IND vs NZ 2nd Test : రెండో టెస్టుకు ముందు భారత బ్యాటర్లకు కివీస్ పేసర్ మాట్ హెన్రీ హెచ్చరిక..! ఏమన్నాడంటే?
IND vs NZ 2nd Test : భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే తొలి టెస్టు మ్యాచ్ డ్రా అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు రెండో టెస్టు పోరుకు రంగం సిద్ధమైంది.
- Harish Thanniru
- Updated on- November 25, 2026 / 12:21 PM IST
IND vs NZ 2nd Test
IND vs NZ 2nd Test : భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే తొలి టెస్టు మ్యాచ్ డ్రా అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు రెండో టెస్టు పోరుకు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్ మైదానంలో మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో న్యూజిలాండ్ సీనియర్ ఫాస్ట్ బౌలర్ మాట్ హెన్రీ పిచ్ పరిస్థితులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పిచ్ ఎలా ఉంటుందో ముందుగానే అంచనా వేస్తూ ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదని, పరిస్థితులకు అనుగుణంగా సిద్ధం కావడమే తమ లక్ష్యమని స్పష్టం చేశాడు.
Also Read : Vaibhav Sooryavanshi : డబుల్ సెంచరీ తరువాత.. వైభవ్ సూర్యవంశీ చెప్పిన మాటలివే.. అనుకున్నదొకటి.. అయిందొకటి..!
క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్ మైదానం సాధారణంగా ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుందని పేరుంది. అయితే, గతంలో ఇక్కడ జరిగిన మ్యాచ్‌లను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత పిచ్‌పై ముందుగానే అంచనాలకు రావడం సరికాదని మాట్ హెన్రీ అభిప్రాయపడ్డాడు. ప్రతి మ్యాచ్‌లో పిచ్ పరిస్థితులు భిన్నంగా ఉంటాయని, ఇటీవల ఈ మైదానంలో భారీ స్కోర్లు నమోదయ్యాయని గుర్తుచేశాడు. పిచ్‌పై గడ్డి ఉందని లేదంటే గతంలో బౌలర్లకు అనుకూలించిందని భావించి ముందుగానే ఒక నిర్ణయానికి రాకూడదని తెలిపాడు. పరిస్థితులను బట్టి తమ వ్యూహాలను మార్చుకుంటామని పేర్కొన్నాడు.
హాగ్లీ ఓవల్ మైదానంలో సాధారణంగా గడ్డి ఉండే పిచ్‌లు మ్యాచ్ ప్రారంభంలో ఫాస్ట్ బౌలర్లకు సహకరిస్తాయని హెన్రీ చెప్పాడు. అయితే, మ్యాచ్ ముందుకు సాగుతున్న కొద్దీ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారే అవకాశాలు ఉంటాయని వివరించాడు. పిచ్‌పై బౌన్స్, క్యారీ లభిస్తే బౌలర్లకు ప్రయోజనం ఉంటుందని, అదే సమయంలో బ్యాటర్లు కూడా వేగంగా పరుగులు సాధించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నాడు. బ్యాటర్లు కొన్ని సమయాల్లో తమ డిఫెన్స్‌పై నమ్మకం ఉంచాలని సూచించాడు. ఆ కష్టమైన దశను దాటితే బౌలర్లపై ఒత్తిడి పెంచవచ్చని అభిప్రాయపడ్డాడు.
భారత్, న్యూజిలాండ్ మధ్య వెల్లింగ్టన్‌లో జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో భారత్ తన తొలి ఇన్నింగ్స్‌ను 720/9 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అయితే న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్లు కోల్పోకుండా పోరాడటంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఐదు రోజుల ఆటలో ఇరు జట్లు కలిపి కేవలం 24 వికెట్లు మాత్రమే కోల్పోవడం పిచ్ బ్యాటింగ్‌కు ఎంతగా అనుకూలించిందో తెలియజేస్తోంది.
