Delimitation Bill 2026 : డీలిమిటేషన్ వేళ దేశ రాజకీయాల్లో కీలక పరిణామం.. కాంగ్రెస్ సరికొత్త వ్యూహం.. రంగంలోకి ఖర్గే, సోనియా..

Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకోసం ఎన్డీయే ప్రయత్నాలకు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు రంగంలోకి దిగడంతో దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

Delimitation Bill 2026 : కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లుపై రాజకీయ వేడి పెరుగుతోంది. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 3 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లుతో పాటు చట్ట సభల్లో మహిళ రిజర్వేషన్ బిల్లు కూడా ఆమోదం పొందాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందేందుకు ఎన్డీయే కూటమి అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో సరికొత్త వ్యూహాలను అమలు చేస్తోంది.. అయితే, ఎన్డీయే ప్రయత్నాలకు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు రంగంలోకి దిగడంతో దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

Also Read : Big Financial Rules 2026 : డిసెంబర్‌ 1 నుంచి కొత్త రూల్స్.. బ్యాంకింగ్ నుంచి ట్యాక్స్ వరకు రాబోయే అతిపెద్ద ఆర్థిక మార్పులివే..!

డీలిమిటేషన్ బిల్లుపై ఇండియా కూటమి కీలక నిర్ణయం తీసుకుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. పార్లమెంట్‌లో ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. అయితే, ఇండియా కూటమి భాగస్వాములుగా ఉన్న పార్టీలు ఒక్కొక్కటిగా డీలిమిటేషన్ బిల్లుకు జై కొడుతుండటం కాంగ్రెస్ అగ్రనేతలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటి వరకూ ప్రతిపక్షంలో బలంగా కనిపించిన డీఎంకే, శరద్ పవార్ ఎన్సీపీలు 132వ రాజ్యాంగ సవరణ బిల్లుకు మద్దుతు ప్రకటించడం ఎన్డీయే కూటమిలో ఉత్సాహాన్ని నింపగా.. ఇండియా కూటమిలో టెన్షన్ కు కారణమైంది. ఈ క్రమంలో ఎన్డీయే కూటమి వ్యూహాలకు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రంగంలోకి దిగారు.

డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ప్రకటించిన మిత్రపక్షాలైన డీఎంకే, ఎన్సీపీ (శరద్ పవార్) తమ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్, ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్‌తో నేడు సమావేశం కానున్నారు.

ఖర్గే ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు చెన్నైలో ఎంకే స్టాలిన్‌తో భేటీ కానున్నారు. అనంతరం ముంబై వెళ్లి రాత్రి 8 గంటలకు శరద్ పవార్‌తో సమావేశమవుతారు. ఈ భేటీల్లో కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ, రాహుల్ గాంధీతోపాటు కేసీ వేణుగోపాలఉ తదితరులు కూడా పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు ముందు ఈ చర్చలు జరగడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వకుండా ఆయా పార్టీలను ఒప్పించడమే కాంగ్రెస్ అగ్రనేతల ప్రధాన లక్ష్యంగా తెలుస్తోంది. ఖర్గే, సోనియా, రాహుల్ భేటీ తరువాత డీఎంకే, ఎన్సీపీ శరద్ పవార్ ల స్పందన ఏ విధంగా ఉంటుందనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది.

డీలిమిటేషన్ బిల్లుకు 360 మందికిపైగా ఎంపీల మద్దతు కూడగట్టే దిశగా ఎన్డీయే కూటమి వ్యూహాలు అమల చేస్తోంది. లోక్ సభలో మంగళవారం జరిగే ఓటింగ్ లో 364 మందికి తగ్గకుండా ఎంపీలు ఈ బిల్లుకు ఓటేస్తారని అధికార పార్టీ నాయకులు చెబుతున్నారు. ఎన్డీయే కూటమి బలం 320 కాగా.. బయటి నుంచి మద్దతు ఇచ్చే పార్టీల నుంచి 41 మంది ఎంపీలు జతకానున్నారు. వీరిలో డీఎంకే (22), శరద్ పవార్ ఎన్సీపీ (8) ఎంపీలు ఉన్నారు. డీఎంకే అధినేత స్టాలిన్, శరద్ పవార్ లతో ఖర్గే, సోనియాగాంధీ భేటీ కానున్న నేపథ్యంలో వారి నిర్ణయంలో మార్పు ఉంటే ఎన్డీయేకి మళ్లీ నిరాశే ఎదురుకావటం ఖాయంగా కనిపిస్తోంది.