India vs New Zealand : న్యూజిలాండ్‌తో తొలి టెస్టు డ్రా.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కీలక కామెంట్స్.. ఏమాత్రం సహకరించలేదు..!

India vs New Zealand : న్యూజిలాండ్ జట్టుతో జరిగిన తొలి టెస్టు డ్రా అవ్వడంపై భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కీలక కామెంట్స్ చేశాడు.

shubman gill

India vs New Zealand : ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు మ్యాచ్ వెల్లింగ్టన్ వేదికగా జరిగింది. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. అయితే, మ్యాచ్ డ్రాగా ముగియడంపై భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కీలక కామెంట్స్ చేశాడు.

Also Read : NZ vs IND 1st Test : చేతిలోకి వచ్చిన విజయం చేజారింది.. భారత్ ఆశలపై నీళ్లు చల్లిన న్యూజిలాండ్ బ్యాటర్లు

పిచ్‌పై బౌలర్లకు ఆశించిన స్థాయిలో సహకారం లభించలేదని గిల్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అయితే, ఈ పిచ్‍పై పది వికెట్లు తీయడం సవాలుతో కూడుకున్న విషయమని మాకు ముందే తెలుసు. అయినప్పటికీ, వికెట్లు తీసేందుకు కొన్ని అవకాశాలు లభించాయి. అక్కడక్కడా కొన్ని చాన్స్ లు వచ్చాయి. ముఖ్యంగా చివరి బ్యాటర్ల విషయంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. మొత్తంగా చూస్తే మైదానంలో మా ప్రదర్శన బాగుందని గిల్ అన్నారు. ప్రత్యర్థి దేశంలో పర్యటిస్తూ ఆ జట్టుపై పైచేయి సాధించడం అంత సులభమైన విషయం కాదు. అయినప్పటికీ, అన్ని విభాగాల్లోనూ వారికి గట్టి పోటీ ఇచ్చాం. ఇదే మాకు ముఖ్యమైన విషయమని గిల్ చెప్పుకొచ్చారు.

తొలి ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌లోనూ మేం బాగానే రాణించాం. ఆ తర్వాత బ్యాటింగ్‌లో ప్రతిఒక్కరూ తమ వంతు సహకారం అందించారు. ఇద్దరు బ్యాటర్లు మాత్రమే సెంచరీలు చేసినప్పటికీ.. మా జట్టు దాదాపు 700 పరుగులు సాధించింది. ఇది చాలా పెద్ద స్కోరు. మొత్తంగా మా ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నామని గిల్ చెప్పారు.

రెండో టెస్టు మ్యాచ్ క్రైస్ట్‌చర్చ్‌లో జరగబోతుంది. అయితే, అక్కడ జరిగే మ్యాచ్ కోసం మేము మెరుగుపర్చుకోవాల్సిన అంశాలేవీ లేవని భావిస్తున్నా. క్రైస్ట్‌చర్చ్‌ పిచ్ పై బౌలర్లకు మరింత సహకారం లభిస్తుందని ఆశిస్తున్నామని గిల్ అన్నాడు. అక్కడ కూడా ఇదే తరహా ఆటతీరును కొనసాగిస్తూ.. బౌలింగ్, బ్యాటింగ్ లో మా ప్రణాళికలను నిలకడగా అమలు చేయగలిగితే మంచి ఫలితాలు సాధించగమని నమ్ముతున్నామని గిల్ చెప్పాడు.

మ్యాచ్‌ను ముందుగా ముగించడానికి కారణమిదే..!
పిచ్‌పై బౌలర్లకు మరికొంత సహకారం లభించి ఉంటే మ్యాచ్‌ను కొనసాగించే అవకాశం ఉండేది. కానీ, మా ఫాస్ట్ బౌలర్లు అప్పటికే బాగా అలసిపోయారు. మ్యాచ్‌లో వారంతా దాదాపు 50 ఓవర్ల పాటు బౌలింగ్ చేశారు. అంతేకాకుండా మరో మూడు రోజుల్లోనే తదుపరి మ్యాచ్ ఉంది. రేపు ప్రయాణం కూడా చేయాల్సి ఉంది. అందుకే మా బౌలర్లందరినీ తాజాగా, పూర్తి ఫిట్‌నెస్‌తో ఉంచాలని నిర్ణయించుకున్నాం. మరో ఐదు లేదా పది ఓవర్లు ఆడటం వల్ల పెద్దగా ప్రయోజనం ఉంటుందని మాకు అనిపించలేదు. అందుకే మ్యాచ్‌ను డ్రాగా ముందుగానే ముగించామని గిల్ చెప్పాడు.