Ind A vs UAE : భారత్‌కు చావోరేవో.. యూఏఈతో కీలక మ్యాచ్ నేడే.. ఎక్కడ చూడొచ్చంటే?
Ind A vs UAE : ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026లో భాగంగా భారత్ ఏ జట్టు నేడు యూఏఈతో తలపడనుంది.
Asia Cup Rising Stars 2026 do or die situation for India A crucial match against the UAE today where can you watch it
Ind A vs UAE : ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026లో భాగంగా భారత్ ఏ జట్టు నేడు యూఏఈతో తలపడనుంది. ఈ మ్యాచ్ భారత జట్టుకు చావోరేవో లాంటిది. ఆదివారం పాక్ చేతిలో ఓడిపోవడంతో సెమీస్‌కు చేరుకోవాలంటే టీమ్ఇండియా ఈ మ్యాచ్‌లో ఖచ్చితంగా విజయం సాధించాల్సి ఉంటుంది.
ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ ఏ 48 పరుగుల తేడాతో పాకిస్థాన్ ఏ చేతిలో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో భారత బౌలింగ్ బలహీనతలు బయటపడ్డాయి. చివరి 11 ఓవర్లలో ఐదు వికెట్లు తీసినప్పటికీ.. పాకిస్థాన్ జట్టు 83 పరుగులు సాధించింది. దీంతో ప్రత్యర్థి స్కోరు 313 పరుగులకు చేరింది. చివరి ఓవర్లలో పరుగులను నియంత్రించలేకపోవడమే భారత్ ఓటమికి ప్రధాన కారణమైంది.
యూఏఈ జట్టుతో మ్యాచ్ కాగితంపై సులభంగా కనిపిస్తున్నప్పటికీ.. భారత్ ఏమాత్రం నిర్లక్ష్యం వహించకూడదు. ఎందుకంటే యూఏఈ ఇప్పటికే తమ సత్తా చాటింది. గతంలో పాకిస్థాన్ ఏ జట్టును 245 పరుగులకే పరిమితం చేసింది. ఈ మ్యాచ్‌లో యూఏఈ 184 పరుగులకే ఆలౌటైంది. అయినప్పటికీ ఆ జట్టు బౌలింగ్ సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయలేం.
నేపాల్‌పై భారత్ ప్రదర్శించిన దూకుడును మళ్లీ కొనసాగించాలని జట్టు భావిస్తోంది. ఆ మ్యాచ్‌లో భారత బౌలర్లు నేపాల్‌ను కేవలం 26 పరుగులకే కుప్పకూల్చారు. అయితే పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో మాత్రం బౌలింగ్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ప్రధాన బౌలర్లైన హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్, షహబాజ్ అహ్మద్ కంటే పార్ట్‌టైమ్ బౌలర్ ఆయుష్ బదోని మెరుగైన ప్రభావం చూపించాడు.
పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో హర్షిత్ రాణా 10 ఓవర్లలో 77 పరుగులు సమర్పించుకున్నాడు. నేపాల్‌పై ఆరు వికెట్లు తీసిన ప్రిన్స్ యాదవ్ కూడా పాక్‌తో మ్యాచ్‌లో ప్రభావం చూపలేకపోయాడు. అతడు 60 పరుగులు ఇచ్చాడు. యూఏఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు సమష్టిగా రాణించడం ఎంతో కీలకం. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే భారత్ మూడు మ్యాచ్‌ల్లో నాలుగు పాయింట్లు సాధించి నేరుగా సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తుంది.
వైభవ్ సూర్యవంశీపై ఆశలు..
భారత యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ నుంచి కూడా జట్టు మెరుగైన ప్రదర్శనను ఆశిస్తోంది. 15 ఏళ్ల ఈ యువ బ్యాటర్ నేపాల్‌పై 26 పరుగులు, పాకిస్థాన్ ఏపై 11 పరుగులు మాత్రమే చేశాడు. అతడు మెరుగైన ఆరంభాలను అందించడంలో విఫలం అవుతున్నాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ ప్రస్తుతం టాప్ ఆర్డర్లో ఎక్కువ బాధ్యతను మోస్తున్నాడు. యూఏఈతో మ్యాచ్‌లో ఈ ఇద్దరూ మంచి భాగస్వామ్యం నెలకొల్పితే మిడిల్ ఆర్డర్ బ్యాటర్లపై ఒత్తిడి తగ్గుతుంది.
ముఖ్యంగా భారత్ ముందుగా బ్యాటింగ్ చేయాల్సి వచ్చినా, లక్ష్యాన్ని ఛేదించాల్సి వచ్చినా ఓపెనర్ల పాత్ర కీలకం కానుంది. దోహా పిచ్‌పై మ్యాచ్ సాగుతున్న కొద్దీ బౌలర్లకు అనుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. బంతికి ఎక్కువ గ్రిప్ లభించడంతో బ్యాటింగ్ కష్టంగా మారుతుంది.
పాకిస్థాన్‌తో మ్యాచ్‌లోనూ భారత్ ఈ సమస్యను ఎదుర్కొంది. ముఖ్యంగా కెప్టెన్ తిలక్ వర్మ సెంచరీ చేసినప్పటికీ వేగంగా పరుగులు సాధించడంలో ఇబ్బంది పడ్డాడు.
యూఏఈతో మ్యాచ్‌లో బౌలర్లు కట్టుదిట్టంగా రాణించడంతో పాటు టాప్ ఆర్డర్ బ్యాటర్లు మెరుగైన ఆరంభం ఇస్తే భారత్ సెమీఫైనల్ చేరడం పెద్ద కష్టం కాదు.
ఎక్కడ చూడొచ్చంటే?
భారత కాలమానం ప్రకారం.. భారత్-ఏ వర్సెస్ యూఏఈ మ్యాచ్ ఉదయం 11.30 గంటలకు ప్రారంభం కానుంది. భారత్‌లో ఈ టోర్నీ ప్రసార హక్కులను సోనీ నెట్వర్క్ కలిగి ఉంది. ఈ క్రమంలో టీవీల్లో మ్యాచ్‌లు సోనీ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. ఇక ఓటీటీ విషయానికి వస్తే సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది.
