Gold Adulteration Exposed : బంగారం కొంటున్నారా? తస్మాత్ జాగ్రత్త.. చైనా రేణియం గుట్టురట్టు.. పరీక్షల్లోనూ దొరకని కల్తీ!

Gold Adulteration Exposed : బంగారంలో చైనా రేణియం పొడి కలిపి బరువు పెంచుతున్న కల్తీ బాగోతం వెలుగులోకి వచ్చింది. హాల్‌మార్కింగ్ యంత్రాలకే దొరకని ఈ మోసం వెనుక అసలు విషయం ఏంటి? 22 క్యారెట్ల పేరుతో 20 క్యారెట్ల బంగారం విక్రయంపై గుట్టురట్టుయింది.

Gold Adulteration Exposed

  • బంగారంలో చైనా పొడి కల్తీ..
  • 22 క్యారెట్లంటూ 20 క్యారెట్ల బంగారం విక్రయం
  • బరువు పెంచే చైనా రేణియం గుట్టురట్టు
  • యంత్రాలనూ బోల్తా కొట్టిస్తున్న రేణియం

Gold Adulteration Exposed : బంగారం అంటేనే భరోసా.. కష్టపడి సంపాదించిన డబ్బుతో కొనుక్కునే ఆభరణం. చాలామంది భారతీయులకు సెంటిమెంట్ కూడా.. అలాంటి బంగారంలోనే కొత్త తరహా కల్తీ వెలుగులోకి రావడం ఇప్పుడు కొనుగోలుదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. చైనా నుంచి వస్తున్న రేణియం (Rhenium) అనే పొడిని బంగారంలో కలిపి, అసలు బంగారం బరువును పెంచుతున్నారనే వ్యవహారం సంచలనం రేపుతోంది.

మరీ విచిత్రమేంటంటే.. ఈ కల్తీని సాధారణ పరీక్షలే కాదు, కొన్ని హాల్‌మార్కింగ్ యంత్రాలు కూడా గుర్తించలేకపోయినట్లు ఓ పరిశోధనాత్మక కథనం వెల్లడించింది. ఇంతకీ మీరు కొనే బంగారం కల్తీనా? కాదా? తెలుసుకోవడం కూడా కష్టంగానే కనిపిస్తోంది..

గ్రాము పొడితో బంగారం బరువు పెంపు :
నివేదిక వివరాల ప్రకారం.. 7.830 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారంలో ఒక గ్రాము రేణియం పొడిని కలపడంతో మొత్తం బరువు 8.830 గ్రాములకు పెరిగింది. అయితే, పరీక్షలో మాత్రం ఈ మిశ్రమాన్ని 24 క్యారెట్ల బంగారంగానే యంత్రం గుర్తించింది. ఆ తర్వాత మరో లోహాన్ని కలిపి 22 క్యారెట్ల ఆభరణంగా తయారు చేశారు..

Read Also : Cyclone Akvan Alert : అక్వాన్ తుఫాన్ దిశ మార్పు.. తెలంగాణకు వర్షగండం! ఆ రోజు నుంచి భారీ వానలు?

22 క్యారెట్ల పేరుతో 20 క్యారెట్ల బంగారం :
ఈ ఆభరణాన్ని హాల్‌మార్కింగ్ కేంద్రంలో పరీక్షించగా 22 క్యారెట్లు.. అంటే 91.6 శాతం స్వచ్ఛత ఉన్నట్లు నివేదిక వచ్చింది. కానీ, అసలు లెక్కలు చూస్తే.. అందులో బంగారం శాతం కేవలం 81.73 మాత్రమేనని తేలింది. అంటే.. కొనుగోలుదారుడికి 22 క్యారెట్ల పేరుతో దాదాపు 20 క్యారెట్ల బంగారం అంటగట్టినట్లే కదా..

యంత్రాలకే దొరకని కల్తీ.. :
మరో షాకింగ్ విషయం ఏంటంటే.. బ్రాండెడ్ షోరూమ్‌తో పాటు ఇతర పరీక్షా కేంద్రాల్లోనూ ఈ కల్తీని గుర్తించలేకపోయినట్లు ఇందులో తేలింది. తులం బంగారం కొనుగోలులోనే వేల రూపాయల నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. బంగారం కొనుగోలుదారులకు తీరని నష్టంగా చెప్పొచ్చు..

అయితే, ఈ ఒక్క ఉదంతంతో మార్కెట్లోని బంగారమంతా కల్తీ అని భావించకూడదు. కానీ, బంగారం కొనేటప్పుడు నమ్మకమైన దుకాణాన్ని ఎంచుకోవడం, హాల్‌మార్క్ (HUID) వివరాలను చెక్ చేయడం, అవసరమైతే స్వతంత్రంగా స్వచ్ఛత టెస్టింగ్ చేయించుకోవడం చాలా ముఖ్యం. మెరుపును చూసి మురిసిపోవడం కాదు.. మనం పెట్టిన డబ్బుకు తగినంత స్వచ్ఛమైన బంగారం వస్తోందా లేదా అన్నదే అసలు విషయం..