IND vs NZ : రెండో టెస్టులో పట్టు బిగించిన న్యూజిలాండ్.. ముగిసిన మూడో రోజు ఆట.. కివీస్ 243 పరుగుల ఆధిక్యం..
IND vs NZ 2nd Test : క్రైస్ట్‌చర్చ్ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో న్యూజిలాండ్ పట్టుబిగించింది
- Thota Vamshi Kumar
- Updated on- November 29, 2026 / 11:16 AM IST
IND vs NZ 2nd Test Day 3 Stumps New Zealand lead by 243 runs
IND vs NZ 2nd Test : క్రైస్ట్‌చర్చ్ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో న్యూజిలాండ్ పట్టుబిగించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు కోల్పోయి 133 పరుగులు సాధించింది. ప్రస్తుతం కివీస్ ఆధిక్యం 243 పరుగులకు చేరింది. క్రీజులో డారిల్ మిచెల్ (5), రచిన్ రవీంద్ర (46)లు ఉన్నారు.
110 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన న్యూజిలాండ్‌కు జస్ప్రీత్ బుమ్రా షాకిచ్చాడు. 8 పరుగులు చేసిన టామ్ లాథమ్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో కివీస్ 22 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. కొద్దిసేపటికే వన్‌డౌన్ బ్యాటర్ హెన్రీ నికోల్స్ (22) ను సైతం బుమ్రానే పెవిలియన్‌కు చేర్చాడు.
అయితే.. మరో ఓపెనర్ డేవాన్ కాన్వే (51) భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అర్థశతకం తరువాత అతడు వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో యశస్వి జైస్వాల్ క్యాచ్ అందుకోవడంతో పెవిలియన్‌కు చేరుకున్నాడు. కాగా.. రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్‌లు మరో వికెట్ పడకుండా మూడో రోజును ముగించారు.
130 రన్స్.. 4 వికెట్లు
అంతకముందు తొలి ఇన్నింగ్స్‌లో ఓవర్ నైట్ స్కోరు 116/6తో భారత జట్టు మూడో రోజు ఆటను ప్రారంభించింది. మరో 130 పరుగులు జోడించి మిగిలిన నాలుగు వికెట్లను కోల్పోయింది. ధ్రువ్ జురెల్ (88; 170 బంతుల్లో 14 ఫోర్లు) అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా అతడు మాత్రం పట్టుదలతో బ్యాటింగ్ చేశాడు.
క్రీజులో పాతుకుపోయి న్యూజిలాండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటున్నాడు. ఆకాశ్ దీప్ (29; 52 బంతుల్లో 4 ఫోర్లు) సాయంతో జట్టును ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కించాడు. ఆఖరి వికెట్‌గా అతడు పెవిలియన్‌కు చేరుకోవడంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో న్యూజిలాండ్‌కు 110 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.
