Samajwadi Party Manifesto: మహిళలకు ఏటా రూ.40 వేలు, నిరుద్యోగులకు నెలకు రూ.5 వేలు.. అఖిలేష్ యాదవ్ కీలక హామీలు.. ఎస్పీ మేనిఫెస్టో విడుదల

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల 2027 నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పలు కీలక హామీలతో మేనిఫెస్టోను(Samajwadi Party Manifesto) విడుదల చేశారు.

akhilesh yadav releases samajwadi party manifesto of 2027 up assembly elections

Samajwadi Party Manifesto: ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కీలక మేనిఫెస్టోను విడుదల చేశారు. గురువారం పార్టీ ముఖ్య నాయకులతో కలిసి ‘సత్తాయిస్ కా సంకల్ప్: పీడీఏ కా ప్రాణ్ పత్ర-జన్-మన్ కా మేనిఫెస్టో 2027(Samajwadi Party Manifesto)’ పేరిట ఈ ప్రాణ్ పత్రాన్ని ఆవిష్కరించారు. రాబోయే ఐదేళ్లలో 25 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల కల్పనతో పాటు నిరుద్యోగ పట్టభద్రులకు నెలకు రూ.5 వేల నిరుద్యోగ భృతి, మహిళలకు ఏటా రూ.40 వేల ఆర్థిక సాయం, తక్షణ రైతు రుణమాఫీ వంటి అనేక కీలక హామీలను ఇందులో పొందుపరిచారు. 23 పంటలు, పాలకు కనీస మద్దతు ధర కల్పిస్తామని ప్రకటించారు.

Etala Rajender: రేవంత్‌ రెడ్డి భ్రమల్లో బతుకుతున్నారు.. నెక్స్ట్ ఎలెక్షన్స్ లో ఓటమి తప్పదు.. ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు!

ఉపాధి అవకాశాలు, జాబ్ క్యాలెండర్.. నైపుణ్య శిక్షణ కేంద్రాల ఏర్పాటు:

ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు రాబోయే ఐదేళ్లలో ఇతర రంగాలలో మరో రెండు నుంచి మూడు కోట్ల ఉపాధి అవకాశాలను కల్పిస్తామని మేనిఫెస్టోలో స్పష్టం చేశారు. నియామకాలలో జాప్యం, అవకతవకలను నివారించేందుకు జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించారు. ఒకే దశ పరీక్ష ఉన్న నియామకాలను మూడు నెలల్లోగా, బహుళ దశల ప్రక్రియలను ఆరు నెలల్లోగా పూర్తి చేస్తామని తెలిపారు. ఏటా 5 లక్షల మంది యువతకు శిక్షణ ఇచ్చేందుకు నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

రైతులకు ఎంఎస్‌పీ, ఉచిత విద్యుత్.. కార్పస్ ఫండ్‌తో చెరకు బకాయిల చెల్లింపు:

కనీస మద్దతు ధర పరిధిలో లేని బంగాళదుంప, టమోటా, ఉల్లిపాయ వంటి పంటలకు ధరల పరిహారం అందిస్తామని ఎస్పీ హామీ ఇచ్చింది. వ్యవసాయ నీటిపారుదలకు ఉచిత విద్యుత్, గ్రామీణ గృహ వినియోగదారులకు 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తామని పేర్కొంది. చెరకు రైతులకు 24 గంటల్లోగా చెల్లింపులు అందేలా రూ.15 వేల కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తామని, సాగు వ్యయం ఆధారంగా ఏటా చెరకు ధర పెంచుతామని తెలిపింది. గ్రామీణ మౌలిక సదుపాయాల కోసం రూ.1.5 లక్షల కోట్లు కేటాయించనున్నట్లు ప్రకటించింది.

విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి.. మూతపడిన పాఠశాలలు, రూ.10 లక్షల బీమా:

మూసివేసిన 26,000 ప్రాథమిక పాఠశాలలను తిరిగి తెరుస్తామని, 12వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌ల పథకాన్ని పునరుద్ధరిస్తామని అఖిలేష్ యాదవ్ హామీ ఇచ్చారు. అన్ని ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల్లో వై-ఫై సౌకర్యం, రాష్ట్ర జీడీపీలో 6 శాతం విద్యకు కేటాయింపు, ఏడాదిలోగా ఖాళీల భర్తీ వంటివి ప్రకటించారు. వైద్య రంగంలో బీపీఎల్ కుటుంబాలకు రూ.10 లక్షల ఆరోగ్య బీమా, పేద, పీడీఏ వర్గాలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత చికిత్స, జిల్లా ఆసుపత్రుల్లో ఐసీయూ, వెంటిలేటర్ వసతులు, 18 డివిజన్లలో సూపర్-స్పెషాలిటీ ఆసుపత్రులు, గ్రామీణ ప్రాంతాల్లో ఐదు కొత్త ఆసుపత్రుల నిర్మాణాన్ని ప్రతిపాదించారు.