రీజులోకి రాకపోతే.. సదరు బ్యాటర్‌ను పక్కన నిలబెడుతారు. ఆ తరువాత ఖాళీ వికెట్లపైకి బౌలర్ బంతిని వేస్తారు. బంతి వికెట్లను తాకినట్లయితే బ్యాటర్ ఔట్ అవుతారు. లేకపోతే బ్యాటర్ తన ఇన్నింగ్స్‌ను కొనసాగించవచ్చు.
కాగా.. ఇప్పటి వరకు పురుషుల, మహిళల బిగ్‌బాష్ పోటీల్లో ఈ నిబంధనను అమలు చేయాల్సిన పరిస్థితి రాలేదు. డాటిన్ ఘటనతో తొలిసారిగా ఈ రూల్‌ను అమలు చేశారు. ఇలా ఔటైన తొలి ప్లేయర్‌గా డాటిన్ నిలిచింది.
అసలేం జరిగిందంటే?
మెల్‌బోర్న్ రెనెగేడ్స్ జట్టు 138 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తోంది. 15వ ఓవర్ తొలి బంతికి జార్జియా వేర్‌హామ్ ఔట్ అయింది. ఈ ఓవర్‌లో రెండో బంతి ఆడేందుకు ఏడో నంబర్‌లో డాటిన్ ను బ్యాటింగ్‌కు పంపించారు. అయితే.. ఆమె క్రీజులోకి రావడానికి ఆలస్యమైంది. హెల్మెట్ సర్దుకోవడం, బ్యాటింగ్‌కు సిద్ధం కావడం వంటి పనుల్లో సమయం తీసుకుంది. అంతేకాకుండా బ్యాటింగ్ గ్లౌజులు, ఇన్నర్ గ్లౌజులు కూడా ధరించలేదు.
దీంతో నిర్ణీత 75 సెకన్ల సమయం దాటిపోయిందని అంపైర్లు గుర్తించారు. దీంతో డాటిన్‌ను పిచ్‌కు కనీసం ఐదు మీటర్ల దూరంలో లెగ్‌సైడ్‌లో నిలబడాలని సూచించారు. బౌలర్ సారా గ్లెన్‌కు వికెట్లపై బంతి వేసే అవకాశం లభించింది. ఆమె వేసిన బంతి నేరుగా వికెట్లను తాకడంతో డాటిన్ ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే పెవిలియన్‌కు చేరింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా.. 2023 వన్డే ప్రపంచకప్‌లో శ్రీలంక ఆటగాడు ఏంజెలో మాథ్యూస్ ఎదుర్కొన్న టైమ్డ్ ఔట్ ఘటనను ఈ సంఘటన గుర్తు చేసింది. అయితే ఈ రెండు ఔట్ల మధ్య చాలా తేడా ఉంది. సాధారణ టైమ్డ్ ఔట్‌లో బ్యాటర్‌పై అప్పీల్ ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు. కానీ డబ్ల్యూబీబీఎల్ నిబంధనలో ఆలస్యమైన బ్యాటర్‌ను పక్కన నిలబెట్టి ఖాళీ వికెట్లపై బంతి వేస్తారు. వికెట్లను బంతి తాకితే సదరు బ్యాటర్ ఔట్ తాకకపోతే సదరు బ్యాటర్ తన ఇన్నింగ్స్‌ను కొనసాగించవచ్చు.
