KL Rahul : కివీస్ గ‌డ్డ‌పై తొలి సెంచ‌రీ.. కేఎల్ రాహుల్ కీల‌క వ్యాఖ్య‌లు.. నా బ్యాటింగ్‌లో..

న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో సెంచ‌రీ త‌రువాత కేఎల్ రాహుల్ (KL Rahul ) మాట్లాడుతూ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు.

IND vs NZ 1st Test KL Rahul key comments After Historic Wellington Ton

KL Rahul : త‌న బ్యాటింగ్ టెక్నిక్‌లో ఎలాంటి లోపం లేదని, ప్రతి బంతినీ ఆడాలనే అలవాటును మార్చుకుని, పరిస్థితులకు తగ్గట్టుగా ఆడ‌డం వ‌ల్లే ఇటీవల మెరుగైన ఫలితాలు సాధిస్తున్నానని టీమ్ఇండియా సీనియ‌ర్ ఆట‌గాడు కేఎల్ రాహుల్ తెలిపాడు. వెల్లింగ్ట‌న్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టు మొద‌టి ఇన్నింగ్స్‌లో రాహుల్ అద్భుతంగా ఆడాడు. మొత్తం 290 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు, 2 సిక్స‌ర్ల సాయంతో 136 ప‌రుగులు చేశాడు. టెస్టుల్లో రాహుల్‌కు ఇది 13వ సెంచ‌రీ.

ఈ క్రమంలో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా (సెనా) దేశాల్లో టెస్టు శతకాలు సాధించిన భారత బ్యాటర్ల జాబితాలో చోటు సంపాదించాడు. ఈ సంద‌ర్భంగా అత‌డు మాట్లాడుతూ.. సెనా దేశాలన్నింటిలోనూ టెస్టు శతకాలు సాధించడం ఎంతో సంతోషాన్నిచ్చిందన్నాడు. మిడిలార్డర్‌లో 15 నెలల పాటు ఆడిన సమయంలో ప్రతి బంతినీ బ్యాట్‌తో ఆడే అలవాటు ఏర్పడిందన్నాడు. ఇక బంతి స్వింగ్ అయ్యే పరిస్థితుల్లో వీలైనంత తక్కువగా బ్యాట్‌ను బంతికి తాకించడం కూడా ముఖ్యమని చెప్పుకొచ్చాడు.

న్యూజిలాండ్ పరిస్థితులకు అనుగుణంగా సరైన గార్డ్, బ్యాటింగ్ పొజిషన్‌ను ఎంచుకోవడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు తెలిపాడు. ఇక్కడికి వచ్చిన త‌రువాత మూడు వారాల పాటు నెట్స్‌లో కఠినంగా సాధన చేశానని అన్నాడు. ఇండియా-ఏ తరఫున ఎక్కువ పరుగులు చేయలేక‌పోయాన‌ని, అయిన‌ప్ప‌టికి కూడా త‌న బ్యాటింగ్‌పై స్పష్టమైన ప్రణాళికలు సిద్ధం చేసుకున్నానని అన్నాడు. కష్టానికి తగిన ఫలితం ప్రదర్శన రూపంలో కనిపిస్తుందని చెప్పాడు.

త‌న టెస్టు కెరీర్‌లో తొలిసారిగా న్యూజిలాండ్‌లో ఆడుతున్నాన‌ని చెప్పాడు. ఇక్క‌డ రాణించేందుకు గతంలో న్యూజిలాండ్‌లో పరుగులు సాధించిన ఆటగాళ్ల బ్యాటింగ్ వీడియోలను పరిశీలించినట్లు చెప్పాడు. నెట్స్‌లో ఎక్కువ బంతులు ఆడి, ఎలాంటి గార్డ్, పొజిషన్‌తో ఆడితే మెరుగైన ఫలితాలు వస్తాయో తెలుసుకున్నాన‌ని అన్నాడు.

వెల్లింగ్టన్ పిచ్‌పై బంతి కిందకు వస్తోందని, పిచ్‌పై గరుకైన ప్రాంతాలు ఏర్పడుతున్నాయని రాహుల్ తెలిపాడు. మ్యాచ్ సాగుతున్నా కొద్దీ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా మారే అవకాశం ఉందని చెప్పాడు.

యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌పై రాహుల్ ప్రశంసలు కురిపించాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 130 పరుగులు జోడించారు. న్యూజిలాండ్ గడ్డపై భారత జట్టు 32 ఏళ్ల తర్వాత తొలి వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. 1992లో నవజ్యోత్ సింగ్ సిద్ధూ, నయన్ మోంగియా చివరిసారిగా 102 పరుగులు జోడించారు. జైస్వాల్ ఎంతో కష్టపడే క్రికెటర్ అని, అతడి దూకుడైన బ్యాటింగ్ వెనుక నిరంతర సాధన ఉందని మెచ్చుకున్నాడు. మైదానం బయట తమ మధ్య మంచి అనుబంధం ఉందని, అది మైదానంలోనూ ప్రతిబింబిస్తోందని తెలిపాడు.