Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కును ఢీకొన్న భక్తుల వాహనం.. ఒకే ఫ్యామిలీకి చెందిన 9 మంది మృతి
Rajasthan Road Accident : రాజస్థాన్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది మరణించారు.
- Harish Thanniru
- Published on- November 22, 2026 / 08:19 AM IST
Rajasthan Road Accident
Rajasthan Road Accident : రాజస్థాన్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భక్తులతో వెళ్తున్న క్రూయిజర్ వాహనం రోడ్డు పక్కన నిలిపి ఉన్న ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఒకే ఫ్యామిలీకి చెందిన తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. దీంతో బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
కోటా జిల్లాలో కోటా-ఉదయ్‌పూర్ జాతీయ రహదారిపై శంభుపురా గ్రామ సమీపంలో శనివారం అర్ధరాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో వాహనంలో మొత్తం 16 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
ప్రమాదంలో మృతులు మహారాష్ట్రకు చెందిన ఒకే కుటుంబ సభ్యులుగా గుర్తించారు. రాజస్థాన్‌లోని ప్రముఖ ఖాటుశ్యామ్ ఆలయాన్ని దర్శించుకుని తిరిగి మహారాష్ట్రకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద తీవ్రతకు క్రూయిజర్ వాహనం పూర్తిగా ధ్వంసమైంది. దీంతో తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు.
ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని కోటా అదనపు జిల్లా కలెక్టర్ రాజేశ్ జోషి తెలిపారు. మరోవైపు.. మృతదేహాలకు పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘోర ప్రమాదంతో ఒకే కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
